కుల ధ్రువీకరణ పత్రాల్లో మూల మలుపు..

by Vinod kumar |   ( Updated:2023-05-02 23:30:28.0  )
కుల ధ్రువీకరణ పత్రాల్లో మూల మలుపు..
X

ప్రభుత్వానికి సమస్య పట్ల అవగాహన, పరిష్కారం పట్ల చిత్తశుద్ధి, స్పందించే గుణంలో సున్నితత్వం ఉంటేనే సుపరిపాలన సాధ్యం. నేడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఒక నూతన విధానం ఎంతో ప్రశంసనీయం. పదవ తరగతి దాటిన విద్యార్థులకు దరఖాస్తుతో సంబంధం లేకుండానే కుల ధ్రువీకరణ పత్రాలు అందజెయ్యడం ఒక మంచి ప్రయత్నం. సున్నితమైన స్పందనకు నిదర్శనం. పైకి చిన్న విషయంగా కనబడుతున్నా కులధ్రువీకరణ పత్రాలు సంపాదించడానికి ఆయా వర్గాలు, ప్రత్యేకించి పేదలు, ఆదివాసీలు, దళితులు ఎంత కష్టపడాల్సి వస్తుందో చెప్పనలవి కాదు. పదవ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ పూర్తిచేసి పై చదువు కోసం దరఖాస్తు చేస్తే కులధ్రువీకరణ పత్రం జత చెయ్యడం తప్పనిసరి. ఒక వైపు జాయిన్ అవ్వాల్సిన సమయం దాటిపోతోంది.

మరో వైపు ఎప్పటికీ సంబంధిత కార్యాలయం, (మండల కేంద్రంలో ఉంటుంది) నుండి ఉలుకూపలుకు ఉండదు. ఫైల్ సులభంగా కదలదు. కదిలించుకోగల శక్తి పేద కుటుంబానికి ఉండదు. దానితో బాటు ఆ పత్రాలకై విపరీతమైన రద్దీ ఒకేసారి ఉంటోందని అధికారుల వైపు నుండి ఒక వాదన. వెరసి పాస్ అవ్వడం కన్నా,ఆయా పత్రాలు పొందడం పెద్ద గగనం. ఒక్కోసారి ఈ ఒక్క కారణంతోనే ఒక విద్యాసంవత్సరం కోల్పోవడం కూడా అసాధారణం కాదు. నాకు, నాలాంటి ఎంతోమందికి ఇది ప్రత్యక్ష అనుభవం. వారాలు, వారాలు ఇదే పనిమీద మా పేద తలిదండ్రులు పనులన్నీ పక్కనబెట్టి కార్యాలయాల చుట్టూ తిరిగేవారు.

పత్రం చేతికందిన రోజు ఫస్ట్ క్లాస్ లో పాసవ్వడం కన్నా గొప్పగా ఉండేది. తర్వాత మీసేవ కేంద్రాలు వచ్చాక గత కొన్నేళ్లుగా పరిస్థితి కొంత కుదుటపడింది. అప్పటిలా అంత స్థాయి పోరాటం లేకపోయినా కొంత సులభ సాధ్యమయ్యింది. రొటీన్ గా రావాల్సిన పత్రాలకి కూడా పెద్దల సిఫార్సులు అవసరమయ్యే పరిస్థితి. ఆ కష్టం తెలిసిన వారికి ఈరోజు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం ఎంత గొప్పదో, ప్రజల పట్ల ఎంత గౌరవప్రదమైన స్పందనో అన్నది అర్ధమౌతుంది. 40 లక్షల కుటుంబాలకు,10 లక్షల మంది పదవ తరగతి విద్యార్థులకు అడగకుండానే వారివారి కులధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచడం, అందించడం గొప్పమేలు. ఈ దిశగా ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అభినందనలు.

- డా. డి.వి.జి. శంకర రావు,

మాజీ ఎంపీ, పార్వతీపురం

94408 36931

Advertisement

Next Story