- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినాష్ అరెస్ట్ ఆపుతోందెవరు!?
అవినీతి పరుల, హంతకుల, అక్రమార్కుల భరతం పట్టేందుకు 1963 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఫూల్స్ డే నాడు సీబీఐ ఆవిర్భవించింది. రాను, రాను సీబీఐ పనితీరు అవినీతి, హంతకుల కేసులు విచారణను ఫూల్స్ చేయడమే పనిగా పెట్టుకొన్నది. ఏటా రూ. 800 కోట్లకు పైగా ప్రజాధనంతో నడుస్తున్న సీబీఐ రికార్డును గమనిస్తే, నేడు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఎంత నేలబారుగా అఘోరిస్తుందో బోధపడుతుంది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఉన్నది ఎవరి కోసం? ఇటువంటి దమ్ములేని దర్యాప్తు సంస్థ ఎవరి కోసం అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. అవినీతి పరులకు, హత్య కేసుల్లో నిందితులను అండగా నిలవడానికేనా? అవినీతి, హత్యల కేసుల్లో వేట కుక్క కావాల్సిన సీబీఐ అవినీతిపరులను, హంతకులను కాపాడటం ఏమిటి?
అరెస్టు చేయడానికి ఆపసోపాలా?
పాలకుల రాజకీయ ప్రయోజనం చేకూర్చే పనిముట్టుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నది సీబీఐ. కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకగా సీబీఐ మారిందని కోర్టులు అనేక సార్లు మొట్టికాయలు వేసినా మార్పు లేదు. వివేకా హత్య తాలూకు ఆనవాళ్లు తుడిచి వెయ్యడంలోనూ, గుండెపోటు కథ అల్లడంలోనూ అవినాష్ కీలక పాత్ర అని కోర్టుకు నివేదించింది సీబీఐ. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు సుప్రీంకోర్టుకు సీబీఐ పలు సందర్భాల్లో వెల్లడించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తు జరపాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టే సీబీఐని ఆదేశించింది. మొదట అవినాశ్ ప్రధాన అనుచరుడు ఉదయ్‌కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసారు. ఆ తర్వాత అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో తర్వాత అరెస్టు అవినాశ్ రెడ్డిదే అని అందరు భావించారు. ఈ పరిస్థితుల్లో అవినాశ్ అరెస్టుకు ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదు. అయినా ఎప్పటి లాగానే అవినాష్ అరెస్టు విషయంలో ఉత్కంఠ కొనసాగడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.
అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోతుందా? ఆయనేమైనా గొప్ప ప్రజా నాయకుడా? అవినాష్ రెడ్డిని అరెస్టు చెయ్యడం సీబీఐకి తలకు మించిన భారంగా పరిణమించిందా? సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చెయ్యలేని అవసాన దశలో వున్నదా? అవినాష్‌ను అరెస్టు చెయ్యడానికి సీబీఐ ఎందుకు ఆపసోపాలు పడుతోంది? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మూడు సార్లు సీబీఐ నోటీసులు ఇచ్చినా అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదంటే సీబీఐ అంటే ఆయనకు ఎంత లెక్కలేనితనమో అర్ధం అవుతుంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆయన అనుచరగణం అరాచకం చేస్తుంటే రాష్ట్ర పోలీసులు చోద్యం చూడటం ఏమిటి? పోలీసులు వున్నది ఎవరికోసం?
ఆ అనుబంధమే కారణామా!?
దేశంలో అధికారంలో వున్నవారు ఉగ్ర మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటే దానికి దీటైన జవాబు ఇవ్వాల్సిన బాధ్యత సీబీఐకి లేదా? అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ దాగుడు మూతలు ఆడుతున్నట్లు అర్ధం అవుతుంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో అడ్డంకులు లేకపోయినా సీబీఐ ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఏవో అదృశ్య శక్తులు అడ్డుకొంటున్నాయన్న అనుమానం కలుగుతుంది. ప్రతి పక్షాలు కాలు కదిపినా, నోరు మెదిపినా కేసులు, ఆంక్షలతో అణచి వేస్తున్న పోలీసులు అడుగడుగునా అధికార పక్షానికి మడుగులొత్తుతూ వారి సేవలో పునీతమవుతున్నారు. జగన్ దుష్పరిపాలనలో ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిందో ఈ మధ్య సుప్రీంకోర్టు వ్యాఖ్యలే సాక్ష్యం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. గజదొంగలు, ఖూనీకోరుల ఒంటిపై ఈగైనా వాలకుండా కాచుకోవడానికేనా పోలీసులు వున్నదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పై వారి ఆదేశాల ప్రకారం పోలీసులు ప్రత్యేక అజెండా అమలు చేస్తున్నారు.
అవినాష్ రెడ్డి అరెస్టు కాకపోవడానికి బీజేపీ -వైసీపీ మధ్య అనుబంధం కూడా ఒక కారణం అని ప్రజలే అంటున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూక్తి అవినాష్ రెడ్డి విషయంలో ఎందుకు అమలు కావడం లేదు అంటున్నారు ప్రజలు. కేంద్రం జగన్ కు ఈడీ, సీబీఐ కేసులకే కాదు బాబాయ్ వివేకా హత్య కేసులలోనూ అండగా నిలుస్తున్నది. వివేకానంద రెడ్డి హత్యకు కారకులు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయాలని సీబీఐ అధికారులు అనుకొన్నా అవినాష్ రెడ్డి విషయానికి వచ్చేసరికి అది జరగలేదంటే ఇందులో కూడా కేంద్ర పెద్దల సూచనల మేరకే సీబీఐ వ్యవహరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. కేంద్రంతో జగన్ అనుబంధ ఫలితమే అని చెప్పాలి. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వక పోయినా తనకేసులు, అవినాష్ రెడ్డి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కేసులనుంచి ఉపశమనం పొందుతున్నారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తూ ప్రధాన కేసులన్నింటినీ నీరుకారుస్తున్నది. ఇది కేంద్రంతో జగన్ అనుబంధం ఫలితమే అని చెప్పాలి. దేశంలో రాజకీయ నేతల ప్రమేయం ఉన్న నేరాల్లో వ్యవస్థల పనితీరు ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్న వారికి ఒక విధంగా, సామాన్యుల విషయంలో మరో రకంగా వ్యవస్థల పనితీరు ఉందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది. దానికి జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కేసులే ఉదాహరణ. వ్యవస్థల్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావన ప్రజల్లో పెరిగిపోతోంది. ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు. అవినీతి పరులకు, హంతకులకు శిక్షలు వెయ్యడంలో సీబీఐ విశ్వసనీయత పాతాళానికి నెట్టబడింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుగడించిన సీబీఐ నేడు దమ్ములేని దర్యాప్తు సంస్థగా దిగజారిపోవడం బాధాకరం.
ఏళ్ళకు ఏళ్ళుగా సాగదీస్తూ..
నిత్యం అరిచే పిల్లి ఎలుకలను పట్టదట. ఆ చందంగానే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు కూడా అవినీతి పరులను, హంతకులను పట్టుకొని వారిపై అభియోగాలు నిరూపించి శిక్షలు వెయ్యడమే ఆలస్యం అన్నట్లు మొదట హడావుడి చేస్తాయి. కానీ తరువాత వారు చేపట్టిన కేసులు ఏ దశలో ఉన్నాయో, ఏ తీరానికి చేరుతున్నాయో ఎవరికీ తెలియదు. తాము ఎదో చేస్తున్నట్లు ప్రజలను ఏ మార్చడంలో మాత్రం సీబీఐ, ఈడీ లు ఆరితేరాయి. ఎక్కడ కుంభకోణం బయటపడినా, ప్రముఖుల హత్యలు జరిగినా సీబీఐ,ఈడీ లు తెరపైకి వస్తాయి. తర్వాత ఏళ్ల తరబడి ఆ కేసులు సాగదీస్తున్నారు. ఈ లోగా అవినీతి పరులు, హంతకులు బెయిల్‌పై బయటకు వస్తున్నారు. ధర్మ విజేతలుగా ఊరేగుతున్నారు. మూర్తీభవించిన ధర్మ ప్రభువులుగా రాజకీయ పార్టీలు పెట్టి సంక్షేమ రాజ్య విధాతలుగా ప్రచారం చేసుకొని అధికార పీఠాలు ఎక్కి తాము దిగమింగిన జనం సొమ్ముతోనే న్యాయ పోరాటం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల అసమర్ధత, అలసత్యం, రాజకీయ జోక్యం కారణంగా దేశం, రాష్ట్రం, అవినీతి పరులకు, హంతకులకు స్వర్గధామంగా వర్ధిల్లుతున్నాయి. వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో పాత్రధారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ఇప్పటికే రుజువు అయినందున దోషులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత సీబీఐపై వుంది. వివేకా హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి సీబీఐ తన విశ్వసనీయతను నిరూపించుకోవాల్సి వుంది. లేకుంటే సీబీఐ దర్యాప్తు సంస్థను మూసి వేయడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Buddha Venkanna: జగన్ సూత్రధారి.. అవినాశ్ పాత్రధారి
సీఎం జగన్‌తో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా భేటీ
నీరుకొండ ప్రసాద్
9849625610