ఓపిక నశించిన వేళ.. బద్దలైన ‘డబుల్’ ఇళ్ల తాళాలు

by Shyam |
ఓపిక నశించిన వేళ.. బద్దలైన ‘డబుల్’ ఇళ్ల తాళాలు
X

దిశప్రతినిధి, నల్లగొండ : డబుల్ బెడ్ రూం ఇండ్లు వస్తాయని ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారి ఓపిక నశించింది. ఇండ్ల అప్పగింత విషయంలో ప్రభుత్వం ఉలుకుపలుకు లేకపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రభుత్వం సాగదీత ధోరణి అవలంభించడాన్ని భరించలేక నల్లగొండ జిల్లాలోని కొండమల్లెపల్లికి చెందిన గ్రామస్తులు మూకుమ్మడిగా పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల గృహప్రవేశాలు చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమయ్యింది. గూడు లేని పేదోళ్లంతా.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు దక్కుతాయని కోటి ఆశలు పెట్టుకున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 14వేలకు పైగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. అందులో ఇప్పటివరకు 4800 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. కానీ ఈ ఇండ్లకు సంబంధించి పదుల సంఖ్యలో మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేశారు. అధికారుల నిర్లక్ష్యమో.. పాలకుల పరిహాసమో గానీ ఇండ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం వెనుక అంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసలే డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఇండ్లు పూర్తయినా.. తమకు కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

నిన్న కొండమల్లేపల్లి.. మొన్న కొండభీమనపల్లి..

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఆలస్యం కావడంతో లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్ల తాళాలు పగలగొట్టి ఏకంగా గృహాప్రవేశం చేశారు. ఇన్నాళ్లు ఓపికపట్టిన లబ్ధిదారులు. దీపావళి పర్వదిన ముహుర్తం మంచిదంటూ ఇళ్లలోకి వెళ్లారు. కొండమల్లెపల్లి మండల కేంద్రంలో ఇండ్లు లేనివారికి 30 ఇండ్లను నిర్మించింది. ఇండ్లు నిర్మించి రోజులు గడుస్తున్నా.. వాటిని అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. దీంతో 30 మంది లబ్దిదారులు పండుగ రోజు గృహాప్రవేశం చేశారు. గత మూడు రోజుల క్రితం కొండభీమనపల్లి గ్రామంలో ఇదే తరహాలో లబ్ధిదారులు గ‌ృహప్రవేశం చేశారు. ఈ సంఘటన అధికార పార్టీలో కలవరం పుట్టించిందనే చెప్పాలి. వాస్తవానికి దేవరకొండ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యి చాలా రోజులు అవుతోంది. కానీ పలు రాజకీయ కారణాల నేపథ్యంలో ఇండ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ క్రమంలోనే లబ్ధిదారులు ఓపిక నశించి.. స్వయంగా దీపావళి పండుగ రోజు ముహుర్తం మంచిగుందంటూ గృహప్రవేశాలు చేయడం గమనార్హం.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..

నల్లగొండ జిల్లాకు సంబంధించి 7800 డబుల్ బెడ్‌‌రూం ఇండ్లు మంజూరు కాగా, 3653 ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఇందులో 2546 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 2788 ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇక సూర్యాపేట జిల్లా విషయానికొస్తే.. 4043 ఇండ్లు మంజూరు కాగా, 4264 ఇండ్లకు టెండర్లు పిలిచారు. 1795 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, 1718 ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2675 ఇండ్లు మంజూరు అయితే.. 1607 ఇండ్లకు టెండర్లు పిలిచారు. ఇందులో 410 ఇండ్ల నిర్మాణం కాగా 1120 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి.
ఎన్ని పూర్తయ్యాయి

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 14,518 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇప్పటిదాకా కేవలం 4881 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే.. నల్లగొండలో 635, మిర్యాలగూడలో 650, దేవరకొండలో 635, నకిరేకల్‌లో 326, తుంగతుర్తిలో 200, కోదాడలో 1080, హుజూర్‌నగర్‌లో 125, భువనగిరిలో 410, ఆలేరులో 130 ఇండ్లు ఇప్పటివరకు పూర్తయ్యాయి. కాగా సూర్యాపేటలో 390, కోదాడలో 40 ఇండ్లకు మాత్రమే ఇప్పటివరకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఈ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యి ఆరు నెలలకు పైగానే అవుతోంది. కానీ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ఎవరూ చొరవ చూపడం లేదు. నిజానికి పూర్తయిన ఇండ్ల సంఖ్య తక్కువగా ఉండటం.. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. ఇదే సమయంలో రాజకీయ ఒత్తిళ్లు వస్తుండడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

దరఖాస్తుల వెల్లువ..

డబుల్ బెడ్‌రూం ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి పేదలకు ఇవ్వాల్సింది పోయి.. ఇటు అధికారులు.. అటు పాలకులు ఏండ్ల తరబడిగా తాత్సరం చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం పేద ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం పేదలు గల్లీ లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 52 వేలకు పైగా దరఖాస్తులు పేదల నుంచి అందాయి. అయితే ఇందులో నిజమైన అర్హులకు తోడు పైరవీకారుల నుంచి వచ్చిన దరఖాస్తులు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ కారణాలను పక్కన పెట్టి నిజమైన అర్హులకు ఇండ్లను కేటాయించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story