పేరుకే అద్దాల బిల్డింగ్‌లో ఉద్యోగం.. కానీ వారి బాధలు వర్ణనాతీతం.

by Ravi |   ( Updated:2025-04-22 01:00:19.0  )
పేరుకే అద్దాల బిల్డింగ్‌లో ఉద్యోగం.. కానీ వారి బాధలు వర్ణనాతీతం.
X

ఒక సమాజ అభివృద్ధి గొప్పగా నిలవాలంటే, విద్యా వ్యవస్థ బలంగా ఉండాలి. ఆ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ అధ్యాపకులు కూడా సమానమైన పాత్ర పోషిస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు లభించే సదుపాయాలు, భద్రత ప్రైవేట్ అధ్యాపకులకు దాదాపుగా ఉండదు.

ప్రైవేట్ టీచర్లకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం వంటి అంశాల్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మే నెల వచ్చిందంటే ప్రైవేట్ ఉపాధ్యాయులకు, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్స్ అయితే ఫిబ్రవరి చివరి వారం నుండే నెల జీతం ఉండదు. వారి బాధలు వర్ణనాతీతం.

ఈ అధ్యాపకుల సమస్యలు..

ప్రైవేట్ స్కూళ్లలో, కళాశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు చాలా తక్కువ వేతనం ఇస్తున్నారు. వారికి కనీస జీతం, భద్రత లేకపోవడంతో వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రైవేట్ టీచర్స్‌కు ఎలాంటి ఉద్యోగ భద్రతా ఉండదు. స్కూల్ యాజమాన్యాల నిర్ణయాల మేరకు ఎప్పుడైనా ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు లభించే సెలవులు, ప్రైవేట్ టీచర్స్‌కు దొరకవు. పైగా పెన్షన్, మెడికల్ భద్రత వంటి లాభాలు కూడా వారికి అందడం లేదు. ప్రభుత్వం చాలా పథకాలను ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం రూపొందించినప్పటికీ, ప్రైవేట్ టీచర్స్ సంక్షేమానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. డీఎస్సీలని, జే‌.ఎల్, డి.ఎల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అని ఆశలు పెట్టి వేసేవి అరకొర ఉద్యోగాలు. గల డీఎస్సీలో ఉద్యోగం రాని వారంతా ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో దేశ భవిష్యత్ నిర్మాణంలో వెట్టి చాకిరీ చేసి వారి కుటుంబాన్ని లాగలేక అప్పుల పాలవుతూ అసువులు బాస్తున్నారు. ఈ మధ్య కాలంలో హబ్సిగూడలో ఒక పేరెన్నిక గల కళాశాలలో ఉద్యోగం చేస్తూ, ఉద్యోగం పోయి ఆరు నెలలు వేదన అనుభవించి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎవరిని మేల్కొల్పక పోవడం విచారించదగినది.

ధర్నాలు చేయకపోవడమే తప్పా?

నిజానికి ప్రైవేటు అధ్యాపక వృత్తిలో ఉన్న వారిని ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని వదిలేస్తారు. ప్రైవేట్ అధ్యాపకులు ధర్నాలు చేయలేరు, నిరసన చేయలేరు, ప్రభుత్వాన్ని ఎదురించలేరు వారు వెట్టి చాకిరీ చేస్తూ ప్రైవేటు యాజమాన్యాల వృద్ధికి, ప్రభుత్వం చెప్పుకునే అక్షరాస్యత రేటు పెంచటంలో తలమునకలవుతారు. నేడు ప్రైవేటు విద్య వ్యవస్థలో మహిళల యొక్క భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందింది. వారి శారీరక, మానసిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి ఉద్యోగం చేసే ప్రదేశాలలో కనీస సౌకర్యాలు, పని వెసులుబాటు కల్పించి ప్రోత్సహించాలి.

నీతి బోధ పిల్లలకు మాత్రమేనా?

సమాజంలో క్రియాశీలక రంగంలో ఉన్న ప్రైవేటు అధ్యా పకుల దీనావస్థకు కారణం వారి చైతన్య రాహిత్యమే అని అనక ఉండలేం. గొప్పగా ఉన్నత చదువులు చదివిన వారి నోరు పెకలదు. పుస్తకాల నుండి పొందిన విషయ, నైతిక, చైతన్య పాఠాలు పిల్లలకు బోధించడానికి మాత్రమే అన్నట్లు ఉంటారు. వారు బోధించిన వారు గొప్పవారు అవుతారు కానీ సగటు ప్రైవేట్ ఉపాధ్యాయుడి జీతం, జీవితం మాత్రం ఏమి మారదు. ఎందుకంటే ఇతను సమాజ వనరులను పెంపొందించడంలో తీరిక లేకుండా వెట్టి చాకిరి చేస్తూ అసంఘటితంగా, చైతన్య రహితుడుగా ఉంటాడు కాబట్టి. ప్రైవేట్ అధ్యాపకులు పేరున్న గొప్ప అద్దాల బిల్డింగ్‌లో ఉద్యోగం వెలగబెడుతారు కానీ వారి పిల్లలు ఎంతమంది అలాంటి స్కూల్లో చదువుతారనేది ప్రశ్నార్థకమే, చదివినా వారి వేతనం ఫీజుకే సరిపోతుంది.

ప్రైవేట్ టీచర్లే లేకుంటే...

ప్రైవేట్ అధ్యాపకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కేటాయింపులు ఉండవు. విద్యకు కేటాయింపులు బడ్జెట్ కేటాయింపు ఉన్న, విద్యా వ్యాప్తిలో ఇంధనంగా ఉన్న ప్రైవేటు అధ్యాపకులకు ఎలాంటి భరోసాను ఇవ్వవు. ప్రైవేట్ టీచర్స్ సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోక పోతే, సమాజానికి, విద్యా వ్యవస్థకే ప్రమాదం. విద్యా రంగంలో నాణ్యత కోసం ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ హక్కులను కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. వారికి కనీస వేతనాలు, భద్రత కల్పిస్తూ, విద్యావేత్తలుగా గౌరవించాలి. ప్రభుత్వాలు, సమాజం కలిసి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

మహేశ్వరం భాగ్యలక్ష్మి

అసిస్టెంట్ ప్రొఫెసర్

95056 18252



Next Story

Most Viewed