థర్డ్ వేవ్ వచ్చేదాకా ఏమీ చేయరా..? ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం

by Shyam |
High Court, cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా థర్డ్ వేవ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు సరిగ్గా లేకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుని కొన్ని సూచనలు చేసిందని, వాటిని కూడా అమలు చేయడంలేదని, ఇక థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడంలేదని నిలదీసింది. ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు, ఇకపైన తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పూర్తి వివరాలు లేవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజారోగ్య డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా అందించిన నివేదికలను హైకోర్టు పరిశీలించింది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల కోసం గరిష్టంగా ఎంత ఛార్జి చేయవచ్చునో ప్రభుత్వం కొత్తగా జీవోను జారీ చేయాలని హైకోర్టు గత విచారణ సందర్భంగా సూచించినా ఇప్పటికీ అలాంటి ఉత్తర్వులు ఎందుకు వెలువరించలేదని ప్రశ్నించింది. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకే తరహా చికిత్స ఛార్జీలు ఉండాలని చెప్పినా అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్ కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారని, ఆస్తులు అమ్ముకుంటున్నారని, ఇంత ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించింది.

కరోనా కట్టడి కోసం, ప్రజలకు ఎదురయ్యే కష్టాల పరిష్కారం కోసం, ఇబ్బందులను తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహా కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పినా ఇంకా ఆ దిశగా ఏర్పాట్లు కూడా లేవని గుర్తుచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో టెస్టుల సంఖ్యను పెంచడం కీలకమని, కొత్తగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేసే లాబ్‌‌లను నెలకొల్పాలని సూచించినా ఇంకా అందుబాటులోకి ఎందుకు రాలేదని ప్రశ్నించింది.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ, ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులను జారీ చేశామని అందులో పది ఆసుపత్రులకు కరోనా చికిత్స కోసం ఇచ్చిన అనుమతులను రద్దుచేసినట్లు తెలిపారు. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలను పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కేవలం ఈ పేషెంట్ల కోసమే 1,500 పడకలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.

ఒక్క నీలోఫర్ ఆస్పత్రి సరిపోతుందా?

థర్డ్ వేవ్ వస్తుందని, పిల్లలు కూడా ఈసారి కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారని హెచ్చరికలు వైద్య నిపుణుల నుంచి వస్తున్నా దానికి తగిన ఏర్పాట్లు, మౌలిక సౌకర్యాల పెంపు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని బెంచ్ తప్పుపట్టింది. మహారాష్ట్రలో చాలా తక్కువ వ్యవధిలోనే సుమారు ఎనిమిది వేల మంది చిన్న పిల్లలు వైరస్ బారిన పడ్డారని, తెలంగాణలో సైతం ఇలాంటి పరిస్థితి తలెత్తితే చికిత్స ఎలా అని ప్రశ్నించింది. థర్డ్ వేవ్ వచ్చే వరకూ చూస్తూనే ఉంటుందా ప్రభుత్వం అని ప్రశ్నించింది.

చిన్నపిల్లలు వైరస్ బారిన పడితే ఆస్పత్రులు తగిన సంఖ్యలో లేవని, ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రి మాత్రమే ఉన్నదని, ఇదొక్కటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఆస్పత్రుల్లో సైతం పిల్లలకు ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి వీలుగా మౌలిక సదుపాయాలను పెంచడం, సిబ్బందిని తగిన సంఖ్యలో సమకూర్చడం లాంటివేమీ ఉండవా అని ప్రశ్నించింది. విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావించగా, ఖమ్మం పర్యటనకు వెళ్లారని అడ్వొకేట్ జనరల్ బదులిచ్చారు.

బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు అవసరమైన మందులు సైతం బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్ళిపోతున్నాయని, ప్రభుత్వం ఎందుకు నివారించలేకపోతున్నదని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారని, మందులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నందుకు 150 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తన నివేదికలో పేర్కొన్నారని బెంచ్ గుర్తుచేసింది.

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు 2.61 లక్షల కేసులను నమోదు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలియజేశారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నందునే ఉల్లంఘనలకు పాల్పడినవారపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఏప్రిల్‌ 1 నుంచి మే 30వ తేదీ వరకు సుమారు ఏడున్నర లక్షల కేసులు నమోదు చేశామని, మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి రూ. 35.81 కోట్ల మేర జరిమానా విధించినట్లు నివేదికలో వివరించారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గూమిగూడినందుకు 13,867 కేసులు నమోదైనట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed