అధికార పార్టీకి అనుకూలంగా ఆఫీసర్లు?

by Shyam |
అధికార పార్టీకి అనుకూలంగా ఆఫీసర్లు?
X

దిశ ప్రతినిధి, మెదక్: కొవిడ్-19 నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికలలో 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిన విషయం తెలిసిందే. పారదర్శకంగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ విధానంలో అధికారులు టీఆర్ఎస్ తొత్తులుగా మారి అధికార పార్టీకి ఓటు వేయాలంటూ వృద్ధులకు, వికలాంగులకు చెబుతున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గురుండి ఎన్నికల అధికారులు ఓటు వేయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణపై ఆయా పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో మొత్తం 1,98,807 ఓటర్లు ఉండగా, అందులో 80 ఏండ్లు పైబడిన ఓటర్లు 1089, వికలాంగులు 469 మొత్తం 1,558 మందిని గుర్తించినట్లు అధికారులు తేల్చారు. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ప్రకటించారు.

నిర్వహణ తీరుపై ప్రతిపక్షాల విమర్శలు..

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారి ఇండ్లలోకి వెళ్లిన ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని చెబుతున్నారని, పోస్టల్ బ్యాలెట్ విధానంలో వీడియోగ్రఫీ చేయాల్సి ఉన్నాగానీ అధికారులు దానిని పాటించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బుధవారం అధికారులను అడ్డుకుంటున్న ఆయా పార్టీల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందని, ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. తాము ఎన్నికల అధికారులమని, ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని, కేవలం ఓటు ఎలా వేయాలో మాత్రమే తెలుపుతున్నామంటూ అధికారులు నాయకులకు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల వాదనలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ, గంపగుత్తగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించుకునేందుకు మంత్రి హరీశ్ రావు తన అధికార బలాన్ని ఉపయోగించుకుంటున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.

నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. టీఆర్ఎస్ తొత్తులుగా వ్యహరించడం సరికాదు. ఇదే విషయంలో గతంలో జిల్లా కలెక్టర్‌‌ను బదిలీ చేయించిన విషయాన్ని ఆఫీసర్లు ఎవరూ మరిచిపోవద్దు. పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని నిర్వహించకుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.
– నాగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి

వీడియోగ్రఫీ చేయడం లేదు : దూది శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ స్టేషన్‌కు రానివారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎన్నికల కమిషన్ కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ విధానంలో వీడియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల అధికారులు కేవలం టీఆర్ఎస్ తొత్తులుగా మారి వీడియోగ్రఫీ చేయకుండా కారు గుర్తుకు ఓటేయ్యాలని చెబుతుండడం చాలా దారుణం. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా చూడాలి.

పోస్టల్ బ్యాలెట్ సాఫీగా సాగేందుకు సహకరించాలి : భారతి హోళికేరి, జిల్లా ఎన్నికల అధికారి, సిద్దిపేట కలెక్టర్

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో 1,558 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను షీల్డ్ కవర్ లో స్వీకరించేందుకు భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు 15 టీములు ఏర్పాటు చేశాం. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయించుటకు మొదటి విడతగా ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు, రెండో విడతలో ఈ నెల 31 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ఓటర్ల ఇళ్లను సందర్శించి ఓటు వేయించేందుకు నిర్ణయించాం. అధికారులు ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరించరు. పోస్టల్ బ్యాలెట్ విధానానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలి.

Advertisement

Next Story