డాక్టర్ మెనూ.. మిల్లెట్ మార్వెల్స్

by Shyam |   ( Updated:2021-02-06 02:19:18.0  )
డాక్టర్ మెనూ.. మిల్లెట్ మార్వెల్స్
X

దిశ, ఫీచర్స్: తెరపై నటుడిగా సంతృప్తికర పాత్రలను పోషిస్తూనే, డాక్టర్ వృత్తిలోనూ రాణిస్తున్న వ్యక్తి భరత్ రెడ్డి. సినిమాల్లో నటించాలనే కోరికతో ఈ రంగంలోకి అడుగుపెట్టి, పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్న భరత్.. తెలుగు, తమిళ సినిమాల్లో గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో నటించాడు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌‌తో ఆకట్టుకున్న ఈ యాక్టర్ కమ్ డాక్టర్.. ఇప్పటివరకు 70 వరకు చిత్రాల్లో నటించాడు. రియల్ లైఫ్‌లో డబుల్ రోల్ పోషిస్తున్న భరత్.. మరో రంగంలోనూ సత్తా చాటుతుండటం విశేషం. ప్రొఫెషనల్లీ కార్డియాలజిస్ట్ అయిన ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని అందరికీ చెప్పడం సాధారణమే అయినా, ప్రజలకు పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ‘మిల్లెట్ మార్వెల్స్’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించి నగరవాసులకు హెల్తీ ఫుడ్ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.

తృణధాన్యాలను తప్పనిసరిగా డైలీ డైట్‌లో భాగం చేసుకోవాలని, ఇవి మన పూర్వీకుల నుంచి వస్తున్న జీవామృతాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. పైగా పాశ్చాత్య ఆహారపు అలవాట్లు, ఇన్‌‌స్టంట్, ఫాస్ట్‌ఫుడ్స్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు పసిపిల్లల్లోనూ మధుమేహం, బీపీ వంటి రోగాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి పోషక విలువలున్న ‘చిరుధాన్యాల’ వాడకం క్రమంగా పెరుగుతోంది. టాలీవుడ్ హీరో నాగార్జున, హీరోయిన్ సమంత, నభా నటేష్‌లతో సహా చాలామంది సెలెబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు సైతం తమ ఆహారంలో ‘మిల్లెట్ ప్రొడక్ట్స్’ను భాగంగా చేసుకున్నారు. ప్రత్యేకించి ‘రైస్, గోధుమలకు మిల్లెట్స్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మారిన మిల్లెట్స్‌ను నాగ్.. నాలుగేళ్లుగా ఆహారంలో భాగం చేసుకోవడమే అందుకు నిదర్శనం. ఇక డాక్టర్ భరత్ రెడ్డి కూడా కొన్నేళ్లుగా మిల్లెట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాన్ని పొందుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే డాక్టర్ భరత్ రెడ్డి.. తృణధాన్యాల ఆహారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ‘మిల్లెట్ మార్వెల్స్’ రెస్టారెంట్‌ను హైదారాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆగస్ట్ 2020న ప్రారంభించాడు. ఇడ్లీ, దోశ, పూరి, ఉతప్పం, వడ వంటి అన్నిరకాల టిఫిన్స్‌‌తో పాటు వెజ్‌, నాన్‌వెజ్‌ బిర్యానీల రూపంలోనూ తృణధాన్యాలతో మిళితమైన ఆహారాన్ని అందిస్తున్నారు. లంచ్, స్నాక్స్, డిన్నర్‌కు వివిధ రకాలైన తృణధాన్యాల ఆహారాన్ని మెనూలో చేర్చారు. వివిధ వంటల్లో చక్కెరకు బదులుగా బెల్లంపొడి, సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్‌ కూరగాయలను ఉపయోగిస్తున్నారు.

‘మిల్లెట్ మార్వెల్స్’‌లో ఉపయోగించే తృణధాన్యాలను వికారాబాద్, రాయలసీయ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న రైతుల దగ్గర నుంచి స్వీకరిస్తున్నామని, వీటిలో 65-75 శాతం కార్బోహైడ్రేట్స్, 15-20 శాతం డైటరీ ఫైబర్, 7-12శాతం ప్రొటీన్స్, 2-5 శాతం ఫ్యాట్‌తో పాటు శరీరానికి అవసరమయ్యే ఎమైనో యాసిడ్స్ ఉంటాయని భరత్ చెబుతున్నారు. దీన్నో వ్యాపారంగా చూడటం లేదని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రెస్టారెంట్ ప్రారంభించానన్నాడు.

బియ్యం, గోధుమలు ప్రతికూల ధాన్యాలే..

వినియోగదారులు రెస్టారెంట్‌లో అడుగుపెట్టినప్పుడు వారు ‘మిల్లెట్ ఫుడ్’ తింటున్నారని గ్రహించాలి, వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు తెలియాలనే ఉద్దేశంతో రెస్టారెంట్ పేరులో ‘మిల్లెట్స్’ అనే పదాన్ని చేర్చాను. ‘యుూత్.. ముఖ్యంగా 22-24 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో తరచుగా మధుమేహం కేసులు ఎక్కువగా వస్తున్నాయి. షుగర్ లెవెల్స్ 450 – 600 ఉంటున్నాయి. డయాబెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం.. మరో మూడేళ్ళలో అంటే 2023-2024 నాటికి 70% మంది 40 ఏళ్ళ వయసులోనే డయాబెటిక్ లేదా ప్రీ-డయాబెటిక్ అవుతారు. ఇదే ధోరణి కొనసాగితే మరో ఐదేళ్ళ నాటికి వారిలో ఎక్కువ మంది డయాబెటిక్‌ బాధితులుగా మారతారు. ఇది మనమంతా ఉలిక్కిపడే విషయం. చాలామంది పాలిష్ చేసిన తెల్ల బియ్యం, గోధుమలనే తింటున్నారు. ఇవి శరీరానికి ఎక్కువ హాని కలిగించడంతో పాటు మధుమేహం, రక్తపోటు ఊబకాయాన్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటిని ప్రతికూల ధాన్యాలు అని కూడా పిలుస్తారు. అంతేకాదు రోటీలు, పుల్కాలను హెల్తీ డైట్‌గా భావిస్తుంటారు కానీ, ఇది ఒక మైథ్. పాలిష్ చేసిన తృణధాన్యాలు కూడా తినకూడదు.

– భరత్ రెడ్డి, యాక్టర్ కమ్ డాక్టర్

ఫైబర్, మైక్రో-మాక్రో పోషకాలు, ట్రేస్ ఎలిమెంట్స్ (పోషకాలు), ఫైటోన్యూట్రియెంట్స్ అన్నీ కూడా ధాన్యం బయట పొరలోనే ఉంటాయి. ధాన్యాన్ని పాలిష్ చేస్తున్నామంటే, మనం దాని పోషక విలువను కోల్పోతున్నట్లే లెక్క. అందుకే పాలిష్డ్ ధాన్యాలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన భావి తరాన్ని దేశానికి అందివ్వాలంటే, ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే ఉత్తమమని ఆరోగ్యనిపుణులు ఎప్పటినుంచే సూచిస్తున్న విషయం కాగా దీన్ని మరోసారి మనం ఆలోచించాలి.

Advertisement

Next Story

Most Viewed