కరోనా అప్‌డేట్స్, ప్రొడక్ట్స్ సెర్చ్ చేస్తున్నారా.. అస్సలొద్దు

by  |
కరోనా అప్‌డేట్స్, ప్రొడక్ట్స్ సెర్చ్ చేస్తున్నారా.. అస్సలొద్దు
X

దిశ వెబ్ డెస్క్ :
ప్రపంచమంతా కరోనా కలవరపెడుతోంది. అగ్రదేశాలైనా అమెరికా, చైనా కరోనా వైరస్ కు భయపడిపోతున్నాయి. ఇటలీ, స్పెయిన్, ఇరాన్, దేశాలు కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయాయి. మన దేశాన్ని కూడా కరోనా వణికిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దేశ మంతా లాక్ డౌన్ ఉన్నప్పటికీ కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. అందువల్ల నెటిజన్లు చాలా మంది కరోనా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తమకు ఉందో లేదో తెలుసుకోవడానికి టెస్ట్ కిట్ల గురించి, కరోనా వైరస్ నుంచి రక్షించే పరికరాలు, ఇతర ఉత్పత్తుల కోసం ఆన్ లైన్ జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ అంతా సేఫ్ కాదు. సైబర్ నేరగాళ్లు ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. నెటిజన్లను తప్పుదోవ పట్టించి.. డబ్బులు కాజేస్తారు. అకౌంట్లు హ్యాక్ చేసి … మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేయడంతో పాటు, మన బ్యాంకు అకౌంట్లోని డబ్బుల్ని కూడా దొంగలిస్తారు. కావున ప్రస్తుతం కరోనావైరస్ కు సంబంధించి ఆన్ లైన్ లో సెర్చ్ చేయకూడని అంశాలేంటో తెలుసుకుందాం.

కరోనావైరస్ భయాన్ని ఆసరాగా తీసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్నందున కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన నకిలీ వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేయవద్దు.. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభ సమయాన్ని కొందరు సైబర్ నేరగాళ్లు దోపిడీకి అవకాశంగా తీసుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ సంబంధిత మోసాలు, ఫిషింగ్ వెబ్ సైట్లు, స్పామ్ సందేశాలు బాగా పెరిగాయని ఢిల్లీ పోలీసులు కూడా హెచ్చరించారు. కరోనావైరస్ స్టేటస్ (డాట్) స్పేస్ వెబ్‌సైట్, కరోనావైరస్-మ్యాప్ (డాట్) కామ్ వెబ్‌సైట్, బ్లాగ్ కరోనా సీఎల్ డాట్ కనాల్ సిరో (డాట్) డిజిటల్ వెబ్‌సైట్, వ్యాక్సిన్ కరోనావైరస్ (డాట్) కామ్ వెబ్‌సైట్,బెస్ట్ కరోనా వైరస్ ప్రొటెక్ట్ (డాట్) టికె వెబ్‌సైట్, కరోనా వైరస్ అప్ డేట్ డాట్ టీకే వెబ్ సైట్ల ద్వార సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నందు వల్ల వీటిని క్లిక్ చేయవద్దని పోలీసులు కోరారు.

కరోనా కేసులు :

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఎన్ని నమోదు అవుతున్నాయి. ఏయే దేశాల్లో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఎంతమంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నారు. ఈ రోజులో కొత్త కేసుల సంఖ్య ఎంత వంటి విషయాలు తెలుసుకోవాలంటే.. ‘‘వరల్డో మీటర్స్. ఇన్ఫో’’ నుంచి తెలుసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికారిక వెబ్‌సైట్, ప్రభుత్వ వెబ్‌సైట్లు కాకుండా, కరోనావైరస్ పై విశ్వసనీయమైన ఇతర వెబ్‌సైట్ ఏదీ లేదు. అందుకే ఇవి కాకుండా ఇంకే ఇతర వెబ్ సైట్లను ఓపెన్ చేయవద్దు.

సెల్ఫ్ టెస్టింగ్ కిట్స్ :

కరోనా టెస్ట్ చేయడానికి 24 గంటలు పడుతుంది. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఆసుపత్రులు, ల్యాబ్ లలో మాత్రం నిర్ధారణ టెస్టులు జరుగుతున్నాయి. మరెక్కడ కూడా అలాంటి టెస్ట్ లు చేయడం లేదు. ఒక వేళ చేసినా.. అవి నమ్మవద్దు. అంతేకాదు… అవి నిపుణులు మాత్రమే చేయాలి. కరోనా కిట్లు ఆసుపత్రుల్లో తప్ప.. ఆన్ లైన్లో అందుబాటులో లేవు. అవన్నీ కూడా ఫేక్. అంతేకాదు హోమ్ టెస్ట్ కిట్ కొనడం ఎల్లప్పుడూ ప్రమాదకరం. ఎందుకంటే మీకు నిజంగా వ్యాధి ఉందా లేదా అని నిర్ధారించడానికి వైద్య నైపుణ్యం అవసరం. అలాగే ప్రజలను మోసం చేయడానికి చాలా నకిలీ కరోనావైరస్ టెస్టింగ్ కిట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. వీటిలో ఏవీ ప్రభుత్వ అనుమతి పొందినవి కావు. అందుకే నెటిజన్లు జాగ్రత్త వహించాలి. వీలైతే తెలిసిన డాక్టర్లను సంప్రదించి.. వారి సలహా తీసుకోండి.

కరోనా ట్రాకింగ్ యాప్స్

కరోనావైరస్ వ్యాప్తిని తెలియజేసే అధికారిక యాప్ ఏదీ ఇంతవరకూ లేదు. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి… నకిలీ యాప్ లను తయారు చేస్తున్నారు. ఆ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుంటే… ఆటోమేటిక్ గా మన ఫోన్ లాక్ అయిపోతుంది. డబ్బులు చెల్లిస్తే కానీ.. ఓపెన్ కాదనే మెసేజ్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి.. నెటిజన్లు.. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోకపోవడం ఎంతో ఉత్తమమం.

​వాక్సిన్లు, మందులు లేవు :

కరోనా వైరస్ కు ఇప్పటివరకు సరైన మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు. దాదాపు 30 కి పైగా సంస్థలు వ్యాక్సిన్లు తయారు చేసే పనిలో ఉన్నాయి. వ్యాక్సిన్ రావడానికి మరో సంవత్సరం పైగా పడుతుందని వైద్య నిపుణులు, శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. కావున వాటి గురించి ఆన్ లైన్ లో సెర్చ్ చేయవద్దు. కొత్తగా వ్యాక్సిన్ వచ్చిందని
స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉందని సైబర్ నేరగాళ్లు లింక్ ను షేర్ చేస్తూ మెయిల్స్ పంపిస్తారు. మెసేజ్ లు సెండ్ చేస్తారు. అలాంటి మెయిల్స్, లింకులు ఓపెన్ చేయకూడదు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కరోనావైరస్-సంబంధిత ఈ-మెయిల్‌లను తెరవవద్దని, అటువంటి మెయిల్స్‌లోని లింక్‌లు లేదా అటాచ్ మెంట్లపై క్లిక్ చేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇవే కాకుండా శానిటైజర్స్ , మాస్క్ లను తక్కువ ధరలో అందిస్తామంటూ.. వచ్చే యాడ్ లు , కరోనా బాధితులకు సాయం చేయాలనుకుంటే.. ఈ వెబ్ సైట్ కు డబ్బులు పంపించాలంటూ.. వచ్చే మెయిల్స్ కూడా నకిలీవే. అధికారిక వెబ్ సైట్లు తప్ప ఏ ఇతర వెబ్ సైట్లను వెతక్కండి. వాటి మాయలో పడి .. డబ్బులు పోగోట్టుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త !

Tags: corona virus, covid 19, fishing, mallware, mail, sms. cyber crime, tracking


Next Story

Most Viewed