- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు నిరాశే… ఎటూ తేలని పోస్టుల భర్తీ
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త జోనల్ విధానంలో నూతన ఉద్యోగాల భర్తీపై క్లియరెన్స్ వచ్చినా పాత ఉద్యోగుల సర్దుబాటు ఎటూ తేలడం లేదు. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తున్నది. కేడర్ స్ట్రెంత్పై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ కింద ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చారు. ఆ ప్రకారమే ఉద్యోగులు ఆయా జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలకు కేటాయింపులు, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల జాబితా సేకరించినా.. ఇప్పుడు సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. ఓవైపు ఉద్యోగ సంఘాలు దీనిపై తిరకాసు పెడుతున్నాయి. పాత ఉద్యోగులను కదిలిస్తే తేనెతుట్టెను కదిలించిన తరహాలో ఉంటుందని, వారిని ఏ స్థానికత ఆధారంగా బదిలీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఆప్షన్లు తీసుకుందామని భావించినా.. దానితో ఉద్యోగ వర్గాల్లోనే వ్యతిరేకత ఉంటుందని తేలింది. మరోవైపు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ప్రకారం స్థానికతను తీసుకుంటే ఇప్పుడు వారిని పాత ప్రాంతాలకు ఎలా పంపిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు పట్టు మీదుండగా.. ఉన్నతాధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో సీఎం దగ్గర తేల్చుకుంటామని, సీఎంను ఎలా ఒప్పించాలో తెలుసంటూ ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఆప్షన్లు, ఉద్యోగ బదిలీలు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కానీ ఇది ఇప్పట్లో తేలేది కష్టంగానే మారింది.
పాత వారిని ముట్టకోవద్దు
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీ చేశారు. వారిని ఇప్పుడు ఏ ప్రాతిపదికన బదిలీ చేయాలనే అంశంపై తేల్చడం లేదు. గతంలో వీరికి ఐచ్ఛికాలు ఇచ్చి సొంత జిల్లాలకు పంపాలని ఉద్యోగ సంఘాలు సూచించాయి. అయితే ఆప్షన్లు ఇస్తే ఒకే పోస్టుకు నలుగురైదుగురు పోటీ పడే అవకాశాలున్నాయి. అటు భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పనిచేసేలా స్పౌస్ కేసుల బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశించినా ఇంకా ఆ ప్రక్రియను చేపట్టలేదు. ఆర్డర్ టు సర్వ్ కింద విధులు నిర్వర్తిస్తున్న వారిని బదిలీ చేయడం, స్పౌస్ కేసుల ట్రాన్స్ఫర్లు పూర్తి చేసిన తర్వాతే అసలు ఖాళీల లెక్క బయటకు వస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఇందులో పాత ఉద్యోగుల అంశంపై ఉద్యోగ సంఘాలు పట్టుపట్టాయి. ఈ వ్యవహారంలో అవగాహన లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా చేసినట్లు తెలుస్తున్నది. ముందుగా కేడర్ స్ట్రెంత్ తేల్చిన తర్వాతే ఆర్డర్ టు సర్వ్ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లా ఆధారంగా ఇప్పుడు ఉన్న ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపించాలని నిర్ణయించింది. దీంతో చాలా సమస్యలు వస్తున్నాయని ఉద్యోగ సంఘాల వాదన.
లెక్కలు ఎలా..?
పాత ఉద్యోగుల సర్దుబాటు ప్రభుత్వ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించిన నేపథ్యంలో పోస్టుల కేడర్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. కేడర్ విభజన తర్వాత ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నాలుగు నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్‌ను తేల్చలేదు. దీనిపై స్పష్టత లేకుండా ఉద్యోగుల బదిలీలు, ఖాళీల వివరాలను తేల్చడం కష్టమేననని ఉద్యోగ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత గతంలో ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేశారని, అయితే పాత జిల్లా పరంగా చూస్తే ఒక్కో జిల్లాలో నాలుగైదు జిల్లాలుగా విభజించారని, పాత జిల్లాల్లోని ఉద్యోగులనే కొత్త జిల్లాలకు సర్ధుబాటు చేశారని, ఇప్పుడు అదే పద్ధతిలో కేడర్ స్ట్రెంత్‌ను ఖరారు చేయాలంటూ సూచిస్తున్నారు. కొత్త జోనల్ పరంగా ఏండ్ల నుంచి పని చేస్తున్న ఉద్యోగులను మళ్లీ పాత స్థానాలకు పంపే ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. దీనికి పాత జీవోలు అడ్డు వస్తున్నాయి. బలవంతంగా పాత స్థానాలకు పంపిస్తే కోర్టు కేసులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక ఉద్యోగి కొన్నేండ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. మొదట్లో డిప్యూటేషన్‌పై వచ్చి ఏండ్ల నుంచి ఇక్కడే సెటిల్ కావడంతో ఇప్పుడు సదరు ఉద్యోగిని ఎక్కడి జాబితాలో తీసుకోవాలనే అంశంపై చిక్కులు వస్తున్నాయి. ఉద్యోగంలో జాయిన్ అయిన ప్రాంతంలో ఖాళీ చూపించకపోవడం, ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతంలో కూడా ఖాళీ చూపించడం సాధ్యం కావడం లేదు. ఒకవేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే సర్దుబాటు చేస్తే స్థానికత అడ్డు వస్తున్నది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం తేలడం లేదు.
సర్దుబాటు తర్వాతే నోటిఫికేషన్లు
జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ చెప్పారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రకటించింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో టీజీవో అధ్యక్షురాలు మమతతో పాటుగా టీజీవో నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా టీజీఓ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఉద్యోగులందరూ సహకరించాలని సీఎం కోరినట్టు తెలిపారు. ఉద్యోగులకు ఐచ్ఛికాలు ఇచ్చి సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయిస్తారని, అందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలని కోరామని, సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని టీజీఓ అధ్యక్షురాలు మమత తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, ప్రతినిధులు సహదేవ్, గండూరి వెంకటేశ్వర్లు, వెంకటయ్య, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
- Tags
- employess