ట్రైన్‌లో ప్రయాణించాలంటే విమానం నిబంధనలు పాటించాలి?

by srinivas |
ట్రైన్‌లో ప్రయాణించాలంటే విమానం నిబంధనలు పాటించాలి?
X

లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత ప్రజారవాణా వ్యవస్థ నడుస్తుందా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. మే 3న లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని మీడియా సంస్థలు ప్రచురిస్తున్న వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది. నాలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారిందని, లాక్‌డౌన్ కొనసాగితే ఆ రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయని చెబుతోంది.

మరోవైపు పరిశ్రమలు, నిత్యావసర సరకుల దుకాణాలు, మాల్స్‌కి అనుమతులిచ్చింది. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు షాపింగ్‌లు చేసుకోవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తేస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో త్వరలో లాక్ డౌన్ ను తొలగించి, రైళ్లు నడిచేందుకు అనుమతులు లభిస్తాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. అయితే రైళ్లలో ప్రయాణాలకు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్న నియమం రానుంది.

ఈ మేరకు పలు రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తునిలోనూ ఇదే తరహా మాక్ డ్రిల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించారు. రైలు ఎక్కాలంటే, ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టుగా కనీసం 2 గంటల ముందే స్టేషన్‌కు రావాల్సి వుంటుంది. రైలు ప్రయాణం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యమూ లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది.

రైల్వే టికెటింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలన్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. దీనిని కూడా ఆన్‌లైన్ మాధ్యమంగా బుక్ చేసుకునే వెసులుబాటు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ బోగీ ప్రయాణీకులను ఎలా నియంత్రిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. రైల్వే స్టేషన్లలో ధర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో రైల్లో ప్రయాణించాలన్నా విమానం రూల్స్ పాటించాల్సిందేనని తెలుస్తోంది,

Tags: indian railways, train journey, new rules, train, lockdown, mock drill, east godavari

Advertisement

Next Story

Most Viewed