- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లనేల గెరిల్లా కటకం సుదర్శన్!
నల్ల నేల గెరిల్లా వీరుడు ఆయన! కోల్ బెల్ట్‌లో విప్లవ రాజకీయాలకు పునాది అయన! ఆయన బొగ్గు గని కార్మికుడి చెమట చుక్క, విప్లవ గెరిల్లా వీరుడు, నిత్యం మండే గుణం ఉన్న బొగ్గు గని కార్మిక కుటుంబంలో జన్మించిన, కార్మికవర్గ పుత్రుడు, మేధావి, రాజకీయవేత్త, సైద్ధాంతిక వ్యూహకర్త, సమరయోధుడు, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ (ఆనంద్, దూలా) అమరత్వం పొందాడు! సుదర్శన్ తల్లి వెంకటమ్మ, తండ్రి సింగరేణి పూర్వ కార్మికుడు కటకం మల్లయ్య. ఇంటికి సుదర్శన్ పెద్దోడు కాగా కమలాకర్, రఘు, సతీష్ అనే ముగ్గురు తమ్ముళ్లు, పద్మ, విజయ అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నమ్మిన ఆశయం కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఇల్లు వదిలిన అన్న సుదర్శన్ తిరిగి ఇంటి ముఖం చూడలేదని తమ్ముడు సతీష్ పేర్కొన్నాడు!
సుదర్శన్ అమరత్వం విషయం తెలిసిన కుటుంబ సభ్యులు,మొత్తంగా బెల్లంపల్లి లో విషాద ఛాయలు నెలకొన్నాయి! కుందేలు శంకర్, దస్తగిరి అనే పచ్చి గుండాల హత్య కేసు మొదలు, సింగరేణి అధికారి కొడుకు ఒక కార్మికుడి భార్య రాజేశ్వరి పై అత్యాచారం చేసి చంపిన సందర్భంగా జరిగిన ఆందోళన ఫైరింగ్ అందులో ఒకరి మృతి లాంటి ఘటనల కేసులు, ప్రజాందోళనలు, కార్మికుల హక్కుల సాధన కోసం జరిగిన సమ్మె పోరాటాల్లో సుదర్శన్ పాత్ర కీలకంగా పేర్కొనవచ్చు. సుదీర్ఘ కాలం పాటు బెల్లంపల్లి ప్రాంతం నుంచి పార్టీలో పని చేస్తూ వచ్చిన సుదర్శన్ పలు మార్లు ఎన్‌కౌంటర్‌ల నుంచి తప్పించుకున్నారు! ఆయన ఆదివాసీల, బొగ్గు గని కార్మికుల, పీడిత, తాడిత ప్రజల గుండెకాయగా బతికిన ఆయన మరణించడంతో జూన్ 5 నుండి ఆగస్టు 3 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కటకం సుదర్శన్ స్మారక సభలను నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది!
48 సంవత్సరాల ఉద్యమ జీవితం
ఆయన 2023 మే 31 మధ్యాహ్నం 12.20 గంటలకు గుండెపోటుతో దండకారణ్య గెరిల్లా జోన్లో ఆయన తుది శ్వాస విడిచారు. భారత విప్లవోద్యమ నిర్మాణం కోసం 69 సంవత్సరాల జీవితంలో 48 సంవత్సరాలు అలుపెరగకుండా అనేక రంగాల్లో పని చేసిన శ్రమజీవి కటకం సుదర్శన్‌ది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం. ఆయన సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించాడు. బెల్లంపల్లి పట్టణంలో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించి డిగ్రీ మంచిర్యాలలో పూర్తి చేశాడు. ఇక్కడి నుండి మైనింగ్ డిప్లొమా చదవడానికి హైదరాబాద్ వెళ్ళాడు. బెల్లంపల్లి పట్టణంలో కమ్యూనిస్టు రాజకీయాల ప్రభావం వుండడంతో సహజంగానే విప్లవ రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. 1967లో జరిగిన నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలతో ఉత్తేజితుడై 1974-75లో తను హైదరాబాద్‌లో మైనింగ్ డిప్లొమా చేస్తూ రాడికల్ విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. నగ్జల్బరీ, శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు దెబ్బతిన్నప్పటికీ పార్టీ రాజకీయ పంథాను బలంగా నమ్మిన కటకం సుదర్శన్ రాజకీయ, సైద్ధాంతిక దృఢ సంకల్పంతో పనిచేశాడు. సిపిఐ(ఎంఎల్) కేఎస్ నాయకత్వంలో బెల్లంపల్లి పట్టణంలోని సికాస ఉద్యమంలో రహస్య సెల్ సభ్యుడిగా వున్నాడు.
సికాస ఉద్యమ నిర్మాత
ఎమర్జెన్సీ కాలంలో అత్యంత రహస్యంగా సెల్ సభ్యుడుగా కొనసాగుతూ బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపురం, శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులను, విద్యార్థులను, రైతాంగాన్ని కలుస్తూ సికాస ఉద్యమాన్ని నిర్మించాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత 1978లో గ్రామాలకు తరలండి అనే పార్టీ పిలుపుతో లక్సెటిపేట జన్నారం ప్రాంతంలో ఆర్గనైజర్‌గా వెళ్ళి పనిచేశాడు. 1979లో నల్లా ఆదిరెడ్డి, కటకం సుదర్శన్, గజ్జల గంగారంతో ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఏర్పడింది. కటకం సుదర్శన్ నాయకత్వంలో సింగరేణి కార్మిక వర్గంపై కేంద్రీకరించి బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల నుండి యువతను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించి, ఆదివాసీ గ్రామీణ ప్రాంతాలలో వర్గ పోరాటాలను నిర్మించి విస్తరింపచేశారు. ఈ సమయంలో ఫారెస్టు అధికారుల దోపిడీ, వడ్డీ షావుకారుల దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజలను కదిలించారు. ఎమర్జెన్సీ కాలంలో ఆదివాసుల భూములను బలవంతంగా లాక్కొని తమ భూముల నుండి వారిని దూరం చేస్తే భూమి కోసం ఆదివాసీ ప్రజలంతా ఐక్యమై పెద్ద ఎత్తున కదిలి పోరాడారు. ఈ క్రమంలోనే ఆదివాసీ రైతాంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 70 మంది ప్రజలను పాశవికంగా చంపింది.
ఇంద్రవెల్లి ఉద్యమానికి నాయకత్వం
1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా వుండి, ఇంద్రవెల్లి ఉద్యమానికి కటకం సుదర్శన్ నాయకత్వం వహించాడు. 1985 వరకు జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. పీపుల్స్ వార్ పార్టీ తీసుకున్న గెరిల్లా జోన్ పరస్పెక్టీవ్‌లో భాగంగా దండకారణ్యానికి ఏడు దళాలను పంపినప్పుడు మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా సిరోంచ దళానికి కటకం సుదర్శన్ బాధ్యత వహించారు. ఈ దళంపై మొదటిసారి ఎన్‌కౌంటర్ జరగడంతో పెద్ది శంకర్ అమరుడయ్యాడు. ఆదిలాబాద్, గడ్చిరోలి, బస్తర్, తూర్పు గోదావరిని కలుపుకొని దండకారణ్యంగా వెనకతట్టు ప్రాంతాలను ఎన్నుకున్నారు. ఈ ప్రాంతమంతా విప్లవోద్యమం విస్తరించడంతో 1985లో ఏర్పడిన ఫారెస్ట్ లైజన్ కమిటీ(ఎఫ్ఎల్సీ)లో సభ్యుడుగానూ, ఆ తరువాత 1987 నుండి 1995 వరకు ఫారెస్ట్ కమిటీలో సభ్యుడుగా కొనసాగాడు. 1995లో కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (ఎన్టీఎస్‌జెడ్‌సీ)కి కార్యదర్శిగా నియమించబడినాడు. 1995లో జరిగిన ఆల్ ఇండియా స్పెషల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర కమిటీ సభ్యుడుగా ఎన్నుకోబడ్డాడు. అలాగే 2001లో జరిగిన 9వ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యుడుగా, పొలిట్ బ్యూరో సభ్యుడుగానూ ఎన్నుకుంది. 2007లో జరిగిన 9వ ఐక్యత కాంగ్రెస్‌లో తిరిగి మరోసారి కేంద్ర కమిటీ సభ్యుడుగా, పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఎంపికయ్యాడు. 2001 నుండి 2017 వరకు సీఆర్బీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ భారత విప్లవోద్యమానికి ఎనలేని సేవలందిస్తూ వచ్చాడు.
సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్‌లో రెండు సంక్షోభాలు వచ్చాయి. 1985లో కేజీ సత్యమూర్తి సృష్టించిన సంక్షోభంలో, 1992లో కొండపల్లి సీతారామయ్య సృష్టించిన రెండవ సంక్షోభంలోనూ దృఢంగా నిలబడి క్యాడర్‌ని నిలబెట్టగలిగాడు. ఆయన ఉద్యమ ఆటుపోటుల్లో, కష్టనష్టాల్లో ధైర్యంగా ఎదుర్కొన్న ధీశాలి. అనారోగ్యం పట్టి పీడిస్తున్నా, వయస్సు సహకరించకున్నా, జీవితమంతా భారత విప్లవోద్యమ పురోగమనానికై నిరంతరం పరితపించేవాడు. తన చివరి క్షణాల్లో కూడా కేంద్ర కమిటీ కీలకమైన తీర్మానాలు రాస్తూ రాస్తూనే తుది శ్వాస విడిచాడు. దేశంలో సాయుధ పోరాట మార్గంలో పని చేస్తున్న విప్లవ గ్రూపులను ఐక్యం చేసి సీపీఐ(మావోయిస్టు) ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.
పత్రికా రంగంలో విశేష కృషి
కటకం సుదర్శన్ పత్రికా రంగంలో విశేష కృషిచేశాడు. కేంద్ర రీజినల్ బ్యూరో రాజకీయ ప్రచార క్రాంతి పత్రికను నడిపించారు. పీపుల్స్ మార్చ్ పత్రికకు బాధ్యత వహిస్తూ అంతర్జాతీయంగా భారత విప్లవ రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు. ఆదిలాబాద్ జిల్లా ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు ఆ ఉద్యమ స్థితిని ప్రతిబింబించేలా వసంత గీతం నవలను రాశాడు. ఇంద్రవెళ్ళి నలభై యేళ్ళ పోరాట స్ఫూర్తిని ఎత్తిపడుతూ చారిత్రాత్మకమైన డాక్యుమెంట్‌ని రచించాడు. దేశంలో భూ సంబంధాల్లో, ఉత్పత్తి సంబంధాల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేసి పార్టీ ముందుంచాడు. పట్టణ, మైదానాల్లో సామాజిక మార్పులను నిశితంగా పరిశీలించి, విశ్లేషించాడు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం కీలక పాత్ర పోషించాడు. సెట్ బ్యాక్ వున్నా తెలంగాణ, ఏపీ, ఏఓబి ఉద్యమాల పునర్ నిర్మాణం కోసం సైద్ధాంతిక, రాజకీయ నిర్మాణ కృషిచేశాడు. బ్రాహ్మణీయ హిందుత్వ (మనువాదం, జాతీయ ఉన్మాదం) ఫాసిజాన్ని తిప్పికొట్టడానికి దేశ ప్రజలను ఐక్యం చేయడంలో కీలక భూమిక పోషించాడు. దూల దాదా గొప్ప రాజకీయవేత్త, సిద్ధాంత వేత్త, వ్యూహకర్త, కార్మిక వర్గ మేధావి, తన చరిత్ర చెప్పడమంటేనే భారత విప్లవోద్యమ చరిత్రను చెప్పడం.
నల్ల నేలతో పేగు బంధం
అంకిత భావం, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, విమర్శనాత్మక దృక్పథం, ఉన్నతమైన కమ్యూనిస్టు విలువలను అందించిన కటకం సుదర్శన్ అమరత్వం భారత విప్లవోద్యమానికి, ప్రపంచ సోషలిస్టు విప్లవానికి తీరని నష్టాన్ని కలిగించింది. తన జీవితాన్నే విప్లవోద్యమానికి అంకితం చేసిన కటకం సుదర్శన్‌కి తెలంగాణ రాష్ట్ర కమిటీ వినమ్రంగా జోహార్లు అర్పించింది. కటకం సుదర్శన్ కుటుంబానికి, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. కటకం సుదర్శన్ ఆశయాలను, ఆదర్శాలను తుది వరకు తీసుకెళ్తామని తెలంగాణ రాష్ట్ర కమిటీ శపథం చేస్తున్నదని ఒక ప్రకటనలో సీపీఐ (మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు! సింగరేణి కార్మికుడి బిడ్డ అయిన కటకం సుదర్శన్‌కు నల్ల నేలతో ఉన్న అవినాభావ సంబంధం ఒక పేగు బంధం లాంటిది! ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయం!
ఎండి.మునీర్,
సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు,
99518 65223