సెకండ్ కాంటాక్ట్ టెస్ట్ కరోనా!

by vinod kumar |
సెకండ్ కాంటాక్ట్ టెస్ట్ కరోనా!
X

దిశ, నల్లగొండ : ‘లక్షణాలు లేవనే పేరుతో ప్రైమరీ కాంటాక్ట్స్‌కు మాత్రమే టెస్టులు చేస్తున్నారు. అలా చేసినంత కాలం పరిస్థితి ప్రమాదకరంగానే ఉంటుంది. ఇలా అయితే సూర్యాపేట జిల్లాలో అమెరికా స్థాయి పరిస్థితులు నెలకొంటాయి. వీలైనంత మందికి ఎక్కవు టెస్టులు చేయాలి. మాకు తెలిసినా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఏం చేయలేకపోతున్నాం’ అని సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. విషయమేమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రైమరీ కాంటాక్ట్స్‌కు మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించాలని, సెకండరీ కాంటాక్ట్స్‌లో లక్షణాలు లేని వాళ్లకు టెస్టులు చేయోద్దని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో చాలా కేసుల్లో సెకండరీ కాంటాక్ట్స్‌కు సైతం వైరస్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోన్నది.

అది కేవలం అపోహ అవుతది..

సూర్యాపేట జిల్లాలో ఉన్నట్టుండీ ఒక్కసారిగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పూర్తిగా కేసులు తగ్గాయనుకుంటే మాత్రం అది కేవలం అపోహ అవుతుంది. ఎందుకు అనుకుంటున్నారా.. జిల్లాలో 23వ తేదీ నుంచి ఒక్క వ్యక్తికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించలేదు. శాంపిల్స్ సేకరించలేదు. వాస్తవానికి టెస్టులు చేస్తున్నకొద్దీ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో అధికార యంత్రాగం కేంద్రం నిబంధనల ప్రకారం.. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు నిర్వహించాలని చెప్పిందంటూ శాంపిల్స్ సేకరించడం మానేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కేసులేవీ నమోదు కావడం లేదు. పక్కనున్న పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కానీ, దానిని ఆనుకుని ఉన్న సూర్యాపేట జిల్లాలో మాత్రం పూర్తిగా టెస్టులు చేయడం మానేసింది. ఇది భవిష్యత్తులో తీరని అనర్థానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికీ రెడ్‌జోన్‌లోనే సూర్యాపేట..

సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరి నుంచి ఇద్దరు అలా జిల్లావ్యాప్తంగా 83 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 12 వరకు ఒక్క కేసు మాత్రమే ఉంది. అనంతరం ఎవరూ ఊహించని విధంగా వరుసగా కుప్పలు తెప్పలుగా కేసులు వచ్చిపడ్డాయి. ఒక్క సూర్యాపేట పట్టణంలోనే 53 కేసులు ఉండగా, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో 30 కేసులు వెలుగు చూశాయి. ఈనెల 19వ తేదీ వరకు కరోనా కేసులతో సూర్యాపేట జిల్లా అట్టుడికిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని సూర్యాపేటకు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారుల బృందం పర్యటించి కాస్తంత ఉపశమన చర్యలు తీసుకుంది. తర్వాత ఏమైందో ఏమోగానీ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత పది రోజులకు పైగా సూర్యాపేట జిల్లాలో ఒక్క కేసు నమోదు కావడం లేదు. దీంతో కరోనాను కట్టడి చేశామంటూ అధికార యంత్రాంగం ప్రకటించిది. కానీ, ఇదంతా ఏ మేరకు వాస్తవమనేది తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. ప్రభుత్వం ప్రకటించిన రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ల విభాగాల వారీగా చూస్తే.. ఇప్పటికే సూర్యాపేట జిల్లా రెడ్‌జోన్‌లోనే ఉంది.

వారం రోజులకు పైగా నో శాంపిల్స్..

సూర్యాపేట జిల్లాలో వారం రోజుల పైనుంచి ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఇందుకు కేసులు పూర్తిగా తగ్గడం కారణం కాదు. ప్రైమరీ, సెకండరీ కేసుల నుంచి శాంపిల్స్ తీసి టెస్టులు చేయకపోవడమే కారణంగా తెలుస్తోన్నది. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 83 పాజిటివ్ కేసులు నమోదైతే.. 796 టెస్టలు మాత్రమే చేశారు. ప్రతి వంద శాంపిళ్లలో సగటున 10 మందికి పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయినా వారం రోజుల పైగా ఒక్కరి నుంచి శాంపిల్స్ సేకరించకపోవడం గమనార్హం.

లక్షణాలు లేవనే సాకుతో..

ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కేసుల్లో కరోనా అనుమానిత లక్షణాలు లేవనే సాకుతో ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. అయితే నిజానికి ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల్లో 80 శాతం మందికి పైగా కరోనా లక్షణాలు లేవు. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో లక్షణాలు లేని కరోనా వైరస్ సోకిన వాళ్ల నుంచి వందల మందికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు ఇదే మాట చెబుతున్నారు. లక్షణాలతో సంబంధం లేకుండా వీలైనంత ఎక్కవు మందికి టెస్టులు చేయాలని చెబుతున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ మాటలను పెడచెవిన పెడుతోంది.

Tags: Nalgonda, Suryapet, Corona Cases, Officers, Samples, Positives

Advertisement

Next Story