ప్రేక్షకులు లేకుండానా ? ఆడేద్దాం !

by Shyam |
ప్రేక్షకులు లేకుండానా ? ఆడేద్దాం !
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే స్టేడియంలో సీట్ల కెపాసిటీని మించి అభిమానులు వస్తుంటారు. స్టేడియంలో సగం మ్యాచ్ పూర్తయ్యే వరకు బయట టికెట్ల కోసం అభిమానులు తండ్లాడుతూనే ఉంటారు. ఇక టీవీల్లో మ్యాచ్ చూసే వాళ్లకు సైతం ప్రేక్షకుల హోరు వినిపించపోతే బోర్‌గా ఫీలవుతుంటారు. అలాంటిది స్టేడియంలోనే ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ఆడమంటే ఆడతారా.. అలాంటి మ్యాచ్ టీవీల్లో చూడమంటే ప్రేక్షకులు చూస్తారా ? అంటే టక్కున సమాధానం చెప్పలేం. అయితే కరోనా నేపథ్యంలో క్రికెట్ ఆట స్తంభించిపోవడంతో ఐసీసీతో పాటు పలు దేశాల క్రికెట్ బోర్డులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాయి. మార్చి 13న చివరిగా జరిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ సైతం ప్రేక్షకులు లేకుండానే జరిగింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేని మ్యాచ్‌లకు పలువురు క్రికెటర్లు మద్దతు తెలుపుతున్నారు. టీమ్ ఇండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా ప్రస్తుతం ఇదే వాదన వినిపిస్తున్నాడు.

‘మనం అంతర్జాతీయ మ్యాచ్, ఐపీఎల్ ఆడే సమయంలోనే ప్రేక్షకులు ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి ఆడిన మ్యాచుల్లో ప్రేక్షకులు ఉన్నారా ? దేశవాలీ క్రికెట్‌ను చూసేందుకు ఎంత మంది ప్రేక్షకులు వస్తారు ? రంజీల్లో ఫైనల్ మ్యాచులకు కూడా ప్రేక్షకులు ఉండరే.. మరి ఇప్పుడేదో ప్రేక్షకులు లేకుండా కొత్తగా ఆడుతున్నామని అనుకోవడం దేనికి ? అందుకే ప్రేక్షకులు టీవీల్లో చూస్తారు.. మనం స్టేడియంలో ఆడదామని’ దినేష్ కార్తీక్ ప్రతిపాదించాడు. క్రికెట్‌ను బతికించాలంటే ఏదో ఒక రూపంలో ముందుకు సాగాల్సిందేనని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

Tags : Cricket Match, Stadium, Audience, Dinesh Karthik, Wicket Keeper

Advertisement

Next Story

Most Viewed