పదిలో ఫెయిల్ అయినా.. పట్టుదలతో ఐఏఎస్

by Shyam |
పదిలో ఫెయిల్ అయినా.. పట్టుదలతో ఐఏఎస్
X

దిశ, నాగర్‌కర్నూల్: రేపటి పౌరులుగా ఎదగాల్సిన నేటి బాలలు పట్టుదలతో ముందుకు వెళితే ఎంతటి కష్టతరమైన విజయాలనైనా సాధించవచ్చని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ చౌహాన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… కటిక పేదరికంలో ఉన్నా.. ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారం ఉందని పట్టుదలతో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని సాధించాలని పిలుపునిచ్చారు. తాను పదో తరగతిలో ఫెయిల్ అయ్యి రెండేండ్లు ఖాళీగా కూర్చున్నా పట్టుదలతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో ఐఏఎస్ పాస్ అయినట్టు గుర్తు చేశారు. అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని వారిని తెలియజేశారు. దీనికోసం ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటివి ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇంటి వద్దే ఉండి చదువుకునేందుకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తుందన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో డీడీ సప్తగిరి ఛానల్లో ఆన్లైన్ తరగతులు ప్రసారం అవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ప్రధానోపాధ్యాయులు కురుమయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story