- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Teacher Transfers: ఉపాధ్యాయ బదిలీల మాటున టీచర్ పోస్టులు రద్దు చేస్తున్నారా?
ఉపాధ్యాయ బదిలీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైలా పచ్చీసు ఆడుతోంది. ఏదైనా ఒక వ్యవస్థలో విధానపర నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని భావించినప్పుడు ఆ వ్యవస్థ సంబంధీకులతో కనీస సంప్రదింపులు జరపడం ఒక సంప్రదాయం. కానీ, ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయుల బదీలీలను(teacher transfers) ఆషామాషీగా తీసుకుంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతినివ్వగానే ప్రభుత్వం చేత కితాబు పొందాలని ఉవ్విళ్లూరిన అధికారులు 'లేడికి లేచిందే పరుగుగా' వ్యవహరించారు. ఈ వైఖరి ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను శాపగ్రస్థం చేసింది.
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టినా, రేషనలైజేషన్ చేసినా, పాయింట్లపై రాయబారాలు నడిపినా, న్యాయపోరాటాలకు దిగినా, ఆందోళనలు చేపట్టినా వారి అంతిమ లక్ష్యం విద్యార్థి, పాఠశాల మనుగడ అయి ఉండాలి. కానీ అవన్నింటినీ గాలికి వదిలి రెండువైపులా స్వీయ ప్రయోజనాలే పాకులాడుతున్న క్రమాన్ని సమాజం ఏ విధంగా అర్థం చేసుకోవాలి.
ఎన్నో సందేహాలు
ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్యలో కోత విధించాలని భావించవచ్చు. అంతేకానీ, లాభాలు లేని వ్యవస్థగా మార్చి క్రమేపీ భారం తగ్గించుకోవాలని చూడకూడదు. ప్రభుత్వం తడిసి మోపడవుతున్న బడ్జెట్ ను అదుపు చేసే ప్రయత్నంలో ఉపాధ్యాయులను సాధింపులకు గురిచేసే ప్రయత్నమైనా సరే, అది విద్యారంగాన్ని సంస్కరించాలనే విశాల ధృక్పథమై ఉండాలి. వాస్తవానికి బదిలీలు వేసవి సెలవులలో చేపట్టడం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శ్రేయోదాయకం. కానీ, ప్రయోజనకర విధానాలపై ఆసక్తి చూపని ప్రభుత్వం మరో నాలుగు నెలలలో విద్యా సంవత్సరం ముగుస్తున్న దశలో బదిలీలు చేపట్టడంపై స్తబ్దుగా ఉండిపోయిన ప్రభుత్వం అకస్మాత్తుగా రేషనలైజేషన్(rationalisation) ప్రక్రియను తెరపైకి తెచ్చి ప్రభుత్వం అసలు ఆనవాళ్లు బయటకి పొక్కకుండా వివిధ సమస్యలకు ఆజ్యం పోసింది. బదిలీల పర్వంలో ఒకనాటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఇప్పటి కౌన్సెలింగ్ ప్రక్రియకు దోహదం చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఇదే విధానంలో ఎన్నో బదిలీలు జరిగాయి. ఇప్పుడు ఎదురైనన్ని సందేహాలు ఎప్పుడూ తారసపడలేదు. ప్రభుత్వ కనుసన్నలలో అధికారులలో ఉపాధ్యాయుల పట్ల ఏర్పడిన అణచివేత అనే జాఢ్యం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఈ కౌన్సెలింగ్ విధానమే ఈనాడు ఉపాధ్యాయుల జీవితాలలో విధ్వంసం సృష్టిస్తోంది. ఉపాధ్యాయులను గ్రూపులుగా విడగొట్టి, విద్వేషాలకు ఆజ్యం పోసింది. దీంతో పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
విద్యా సంవత్సరం సంఘాలు వివిధ సమస్యలను ప్రస్తావించడం వాటిపై సమావేశాలు నిర్వహించడం అందులో సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలపడం, తదనంతరం వాటిపై భిన్న విధానాలు ప్రకటించడం ఇలా గంటగంటకి జాబితాలు మారుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులలో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడుతోంది. ప్రభుత్వ విధానాల వలన ఉపాధ్యాయ సంఘాల మాట చెల్లుబాటు కాకుండా పోయింది. ప్రభుత్వ అనుకూల సంఘాల సంగతి పక్కకి పెడితే సామాజిక కోణంలో పనిచేస్తున్న ఏపీటీఎఫ్ లాంటి సంఘాలకు ఇది ఇబ్బందికర పరిస్థితి. ప్రభుత్వం ఉపాధ్యాయులను ఉద్యోగ సంఘాల పైకి ఉసిగొల్పేలా చేసింది. ఇది సంఘాల ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్ర చేసి గడిచిన వారం రోజులుగా వారికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ప్రభుత్వ విధానాల వలన వారి లక్ష్యం నెరవేరి ఉండొచ్చు కానీ విద్య వ్యవస్థ మొత్తం త్రిశంకుస్వర్గం లోకి నెట్టబడింది. పాతిక వేల పైబడి ఉపాధ్యాయ ఖాళీల నుండి భర్తీ చేయాల్సిన పరిస్థితి నుంచి పాతిక వేల పోస్టులు మిగులు తేల్చే స్థాయికి ప్రభుత్వం చేసిన కసరత్తు ఫలితాలను సాధించింది. ప్రభుత్వ పొంతన లేని విధానాల పుణ్యమా! అని అసలు ఒక సమగ్ర విధానమే లేకుండా పోయింది.
ముందుగా దానిని సవరించాలి
పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రభుత్వం చెప్పింది. నిజమే కానీ, మెర్జ్ అయిన పాఠశాలలకు (3-10 తరగతుల) మాత్రమే ఈ అవకాశం ఉంది. మరి 98 లోపు విద్యార్థులున్న పాఠశాలలకు సబ్జెక్ట్ టీచర్లు అవసరం లేదా? ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు అక్కర్లేదా? 2021కి ముందు ప్రాథమికోన్నత పాఠశాలల బలోపేతానికి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పోస్టులు రద్దు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులు ఎవరి పాపం? 13 లక్షల ఉద్యోగులు ఉన్న రైల్వే బదిలీలలోనూ ఇంతటి రాద్దాంతం లేదు మరి ఏపీ లోనే ఈ గొడవేంటి? దీనికి పూర్వాపరాలను సమీక్షించాలి. జీఓ 117( మాతృభాషలో విద్యాబోధన) అంశంపై ఉన్న కేసు కొలిక్కి రాకముందే ప్రభుత్వం బదిలీలకు తెర లేపడం సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చడమే. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడం చారిత్రక నేరం. ముందుగా దానిని సవరించకుండా ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరే! పాఠశాల అందుబాటులో ఉండాలనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండానే సదరు స్కూళ్లకు గడియలు వేసింది. దీంతో పాఠశాల ఇక్కడే ఉండాలనే కొరికతో కొంతమంది, హక్కుల కోసం కొంతమంది న్యాయస్థానం తలుపు తట్టి వందల కేసులు వేశారు. బదిలీలు సజావుగా నిర్వహించాలనే ఆసక్తి ప్రభుత్వానికి లేదని అందుకే అందులో అర్థవంత ప్రతిపాదనలు లేవు. అందుకే ఉపాధ్యాయులు న్యాయం కోసం ఘోషిస్తున్నారనేది వాస్తవం.
అందరికీ సహజ న్యాయం జరిపించాలనే స్పృహ అధికారులలో కొరవడిన నేపథ్యంలో సవాలక్ష సమస్యలకు అంకురార్పణ జరిగింది. అందువలనే అనేకమంది కోర్టులలో న్యాయం కోసం కేసులు వేశారు. ఇలా ఉపాధ్యాయుల జీవితాలు ఒక సమస్య నుంచి మరో సమస్యకు చేసే ప్రయాణంగాను బహుదూరపు బాటసారిగా మిగిలిపోతున్నారు. అందుకే తమ డిమాండ్లయినా స్పాజ్ పాయింట్లు, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, రేషనలైజేషన్, ఓల్డ్ స్టేషన్ పాయింట్స్, ప్రమోషన్ వేకెన్సీ ఖాళీల ప్రదర్శన రద్దు డిమాండ్లను ముందుంచారు. అలాగే ఒక ప్లేస్ లో నియామకం పొందాక అక్కడే 8 సంవత్సరాల పాటు కొనసాగించడం, సీనియర్లకు న్యాయం చేయాలని డిమాండ్ ను సైతం అనేక గొంతుకలు ఘోషిస్తున్నాయి. బదిలీల దరఖాస్తుల వలన తమకు ఆయాచితంగా ఎదురైన సమస్యల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బదిలీలకు ఒక శాశ్వత కోడ్ ఉంటే బాగుంటుందనే డిమాండ్ మరింత ఊపందుకుంది. అసమతుల్యతకు మారుపేరుగా మిగిలిన జీఓ 187 కు బదులు శాశ్వత కోడ్ ఆవశ్యకతను గుర్తు చేసింది.
మోహన్‌దాస్
రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్ 1938
94908 09909
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
Ampasayya Naveen: చైతన్య స్రవంతి శిల్పి అంపశయ్య నవీన్