కొక్కరకో అనాల్సిన కోడి.. కొనుక్కోండిరో అంటోంది

by Anukaran |   ( Updated:2021-01-12 00:26:36.0  )
కొక్కరకో అనాల్సిన కోడి.. కొనుక్కోండిరో అంటోంది
X

దిశ,వెబ్‌డెస్క్ : నిన్నమొన్నటి వరకు చికెన్ తెగ లాగించారు. ముక్క లేనిదే ముద్ద ముట్టలేదు. పొద్దున్న టిఫిన్‌లోకి, మధ్యాహ్నం లంచ్‌లోకి.. రాత్రికి డిన్నర్‌లోకి సందర్భమేదైనా చికెన్‌ ఉండాల్సిందేనని పట్టుబట్టారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తెలుగురాష్ట్రాలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేకపోయినా మాంసం ప్రియులు చికెన్ అంటే చాలు వద్దు బాబాయ్ అంటున్నారు. దీంతో కొక్కరకో అనాల్సిన కోడి.. కొనుక్కోండిరో అంటోంది.

ఏ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చినా ముందుగా ఎఫెక్ట్ పడేది ఫౌల్ట్రీ రంగంపైనే. నిన్నమొన్నటి వరకు చికెన్ తింటే కరోనా వస్తుందన్నారు. కాదు కాదు చికెన్ తోనే కరోనాకు చెక్ పెట్టొచ్చంటూ ఎగబడి కొన్నారు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో ఒకానొక దశలో అదే జనాలు కరోనా వ్యాప్తితో చికెన్ తినడం మానేశారు. దీంతో ఫౌల్ట్రీరంగం భారీగా కుదేలైంది. మళ్లీ ఫౌల్ట్రీరంగాన్ని లాభాల బాట పట్టించేందుకు పలువురు నేతలు చికెన్ తింటే ఏం కాదు..చూడండి మేం కూడా తింటున్నామంటూ ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఫౌల్ట్రీ రంగం భారీ నష్టాల్ని మూటగట్టుకుంటోంది.

తాజాగా 10రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కేరళ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ మహరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఢిల్లీలో మాంసం ధరలు తగ్గిపోయాయి. మహరాష్ట్రకు చెందిన కోళ్ల ఫారాల్లో కిలో కోడి ధర రూ.82 ఉంటే రూ.58లకు పడిపోయింది. దీంతో పాటు గుజరాత్ లో రూ.94 నుంచి 65కి, తమిళనాడులో రూ.80నుంచి రూ.70కి పడిపోయింది. అదే సమయంలో కోడిగడ్డు ధరలు కూడా తగ్గాయి. తమిళనాడులో ఒక్కో కోడి గుడ్డు ధర రూ.5.10 ఉండగా ఇప్పుడు అదే కోడి గుడ్డు ధర రూ. 4.20కి పడిపోయింది. హర్యానాలో రూ. 5.35 గా ఉన్న కోడి గుడ్డు ధర రూ.4.05, పూణేలో రూ. 5.30గా ఉన్న కోడి గుడ్డు ధర రూ.4.50కి పడిపోయింది.

మనదేశంలో రోజుకు 1.3కోట్లు కోళ్లు, 20కోట్ల గుడ్లు సేల్ అవుతాయి. వింటర్ సీజన్ లో ఆ సంఖ్య 1.5 కోట్లు మరియు 28-29 కోట్లకు పెరుగుతుంది. కానీ ఈ వింటర్ సీజన్ లో బర్డ్ ఫ్లూ భయం కారణంగా గత 4,5 రోజుల్లో చికెన్ వినియోగం 30-40 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ చికెన్ ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని ఫౌల్ట్రీ నిపుణలు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed