20ఏళ్ల తర్వాత సీన్ రిపీట్.. నాడు అలా.. నేడు ఇలా.. ట్రెండ్ సెట్ చేసిన ఈటల

by Anukaran |   ( Updated:2021-11-02 22:17:11.0  )
20ఏళ్ల తర్వాత సీన్ రిపీట్.. నాడు అలా.. నేడు ఇలా.. ట్రెండ్ సెట్ చేసిన ఈటల
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : సరిగ్గా 20 ఏళ్ల క్రితం అదే కాలేజ్ గ్రౌండ్‌లో సింహంలా గర్జించింది టీఆర్ఎస్ పార్టీ. 2 లక్షల మంది జనంతో సింహ గర్జన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత ఉద్యమ ప్రస్థానంలో వెనుదిరిగి చూడలేదు. అప్రతిహతంగా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ స్వరాష్ట్ర కలను సాకారం చేశారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేసీఆర్ రెండు సార్లు రాజీనామా చేసి ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలిచారు. ఉప ఎన్నికల్లో కూడా ఇదే ఊపును కనబరిచారు. సెంటిమెంట్‌గా కలిసొచ్చే కరీంనగర్ వేదికగా కేసీఆర్ ఎన్నో ప్రయోగాలను ఇక్కడి నుండే చేపట్టారు. చివరకు ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణా వచ్చుడో’ అన్న నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.

2009 నవంబర్ 29న సిద్దిపేటలో తలపెట్టిన దీక్షకు కరీంనగర్ నుండే బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనను కరీంనగర్ సమీపంలోని అల్గునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. అంతే ఒక్కసారిగా యావత్ తెలంగాణ అంతా భగ్గుమంది. ఏడు పదుల వృద్దుల నుండి 7 ఏళ్ల చిన్నారుల వరకు ప్రతీ ఒక్కరూ జై తెలంగాణ అంటూ నినదించారు. ఊరు వాడా అంతా వంటావార్పు కార్యక్రమాలు, రాస్తారోకోలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తరువాత లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి యూపీఏ 2 సర్కార్ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. కరీంనగర్ సెంటిమెంట్‌తో అనుబంధం పెనవేసుకున్న కేసీఆర్‌కు ఇప్పుడు ఇక్కడి నుండే వ్యతిరేకత మొదలైందా అన్న చర్చ ప్రారంభమైంది.

20 ఏళ్లకు..

సరిగ్గా 20 ఏళ్లకు ఇదే కరీంనగర్ గడ్డపై గులాబీ మసక బారింది. ఉద్యమ ప్రస్థానంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, అన్నకు తమ్మునిగా ఎదిగిన ఈటలను బయటకు వెళ్లగొట్టడంతో ఆయన ప్రజాక్షేత్రంలో తన బలమేంటో నిరూపించుకునేందుకు రాజీనామాస్త్రం ప్రయోగించారు. చివరకు ఆయన బీజేపీలో చేరి తన సచ్ఛీలతను చాటాలని హుజురాబాద్ ఓటర్లను అభ్యర్థించారు. తన బలం, బలగమంతా మీరే.. ధర్మాన్ని గెలిపించండంటూ హుజురాబాద్ ప్రజల గుండెలను తట్టారు. నిరాటంకంగా 170 రోజుల పాటు ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు మాత్రం ఉద్యమ పార్టీకి బై బై చెప్పారు. ఉద్యమ నాయకుడైనా, మా ఇంటి బిడ్డ అయినా.. మాకు అన్నీ ఈటలనే అని ఇక్కడి ఓటర్లు చేతల్లో చూపించారు. అయితే, నాడు సింహ గర్జన సభ నిర్వహించిన ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ సాక్షిగా ఈటల రాజేందర్ గెలుపును అందుకుంటున్నారు. అధికారులు ఇక్కడే కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం యాధృచ్ఛికంగా జరిగినా అదే వేదికలో.. తిరబడ్డ నేత విజయం అందుకోవడం విశేషం.

ఏదైనా సాధ్యమే..

కరీంనగర్ ప్రజలకు ఎత్తుకోవడమూ తెలుసూ.. ఎత్తేయడమూ తెలుసని మరోసారి నిరూపించారని చెప్పక తప్పదు. 1983లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా టీడీపీ విజయ దుందుభి మోగించింది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో ఒక్క మంథని తప్ప అన్ని చోట్ల తమ్ముళ్లు విజయం సాధించారు. తిరుగులేని అండదండలు అందించిన కరీంనగర్ జిల్లాలోని మంథనికి చెందిన గీట్ల జనార్దన్ రెడ్డి 1982లో టీడీపీ ఆవిర్భావ సమయంలో ఫస్ట్ ఫైవ్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు. లక్ష్మీ పార్వతి ఎంట్రీ, తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీని మొట్టమొదటి సారిగా ఏకి పారేసింది గీట్ల జనార్దన్ రెడ్డియే. ‘రామ రాజ్యమా.. భామ రాజ్యమా’ అంటూ ఎన్టీరామారావు వ్యవహరశైలిని ఏకి పారేశారు.

ఆ తరువాత జిల్లాలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విషయంలో సీల్డ్ కవర్ పంచాయితీ మొదలు కావడంతో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లంతా అన్నపైకి తిరుగుబావుటా ఎగురవేశారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి ఆయువు పట్టుగా నిలిచిన కరీంనగర్ జిల్లా నుండే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చుక్కలు చూపించే పరిస్థితి వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. రాజకీయ చైతన్యానికి మారు పేరైన కరీంనగర్ జిల్లా మరోసారి తన వైఖరి ఏంటో ఓటు ద్వారా చూపించినట్టయింది. అధికార పార్టీ అంగ బలం, అర్థ బలం.. ఈటల ఆత్మ గౌరవం ముందు నిలబడలేదన్నది వాస్తవం. అందుకే అండగా నిలవాలన్నా.. ధిక్కార స్వరం వినిపించాలన్న కరీంనగరే బిడ్డలే కేంద్ర బిందువుగా ఉంటారని యావత్ తెలంగాణ సమాజం అంటోంది.

Advertisement

Next Story