కేసీఆర్ ఎందుకు గమ్మునున్నడు..?

by Anukaran |   ( Updated:2020-08-01 00:51:42.0  )
కేసీఆర్ ఎందుకు గమ్మునున్నడు..?
X

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తేదీ ఖరారు చేసిన తర్వాత తెలంగాణ సీఎం హాజరు కావడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? కృష్ణా జల వివాదాలపై రెండు రాష్ట్రాల సీఎంలు అవగాహనకు వచ్చారనుకోవాలా? ఇప్పటిదాకా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నవారు సమస్య కొలిక్కి వచ్చే టైమ్‌‌లో ఈ సమావేశానికి ఎందుకు వెళ్ళొద్దనుకుంటున్నారు? అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా తయారు చేయాలని కోరినప్పుడు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయని కేసీఆర్ ఇప్పుడు ప్రీ షెడ్యూలు సమావేశాలు ఉన్నాయనే కారణాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తూనే ఆంధ్రప్రదేశ్ వైఖరిని ఎండగట్టడానికి ఈ వేదికను ఎందుకు వాడుకోవాలనుకోవడం లేదు? అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరు కావడంపై ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలివి.

దిశ, న్యూస్ బ్యూరో: కృష్ణా బేసిన్‌పై ఏపీ, గోదావరి బేసిన్‌పై తెలంగాణ అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నట్లు ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రం ఫిర్యాదులు చేసుకున్నాయి. చివరకు శ్రీశైలం జలాశయం నుంచి ఎడమగట్టు విద్యుత్తు ప్లాంట్ నిరంతరాయంగా నడుపుతూ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్న అంశంపై కూడా ఏపీ ఫిర్యాదు చేసింది. పదేపదే దీనిపై బోర్డుకు లేఖలు కూడా రాసింది. ఇంత స్థాయిలో ఫిర్యాదులు చేసుకున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొలిక్కి వస్తాయనుకుంటున్న సమయంలో అపెక్స్ కౌన్సిల్‌ సమావేశానికి సమయం కేటాయించ లేకపోవడంలో అంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇద్దరు సీఎంలు ఒక రహస్య అవగాహనకు వచ్చిన తర్వాతనే ఈ ప్రకటన వెలువడిందనుకోవాలా? ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు, నీటిపారుదల శాఖల్లో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఒప్పందం ప్రకారమే అంగీకారానికి వచ్చి కలిసిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ చర్చల సారాంశం.

డీపీఆర్‌లు ఇవ్వాల్సి వస్తుందనే
భయమే కారణమా?

ఐదేండ్ల నుంచి రెండు రాష్ట్రాల మధ్య వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల వివాదం సాగుతూ ఉంది. ఇప్పటివరకు జరిగిన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ 12 సమావేశాల్లో రెండు రాష్ట్రాలకు విధించిన షరతు కూడా డీపీఆర్‌ల అంశమే. ఉమాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి అపెక్స్ కౌన్సిల్‌లో కూడా డీపీఆర్‌లు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. కానీ ఇరు రాష్ట్రాలూ డీపీఆర్‌ల అంశం చర్చకు రాగానే తప్పుకుంటున్నాయి. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ కూడా డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని రెండు రాష్ట్రాలకూ ఇప్పటికే స్పష్టం చేశాయి. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా కొత్తది కాదని, అన్నీ పాత ప్రాజెక్టులేనని, డీపీఆర్‌లు ఇచ్చే ప్రసక్తే లేదని రకరకాల కారణాలను చూపుతూ ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 5న నిర్వహించాలని కేంద్రం రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ముందస్తు ప్రోగ్రాంల సాకు చూపి అపెక్స్ కౌన్సిల్‌కు హాజరు కాలేమంటూ చెప్పేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుని భక్త రామదాసు వరకూ, కృష్ణాపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి నుంచి ఆర్టీఎస్ వరకూ అన్ని డీపీఆర్‌లను కేంద్రం చేతికివ్వాల్సిందే. దీంతో అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయనే భయంతో అపెక్స్ కౌన్సిల్‌కు హాజరుకావద్దనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల సమాచారం.

రాయలసీమను ఎలా ఆపుతారు?

నిజానికి ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మొదలయ్యాయి. ఏపీ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే టెండర్లను కూడా పిలిచింది. ఆగస్టు 19 నాటికి టెండర్లను ఖరారు చేసి కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోనుంది. ఈ సంగతి తెలిసి కూడా సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్‌ను ఈ నెల 20 తర్వాత నిర్వహించాలంటూ సూచించడం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాలు సైతం ఇప్పుడు దీనిపైనే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 20 నాటికి టెండర్ల ప్రక్రియ ముగిసి కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కూడా జరిగి రాయలసీమ ఎత్తిపోతల పనులే మొదలయ్యేట్టు ఉన్నాయని పేర్కొన్నాయి. పనులు మొదలైతే ఎలా ఆపుతారనే సందేహాలను వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌తో ఉన్న స్నేహబంధం కారణంగానే సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్‌కు సమయం ఇవ్వడం లేదని ఆరోపించాయి. ఆ రాష్ట్రానికి రాయలసీమ ఎత్తపోతల పథకానికి అడ్డు చెప్పరాదన్న ఉద్దేశంతోనే తెరవెనక కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం ఇదంతా జరుగుతోందని ఆరోపించాయి.

Advertisement

Next Story

Most Viewed