మమ్మల్ని గ్రూప్-2లో కలపండి!

by Ravi |   ( Updated:2025-03-07 01:00:58.0  )
మమ్మల్ని గ్రూప్-2లో కలపండి!
X

తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల జాబితాలో పేర్కొనబడిన (59) కులాల్లో మాంగ్ (Mang) కులం ఒకటి. వీరి మాతృ భాష 'మరాఠీ'. వీరు ఎక్కువగా దేశంలోని పదకొండు రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. తెలంగాణాలో నివసించే వారిలో దాదాపు 90% మంది కాయకష్టం చేసే నిరుపేదలు..

లక్షకు పైనే జనాభా

అయితే, గతంలో మాంగ్ కులం ప్రజలు నిరక్షరాస్యత, పేదరికం కారణంగా ఆర్‌డీఓ కార్యాలయం నుంచి కులం సర్టిఫికెట్ పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను భరించలేక, తహశీల్దార్ కార్యాలయం నుంచి కులం సర్టిఫికెట్ సులభంగా పొందడానికి అవకాశం ఉన్న కులం పేర్లతో కులం పత్రం పొంది, దానినే కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన కుల గణనలో కూడా అదే పునరావృతం అయ్యింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఉప వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ నివేదిక ప్రకారం కమిషన్ మాంగ్ కులాన్ని అత్యంత వెనుకబడిన కులంగా గుర్తించి గ్రూప్-1లో చేర్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో హిందూ, సిక్కు, బౌద్ధ మతమును కలిపి మాంగ్ సమాజ్ ప్రజల మొత్తం జనాభా 13,365గా నమోదైంది. కానీ నిజానికి వారి జనాభా లక్ష పైచిలుకు ఉంటుంది. కారణం జనాభా లెక్కలో నిజమైన కులం పేరు లేకపోవడం ప్రస్తుత వర్గీకరణ కమిషన్ సైతం వీరి జనాభా 13,260గా చూపెట్టింది.

వేరే కులం పేరుతో పత్రం

ప్రస్తుత ఎస్సీ వర్గీకరణలో మాంగ్ కులాన్ని గ్రూప్-1 కిందికి చేర్చారు. ఈ చర్య మాంగ్ కులం ప్రజలలో తీవ్ర ఆందోళనకు, మనోవేదనకు కారణమయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎస్సీ వర్గీకరణలో, మాంగ్ కులంను గ్రూప్- Bలో ఉంచడం వలన, కొంత మందికి ఉద్యోగాలు లభిం చాయి. పైగా మాంగ్, మాదిగ కులాలకు సారూప్య లక్షణాలు కూడా ఉన్నాయి. వీరి సహవాసాలు కూడా దగ్గరగా ఉంటాయి. పైగా వీరు కులం పత్రం పొందడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా, త్యధికమంది తహశీల్దార్ కార్యాలయం నుంచి 'మాదిగ' కులం పేరుతో కులం పత్రాలు తీసుకున్నారు. కావున వర్గీకరణలో వీరి కులాన్ని గ్రూప్ -1లో ఉంచడం, ఏ మాత్రం ప్రయోజనం కాదు. ఇది తెలంగాణాలో వారి అస్థిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

తహశీల్దార్ కుల పత్రం ఇచ్చేలా..

ఏక సభ్య కమిషన్ మాంగ్ కులాన్ని ఎస్సీ ఉప వర్గీకరణలో కేటగిరి-1 కిందికి చేర్చడాన్ని మరోసారి పునఃపరిశీలన చేసి, గతంలో మాదిరిగా ఉంచి సామాజిక న్యాయం చేయాలి. త్వరలో ప్రభుత్వం వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో భాగంగా, ఎస్సీ ఉప వర్గీకరణ తెలంగాణలో నివసించే మాంగ్ సమాజానికీ శాపంగా మారకుండాతగు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అలాగే మాంగ్ సమాజ్ ప్రజలకు కులం పత్రం ఆర్‌డీఓ ద్వారా కాకుండా తహశీల్దార్ కార్యాలయం ద్వారా చేయాలనీ ఒకవేళ గతంలో మాంగ్ కులం వారు ఎవరైనా తప్పుగా ఇతర కులాల పేర్లతో కులం పత్రం తీసుకుని ఉంటే వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా మాంగ్ కులం పత్రం తీసుకునే విధంగా న్యాయం చేయాలనీ కోరుతున్నాం.

- గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్

రాష్ట్ర అధ్యక్షులు మాంగ్ సమాజ్

81065 49807

Next Story

Most Viewed