ఆరోగ్యశాఖకు కరోనా ఫీవర్..!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా కట్టడికి ముందుండి సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఒక్కొక్కరుగా వైరస్ బారిన పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 30 మంది వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు కొవిడ్​బారిన పడ్డారు. ఈ పరిణామాలతో ఆరోగ్యశాఖ ఉద్యోగలు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ఆరోగ్య శాఖ ఉద్యోగులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే జిల్లాలో నలుగురు వైద్యులతో పాటు సుమారు 15 మందికి పైగా పారామెడికల్ ఉద్యోగులు కరోనా బారిన పడడం కలవరపెడుతోంది.

సిబ్బందిపై వైరస్ ​ప్రభావం..

కరోనా వైరస్​జిల్లాలో ఆరోగ్య శాఖ ఉద్యోగులపై ప్రభావం చూపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లాలో ఇప్పటి దాకా నలుగురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. అలాగే ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక ఫార్మాసిస్ట్, నలుగురు హెల్త్ అసిస్టెంట్లు, ఒక సూపర్​వైజర్​, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశా కార్యకర్తలు కొవిడ్​ బారిన పడ్డారు. ఈ పరిణామాలు జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య అధికారులు, ఉద్యోగులను ఆందోళన కు గురి చేస్తోంది. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరిట అందరికీ ట్రీట్​మెంట్​ చేసినా హైడ్రాక్షీ కరోనా నుండి కాపాడలేక పోయాయన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది.

మరో వైపు కొవిడ్ పరీక్షలు నిర్వహించే సిబ్బంది ఒకొక్కరుగా వైరస్ బారిన పడుతున్నారని, తమకు నేడో రేపో ఆ పరిస్థితి రావొచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రోజూ తమతో కలిసి ఉండే వారికి పాజిటివ్​ రావడంతో మిగిలిన ఉద్యోగులను తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్నది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగానే బతికుంటే బలుసాకు తినొచ్చని, ప్రస్తుతం కరోనా బారినపడకుండా చూసుకోవాలని ఉద్యోగులపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు.

అభయం ఇస్తే సేవలకు సిద్ధం..!

కరోనా కట్టడి లో ముందున్న వైద్య సిబ్బంది సేవలు అందించేందుకు వెనుకాడబోమని, అయితే తమకు, తమ ఆరోగ్య పరిరక్షణకు భరోసా ఇస్తే సేవలు అందిస్తామని చెబుతున్నారు. సేవలందించే క్రమంలో కరోనా బారిన పడితే నాణ్యమైన, మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం హామీ ఇవ్వాలని కోరుతున్నారు. సాధారణ కరోనా బాధితుల మాదిరిగానే తమను చూడడం సరి కాదని చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా కొవిడ్ నియంత్రణ అధికారి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రత్యేక వైద్య సేవలు అందించే కేంద్రాన్ని జిల్లా స్థాయిలో ఆరోగ్య శాఖ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

మరోవైపు ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా బారిన పడుతున్న ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ కోసం ఇతర సిబ్బందిని వినియోగిస్తున్న నేపథ్యంలో ముందుగా వారికి సరైన శిక్షణ ఇవ్వాలని కూడా ఉద్యోగులు కోరుతున్నారు . ఇప్పటికే చాలా మంది హెల్త్ అసిస్టెంట్లు కరోనా బారిన పడ్డారని వారికి సరైన వైద్యం అందించాలని, కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తమకు భద్రత కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి కోరారు. మరోవైపు పారామెడికల్ సిబ్బంది తో పాటు క్రమంగా వైద్యులు కూడా కరోనా బారిన పడుతుండడం డాక్టర్లను కలవరపెడుతోంది. దీనిపై జిల్లా స్థాయిలో ఒక కమిటీని వేసి వైద్యులు, సిబ్బంది కి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.

Advertisement