భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చ అవసరమే!

by Ravi |   ( Updated:2025-04-03 01:00:20.0  )
భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చ అవసరమే!
X

భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సుదీర్ఘమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయంపై దేశంలో మరొకసారి చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ 'ఇమ్రాన్ ప్రతాప్ గర్హి 'ఒక పెళ్లి సందర్భంగా పోస్ట్ చేసిన పద్యంలోని కొన్ని పదాలు కొన్ని వర్గాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని గుజరాత్ పోలీసులు సదరు ఎంపీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం, ఈ విష యాన్ని గుజరాత్ హైకోర్టు సమర్థించడంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టి, తనకు న్యాయం చేయమని కోరడంతో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గుజరాత్ పోలీసుల కేసులు విచారించి, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే ఆ పద్యం ఆయన పోస్ట్ చేశాడని, ఇందులో తప్పు పట్టవలసినది ఏమీ లేదని సుప్రీంకోర్టు ఆయనకు మద్దతు తెలిపింది.

వ్యక్తుల భావ ప్రకటనా స్వేచ్ఛను కోర్టులు కాపాడాలని, ఒక వ్యక్తి అభిప్రాయాన్ని ఎంతమంది వ్యతిరేకించినా ఆ వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛకు కోర్టులు మద్దతుగా నిలబడాలని సదరు ధర్మాసనం సుదీర్ఘమైన ఉపన్యాసంతో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యక్తీరించిన సుద్దుల గురించి దేశంలో చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అభిప్రాయాలు తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నాయని, ఎంఐఎం నాయకులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆమెపై దాడి చేసి కొట్టినప్పుడు, సల్మాన్ రష్దీ రాసిన 'సెటానిక్ వర్సెస్' గ్రంథం విషయం వివాదాస్పదమైన సందర్భంగా దేశంలో అనేక చోట్ల ధర్నాలు, ర్యాలీలు జరిగాయి. ఇస్లామిక్ సంస్థలు ఆయన తలకు వెల కట్టాయి. దీంతో మన దేశంలో న్యాయవ్యవస్థ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని తెలుస్తుంది.

కోర్టుల అభిప్రాయాలలో పాక్షికత ఉందా?

ఇక అతి ముఖ్యంగా చర్చించవలసిన విషయం ఏమిటంటే- బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యవహరించిన తీరులో విజ్ఞత ఉందా లేక పక్షపాతం ఉందా ఇలాంటి ప్రశ్నలకు భావ ప్రకటనా స్వేచ్ఛపై ఉన్నతంగా మాట్లాడే న్యాయమూర్తులు సమాధానం చెప్పాలి. నుపుర్ శర్మ విషయంలో జడ్జీల అభిప్రాయం హంతకులను సమర్థించే విధంగా ఉందని, మత పరంగా సంఘటితంగా ఉంటూ, రాజకీయ ప్రేరేపితమైన సమాజం వైపే న్యాయమూర్తులు మొగ్గు చూపుతారని అభిప్రాయానికి దేశ ప్రజలు రావడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. టైలర్ కన్హయ్య లాల్‌ని హత్య చేస్తూ, వీడియో తీసిన హంతకులు భారత ప్రధాన మంత్రిని హెచ్చరించారు కూడా. న్యాయ వ్యవస్థ అభిప్రాయాల వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి విషయంలో పోలీసు వ్యవస్థ ఉదాసీన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది.

స్వేచ్ఛకు అర్థం మెజారిటీపై విమర్శలేనా?

భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు అవకాశం ఇచ్చే 19(1) నిబంధనను పొందుపరిచారు. ఈ నిబంధనను కొంతమంది దుర్వినియోగం చేస్తూ, దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ నిబంధన ఇలాంటి పరిణామానికి దారితీస్తుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉంటే, ఈ నిబంధన రాజ్యాంగంలో చేరి ఉండేది కాదేమో! ఇక ఒకరి అభిప్రాయాన్ని ఎంతమంది వ్యతిరేకించినా, అతని భావ ప్రకటనా స్వేచ్ఛకు కోర్టులు అండగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అసంబద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండే దేశాలలో ఒక వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ ఎక్కువ మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది.

కోర్టుల తీరుపై విమర్శించవచ్చా?

కొలీజియం విశ్వసనీయతపై ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాలను సుప్రీంకోర్టు ఎందుకు తిరస్కరిస్తుంది? న్యాయ వ్యవస్థలో పారదర్శకత కోసం నేషనల్ జ్యుడీషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? న్యాయస్థానానికి వేసవి సెలవులు ఎందుకు? ఇలాంటి విషయాలలో ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని న్యాయమూర్తులు ఏరోజైనా ఒప్పుకున్నారా? రాజ్యాంగంలో నిర్దేశించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక వ్యక్తి భావ ప్రకటన ఇతరుల మనసులను నొప్పించకూడదు. శాంతి భద్రతలకు అది భంగకరం కాకూడదు. భావ ప్రకటన ద్వేషంతో కూడుకున్నదై ఉండకూడదు. రాజకీయ ప్రేరేపితం కాకూడదు. ఈ మినహాయింపులు మెజారిటీ ప్రజలకైనా, మైనారిటీ ప్రజలకైనా, అధికారపక్షానికైనా, ప్రతిపక్షానికైనా వర్తిస్తాయి. ఈ దేశ హితాన్ని కోరే ప్రజలు కోరుకునేది ఇదే!

- ఉల్లి బాల రంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Next Story

Most Viewed