డిజిటిల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

by Harish |
డిజిటిల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావంతో చాలా మంది కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం, ఎమ్‌ఐ పే, పే పాల్‌ వంటి డిజిటల్స్ యాప్స్ వినియోగం పెరిగింది. అయితే ఇలాంటి యాప్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

శ్రీకాంత్ ఓ ఐటీ ఎంప్లాయ్. కరోనా లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ చేస్తున్నాడు. ఆఫీస్ పనిలో ఉండగా.. తన ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. పని చేసుకుంటూనే. శ్రీకాంత్ ఆ మెసెజ్ ఓపెన్ చేశాడు. హాలో శ్రీకాంత్ గారు.. మీకు రూ. 50 వేలు పంపుతున్నాం, వెంటనే మీకు పంపిన లింక్ ఓపెన్ చేసి యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయండని ఉంది. కంగారులో శ్రీకాంత్.. ఏదీ ఆలోచించకుండా అలానే చేశాడు. తీరా చూస్తే.. శ్రీకాంత్ అకౌంట్‌లో మనీ మొత్తం డ్రా అయిపోయింది.

ఇది శ్రీకాంత్ ఒక్కడికే జరిగింది కాదు.. ఇలా ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్లు మనలో ఎంతోమంది ఉన్నారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఒక చిన్న పొరపాటు కారణంగా లేదా డబ్బులకు ఆశపడటం మూలాన సైబర్‌ నేరగాళ్లకు చిక్కి వ్యాలెట్‌లోని క్యాష్ అంతా పొగొట్టుకుంటున్నారు. అందుకే డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డులకు పిన్ ఉన్నట్టే యూపీఐ అకౌంట్‌కు కూడా ఓ పిన్ ఉంటుంది. మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పిన్ నంబరును ఎవరికీ చెప్పొద్దు. మీ యూపీఐ అకౌంట్ ఉన్న యాప్‌లో తప్ప మరే యాప్‌లో మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు డబ్బులు పంపడానికి, అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేయడానికి మాత్రమే మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు డబ్బులు స్వీకరించేందుకు యూపీఐ పిన్ అవసరం ఉండదు. ఎవరైనా మీకు డబ్బులు పంపుతున్నామని, మీ యాప్‌లో వెంటనే యూపీఐ పిన్ ఎంటర్ చేయండని అడిగితే అస్సలు చేయొద్దు. అందులో ఏదో మోసం ఉందనే గుర్తించాలి.

గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యాప్స్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసేముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సేమ్‌ వీటిని పోలినట్టు ఉండే యాప్స్‌ ప్లే స్టోర్‌లో చాలానే ఉంటాయి. పొరపాటున నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేశారో.. ఇక అంతే సంగతులు. అందుకే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసే ముందు ఒకటికి పది సార్లు చెక్‌ చేసుకోవాలి. అది జెన్యూన్‌ యాప్? అనే విషయాన్ని డెవలపర్‌ నేమ్‌ ద్వారా చెక్ చేసుకోవాలి. అంతేకాదు యాప్‌లో ఏదైనా సమస్య వస్తే.. అధికారిక వెబ్‌సైట్‌లోనే కస్టమర్ కేర్ నెంబర్లు, ఇమెయిల్ ఐడీలు ఉంటాయి. వాటికి మాత్రమే చేయాలి. అంతేకానీ గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ల కోసం సెర్చ్ చేయకూడదు. అక్కడ ఫేక్‌ యాప్‌లు, ఫేక్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్లు ఎన్నో ఉంటాయి. అలానే మీ బ్యాంకుకు సంబంధించిన ఎటువంటి ఆర్థిక వివరాలను ఫోన్లలో స్టోర్ చేసుకోవద్దు.

మీ అకౌంట్లో డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే. ఈ సూచనల్ని మీ మైండ్‌లో పెట్టుకుని డిజిటల్‌ పేమెంట్స్‌ చేయండి. ఏమాత్రం అనుమానం ఉన్న పేమెంట్స్‌ చేయకపోవడమే శ్రేయస్కరం.

Advertisement

Next Story

Most Viewed