- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి క్యాన్సర్ ఔషధం మెతోట్రెక్సేట్‌కు 75 ఏండ్లు!
డాక్టర్ సిడ్నీ ఫార్బర్ 75 ఏండ్ల క్రితం రక్త క్యాన్సర్ చికిత్స నిమిత్తం పరిశోధనలు చేస్తున్నడు. ఫార్బర్ అవసరాలకు ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు మెతోట్రెక్సేట్ ఔషధాన్ని అభివృద్ధి చేసిండు. చిత్రంగా అది 21 వ శతాబ్దంలో రుమటాలజి ఔషధంగా గుర్తింపు పొందింది. ఇంకా గుండె వ్యాధులు, స్త్రీ వ్యాధుల వంటి రంగాలలో కూడా చోటు దక్కించుకున్నది. యల్లాప్రగడ సుబ్బారావు, సిడ్నీ ఫార్బర్‌ల పరిశోధనా ఫలితం మానవాళికి అతిగొప్ప ఔషధాన్ని ప్రసాదించింది. ఫార్బర్ న్యూయార్క్ బఫెలోలో 1903లో జన్మించిండు. పోలాండ్ నుంచి వలస వచ్చిన యూదు కుటుంబం వారిది. తండ్రి సైమన్, తల్లి మటిల్డా. 14 మంది సంతానంలో 3వ వాడు. ఇంటిలో విద్యా వాతావరణం ఉండేది. తండ్రి పిల్లలకు పుస్తకాలు ఇచ్చి చదివించి సమీక్షలు రాయించేవాడు. ఇంటిలో యిద్దిష్, ఇవతల ఇంగ్లిష్, జర్మన్ మాట్లాడవలసి వచ్చేది.
కిశోర వయసులో ఉన్న ఫార్బర్ 1918 ఇన్ఫ్లూయెన్జా మహమ్మారి ఘోరాలను చూసిండు. ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల ప్రజలను బలి తీసుకోగా, ఒక్క బఫెలో లోనే 20 వేల మందిని పొట్టన పెట్టుకున్నది ఆ వ్యాధి. ఫార్బర్ వైద్యశాస్త్రం చదవటానికి అది ప్రేరణ అయ్యింది. కాని, అమెరికాలో 1920 లకు ముందు ఉన్న యూదు వ్యతిరేక భావనల వల్ల అక్కడ సీటు దుర్లభం అయింది. దానితో జర్మనీలో సీటు పొంది రెండవ సంవత్సరంలో అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చేరగలిగిండు. 1927లో చదువు పూర్తి అయింది. పాథాలజిస్ట్‌గా శిక్షణ పొందిండు. పిల్లల పాథాలజి మీద ఆయనకు ప్రత్యేక శ్రద్ధ. చాలా మంది పిల్లలు రక్త క్యాన్సర్‌తో రాలిపోవటం ఆయనను కలవర పెట్టింది. దానితో క్యాన్సర్ చికిత్సలో పురోగతి సాధించాలని నిర్ణయించుకున్నడు. అప్పటికి క్యాన్సర్ చికిత్స చాలా అపరిపక్వంగా ఉండేది. కాని, 1948 కల్లా ఒక ఆశా రేఖ కనిపించింది. అదే మెతోట్రెక్సేట్!
బోస్టన్‌లో డార్ చెస్టర్‌కు చెందిన 2 సంవత్సరాల పిల్లవాడు రాబర్ట్ సాండ్లర్ చాలా నీరసంగా ఉండేవాడు. అంతకు ముందు ఆగస్ట్‌లో ఆ పిల్లవానికి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని నిర్ధారణ అయింది. తరచు జ్వరం, రక్త హీనత, ప్లేట్ లెట్స్ తగ్గుదల ఉండేది. దానితో పాటు ప్లీహం పెరుగుదల, ఎముకల నొప్పి, వెన్ను పోటుతో బాధ పడేవాడు. రక్తంలో తెల్ల కణాల సంఖ్య మైక్రో లీటర్‌కు 70 వేలకు పెరిగి పోయింది.
భారతీయ బయోకెమిస్ట్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు హార్వర్డ్ లో చదివి అమెరికాలోనే పరిశోధనలు చేస్తుండేవారు. ఫోలేట్, ఫోలేట్ ఆంటగోనిస్ట్‌లు, డైఇథైల్ కార్బమాజిన్ సిట్రేట్, ఐ ఎన్ ఎచ్, క్లోర్ టెట్రాసైక్లిన్ వంటి ఔషధాలను కనుగొన్న శాస్త్రవేత్త సుబ్బారావు. సుబ్బారావు ఫోలిక్ ఆసిడ్ మీద చేసిన పరిశోధనలు ఫార్బర్‌ను ఆకర్షించినయి. పిల్లల రక్త హీనతకు ఫోలిక్ ఆసిడ్ వల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనాకు వచ్చిండు, ఇచ్చిండు. ఆశించిన ఫలితం లేకపోగా, వ్యాధి అధికం కాజొచ్చింది. ఫోలేట్‌తో లింఫోబ్లాస్ట్‌లు వృద్ధి చెందితే, ఆంటీ ఫోలేట్‌తో వాటి వృద్ధిని నిరోధించవచ్చు అనే పరికల్పనకు వచ్చిండు. సుబ్బారావు బృందం టెరో ప్టెరిన్ అమైనోప్టెరిన్ అనే ఆంటీ ఫోలేట్ అందచేసింది. డిసెంబర్ చివర్లో ఆ ఔషధాన్ని సాండ్లార్‌కు ఇచ్చినరు. తన పరికల్పన నిజమని నిరూపితమైంది. జనవరి చివరి కల్లా సాండ్లర్ తెల్ల కణాల సంఖ్య 12 వేలకు తగ్గింది. ఫిబ్రవరిలో ఆ పిల్లవాడు తన కవల సోదరునితో ఆడుకొనగలిగిండు.
అట్లా తొలి కెమోథెరపీ ఔషధంగా అమైనోప్టెరిన్ రూపకల్పన జరిగింది. అయినప్పటికీ రక్త పరీక్షలో క్యాన్సర్ లింఫోబ్లాస్ట్ లు కనిపిస్తూనే ఉన్నయి. కనుక, అంతటితో ఆగలేదు సుబ్బారావు బృందం. దానిని మరింత మెరుగు పరచటానికి పరిశోధనలు ముమ్మరం చేసింది. హైడ్రోజెన్ అణువును మిథైల్ సమూహంతో విస్తాపం చెందించి, దానిని అమెతోప్టెరిన్ గా అభివృద్ధి చేసింది. దాని పేరును తరువాత మెతోట్రెక్సేట్ గా మార్చినరు. మెతోట్రెక్సేట్ తో సురక్షితంగా సమర్థవంతంగా రక్త క్యాన్సర్ లో తెల్ల కణాల వృద్ధిని అరికట్టగలిగినరు.
తదుపరి దశాబ్దాలలో మెతోట్రెక్సేట్ క్యాన్సర్ కెమోతెరపీలో ప్రధాన ఔషధంగా మారి పోయింది. నిశిత పరిశీలన ద్వారా దాని ఇతర ప్రయోజనాలు తెలిసి వచ్చినయి. 1972లో సోరియాసిస్ ఔషధంగా అనుమతి లభించింది. మెతోట్రెక్సేట్‌ను బోస్టన్‌లో బ్రిఘామ్ హాస్పిటల్‌లోని డాక్టర్ మైకేల్ వీన్ బ్లాట్ కీళ్ల వాతానికి పనిచేసే ప్రధాన ఔషధాల జాబితాలో చేర్చిండు. వీన్ బ్లాస్ట్ 1980లలో తన పరిశోధన ఫలితాలను ప్రచురించిండు. కీళ్ల వాతానికి ఇప్పుడు ఇది కీలక ఔషధం. అతెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ లో ప్రయోజనకర ఔషధంగా రుజువైంది. జీవచర్యలను నియంత్రించే ఔషధం అయినందున ఇది పిండం మీద, గర్భస్థ శిశువు మీద ప్రమాదకర ప్రభావం చూపగలదని త్వరలోనే గుర్తించినరు. అధునాతన ఔషధాలు అందుబాటు లోనికి వచ్చినప్పటికీ, గర్భాశయానికి ఆవల ఏర్పడిన పిండాన్ని (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) అంతం చేయటానికి మెతోట్రెక్సేట్ మీదనే ఆధార పడుతున్నరు. ఇంకా స్త్రీ వైద్యంలోని ముత్యాల గర్భం, టెరటోకార్సినోమా వంటి మరి కొన్నింటికి మెతోట్రెక్సేట్ సరియైన ఔషధంగా నిలిచి ఉంది. బహుశా కనిపెట్టిన సుబ్బారావు, ప్రయోగించిన ఫార్బర్ లు కూడా మెతోట్రెక్సేట్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఒనగూడుతాయని ఊహించి ఉండరు. ఇప్పుడు మెతోట్రెక్సేట్ వజ్రోత్సవం జరుపు కొంటున్నది.
డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు
9440163211