మేమున్నాం… కష్టకాలంలో కరోనా బాధితులకు అండగా..

by Shyam |
మేమున్నాం… కష్టకాలంలో కరోనా బాధితులకు అండగా..
X

దిశ ప్రతినిధి, మెదక్: ఇది కరోనా టైం. ఇంటి పక్కన, ఊర్లో కరోనా వచ్చిందని తెలిస్తే చాలు ఆ వార్తను పది మందికి చెప్పడమే కానీ ఎవరూ సాయం చేయని సమయం. కరోనా సోకింది తన దగ్గరి బంధువే .. తన దగ్గరి స్నేహితుడే అని తెలిసిన ఎవ్వరూ సాయం చేయడానికి సాహసించని సమయం. అలాంటి సమయంలో కోవిడ్ బాధితులకు అండగా తామున్నామంటూ పలువురు దాతలు ముందుకొస్తున్నారు. కోవిడ్ బారిన పడిన రోగులకు ధైర్యం కల్పించడమే కాకుండా వారికి తోచినసాయం చేస్తూ మానవత్వం ఇంగా మనుషుల్లో బతికి ఉందని నిరూపిస్తున్నారు.

ముందుకొస్తున్న దాతలు …

ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో వందల సంఖ్యలో కరోగా కేసులు నమోదవుతుండటం … చాలా మంది ఆస్పత్రి బాట పడుతున్న విషయాలు వింటూనే ఉన్నాం. కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది కోవిడ్ బారిన పడుతున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే అధికంగా ఉన్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు పలు స్వచ్చంద సంస్థలు, పలువురు ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పండ్లు, రాత్రి భోజనం, గుడ్డును మంత్రి హరీశ్ రావు అందిస్తున్నారు. అలాగే మంత్రి హరీశ్ రావు స్ఫూర్తితోసిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు సైతం కోవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తన ఇంటి ఆవరణలో కోవిడ్ బాధితులకు అన్నం అందిస్తున్నారు . హోంఐసోలేషన్లో ఉండి ఆర్ధిక ఇబ్బందులు పడే వారికి సైతం హోం డెలివరి చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వీరే కాదు చాలా మంది తమ తమ స్వచ్చంద సంస్థలు, ఫౌండేషన్ ద్వారా తమకు తోచిన సాయం చేస్తున్నారు.

సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు

కరోనా బారిన పడిన తమను ఆదుకునేందుకు పలువురు ముందుకు రావడం సంతోషంగా ఉందంటూ పలువురు కోవిడ్ బాధితులు, వారి బంధువులు తెలుపుతున్నారు. కరోనా సోకిన వ్యక్తులకు సమస్య తీవ్రం కావడంతో చాలా మంది ఆస్పత్రి బాట పడుతున్నారు. వారి వెంటవారి బంధువులు సైతం వస్తున్నారు. చాలా మంది కుటుంబ సభ్యులు మొత్తం కరోనా బారిన పడి వ్యక్తి వద్దే ఉండటంతో వంట చేసుకోవడం, ఇతరత్ర సమస్యలు నెలకొంటున్నారు. దీన్ని గుర్తించిన దాతలు కరోనా కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం, పలువురికి అన్నదానం చేయడం , బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు అందించడంపై చాలా మంది కోవిడ్ బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని పలువురు కోవిడ్ బారిన పడ్డ కుటుంబాల సభ్యులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed