ఏపీ ఫార్ములా తమిళనాడులో పని చేసేనా..?

by Anukaran |   ( Updated:2021-01-30 09:21:48.0  )
ఏపీ ఫార్ములా తమిళనాడులో పని చేసేనా..?
X

దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడులో ఎన్నికల ప్రచారాన్ని డీఎంకే పార్టీ అప్పుడే మొదలు పెట్టేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను విజయ తీరాలకు చేర్చేందుకు ‘స్టాలిన్ ఇన్ యువర్ కానిస్టెన్సీ’ పేరిట ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. డీఎంకే‌ను అసెంబ్లీ ఎన్నికల్లో విజయపథంలో నడిపించేందుకు పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయితే ఏపీ ఫార్ములానే తమిళనాడులో కూడా పీకే అమలు చేస్తున్నారా? అక్కడ సాధించినట్టుగా ఇక్కడ కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారా ?.. వివరాల కోసం రీడ్ దిస్ స్టోరీ..

ప్రశాంత్ కిషోర్…ఆయన ఎటు వైపు ఉంటే ఆ పార్టీకి విజయం దక్కాల్సిందే. ప్రత్యర్థి పార్టీలు ఆయన రచించిన పద్మవ్యూహంలో చిక్కి విలవిల్లాడాల్సిందే. ఇప్పటికే ఎన్నికల్లో పలు పార్టీలకు వ్యూహాలను అందించి ఆ పార్టీలకు ఒంటి చేత విజయం సాధించి పెట్టారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ తరఫున వ్యూహాలను రచించి ఆ పార్టీకి అఖండ విజయం అందించడంలో ఆయన పాత్ర మరువ లేనిది.

2014లో టీడీపీ చేతిలో వైసీపీ ఓటమి పాలయ్యింది. సరైన వ్యూహాలను పాటించి వుంటే ఎన్నికల్లో గెలిచి ఉండే వాళ్లమని ఆ పార్టీ ఆలోచనకు వచ్చింది. ఈ క్రమంలో 2019లో సరికొత్త, సమర్థవంతమైన వ్యూహాలతో ముందుకు వస్తే గానీ గెలవలేమని వైసీపీ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో అలాంటి వ్యూహాలను అందించగల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఆ పార్టీ తనతో చేర్చుకుంది.

వైసీపీతో చేరగానే ఆయన ప్రజాసంకల్ప యాత్ర‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. దాంతో పాటుగా రావాలి జగన్…కావాలి జగన్ అని ఓ ప్రచారం పాటను కూడా రూపొందించారు. ఆ తర్వాత జగన్ 14 నెలల పాటు రాష్ట్రంలో పాద యాత్ర చేసి ప్రజలకు దగ్గరవ్వడం..అనంతరం అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా తమిళనాడులోనూ ఏపీ ఫార్ములాను పీకే అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ప్రచారం కోసం ఓ క్యాంపెయిన్‌కు రూపకల్పన చేశారు. ఈ మేరకు ‘స్టాలిన్ ఇన్ యువర్ కానిస్టెన్సీ’పేరిట ప్రచారాన్ని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేత శుక్రవారం ప్రారంభింప చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టాలిన్ తమిళనాడు నలుమూలల ఉన్న ప్రజలతో కాంటాక్ట్ అవుతారు. ప్రచారంలో భాగంగా హామీలను కురింపించనున్నారు. వాటన్నింటీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా అమలు చేస్తామనే హామీని స్టాలిన్ ఇస్తున్నారు.

అయితే ఏపీతో పోలిస్తే తమిళనాడులో ఎన్నికలకు తక్కువ సమయం ఉంది. ఈ నాలుగు నెలల సమయంలో ఆయన రాష్ట్రంలో అందరితో ఎలా డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. వారికి ఎలాంటి హామీలను ఇవ్వబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రత్యర్థి బీజేపీ అన్నాడీఎంకే వర్గాలు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయి…వాటిని ఎదుర్కొని డీఎంకేనీ పీకే గెలిపించగలడా అన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story