నకిలీ సీఎం సెక్రెటరీ హోం అఫైర్స్ అరెస్టు 

by Sridhar Babu |
నకిలీ సీఎం సెక్రెటరీ హోం అఫైర్స్ అరెస్టు 
X

దిశప్రతినిధి, కరీంనగర్ : సాదా సీదాగా తానో స్థాయిలో ఉన్నానని చెప్పుకుంటే అందరూ నమ్మాలి కదా.. అందుకు తానే ఓ పోస్టును క్రియేట్ చేసుకున్నాడు.అందులో భాగంగానే అపాయింట్ మెంట్ లెటర్ కూడా సిద్ధం చేశాడు. దీనికితోడు మరో పదవిలో కూడా తాను కొనసాగుతున్నట్లు అందర్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసుల చెవిన పడింది. చివరకు పోలీసులు ‘టాస్క్’ వేసి మరీ పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మిగిలిపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే… దులిగంటి సాయి చందన్ గత కొంతకాలంగా కరీంనగర్‌లోని విద్యానగర్లో నివాసముంటున్నాడు. గత జూన్ 20న సీఎం కేసీఆర్ వ్యక్తిగత యంత్రాంగంలో అడిషనల్ సెక్రెటరీ టు చీఫ్ మినిస్టర్స్ హోం అఫైర్స్‌గా అపాయింట్ అయినట్లు లెటర్ క్రియేట్ చేసుకున్నాడు.ఇదే లెటర్‌లో తనను అసిస్టెంట్ ప్రైవేటు సెక్రెటరీగా నియమించినట్టుగా పేర్కొనడం గమనార్హం. ఈ అపాయింట్ మెంట్ లెటర్ సీఎం కార్యదర్శి పి.రాజశేఖర్ రెడ్డి ఇచ్చినట్టుగా దర్జాగా ముద్రించుకుని ఆయన సంతకంతో సహా తయారు చేసుకున్నాడు.

దానికితోడు అవినీతి నిరోధక కమిషన్ ఛైర్మన్‌గా కూడా సాయిచంద్ వ్యవహరిస్తున్నట్టుగా కూడా ప్రచారం చేసుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎల్‌ఎండీ పోలీసులు అతన్ని అదుపులోకి కేసు నమోదు చేశారు. నిందితుని వద్ద అపాయింట్ మెంట్ లెటర్‌తో పాటు, ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఆర్ ప్రకాష్, శశిధర్ రెడ్డి, ఎస్ఐ కరుణాకర్, ఎల్‌ఎండీ ఎస్ఐ కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. కాగా, నిందితుడు ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇతని వల్ల ఎవరైనా నష్టపోయారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story