డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 762 కోట్లు

by Harish |
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 762 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్(Dr Reddy’s) లాబొరేటరీస్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 30.22 శాతం క్షీణతో రూ. 762.3 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,092.5 కోట్ల లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 4,800.9 కోట్ల నుంచి 1.99 శాతం పెరిగి రూ. 4,896 కోట్లకు చేరుకుందని బుధవారం వెల్లడించింది. అన్ని మార్కెట్లలో నిరంతర వృద్ధి, మెరుగైన ఉత్పాదకతను నమోదు చేయడం పట్ల సంతృప్తిగా ఉందని కంపెనీ ప్రకటించింది.

ఎబిటా మార్జిన్ మెరుగ్గా ఉంది. కంపెనీ పరిశోధనా బృందాలు ఇప్పటికే ప్రారంభించిన ఉత్పత్తులతో పాటు కొవిడ్-19 కోసం అవసరమైన పరిష్కారాలను అన్వేషిస్తున్నాయని డాక్టర్ రెడ్డీ లాబోరేటరీస్ కొ-ఛైర్మన్, ఎండి జీవి ప్రసాద్ చెప్పారు. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆర్ అండ్ డీ ఖర్చులు రూ. 436 కోట్లని, ఆదాయం 8.9 శాతంగా నమోదైందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, కంపెనీ ఉత్పత్తి వ్యాపారం భారీగా నష్టపోయిందని తెలిపింది. ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం ఈ త్రైమాసికంలో 92 శాతం క్షీణించి రూ. 62.1 కోట్లకు చేరుకుంది. అయితే, అంతర్జాతీయ జెనరిక్స్ వ్యాపారం 21 శాతం పెరిగి రూ. 3,984.1 కోట్లకు చేరుకుందని పేర్కొంది. యూరప్‌లో అత్యధికంగా 36 శాతం వృద్ధి కనిపించగా, కనీస అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో 4 శాతం వృద్ధి ఉందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed