3 జిల్లాల్లో కరోనా సీరియస్ పేషెంట్లకు కష్టకాలం

by  |
3 జిల్లాల్లో కరోనా సీరియస్ పేషెంట్లకు కష్టకాలం
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు హైదరాబాద్ నగరాన్ని దాటి జిల్లాలకు పాకడంతో అక్కడి ఆసుపత్రుల్లో కష్టాలు మొదలయ్యాయి. వరంగల్ అర్బన్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో కరోనా కారణంగా పేషెంట్ల ఆరోగ్య స్థితి సీరియస్ అయితే అనివార్యంగా హైదరాబాద్‌కు రావాల్సిందే.

ఇటీవలి కాలంలో ఈ మూడు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆక్సిజన్ సౌకర్యం లేదా వెంటిలేటర్ పెట్టాల్సి వస్తే అనివార్యంగా వారికి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్ దొరకడం కష్టమే. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌లు మొత్తం పేషెంట్లతో నిండిపోయాయి. కొత్తగా సీరియస్ కండిషన్‌లో కరోనా పేషెంట్లు వస్తే వారిని చేర్చుకోవడం సాధ్యం కాదు.

తాజాగా రాష్ట్ర ప్రజారోగ్య శాఖ వెలువరించిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 56 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,431 మంది పేషెంట్లు ఆక్సిజన్ బెడ్‌లమీద, మరో 355 మంది పేషెంట్లు ఐసీయూ వార్డుల్లో ఉన్నారు. అయితే వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలోని మొత్తం 150 ఆక్సిజన్ బెడ్‌లూ పేషెంట్లతో నిండిపోయాయి. ఐసీయూలో వెంటిలేటర్ సౌకర్యం కలిగిన 20 బెడ్‌లూ నిండిపోయాయి. ఇక్కడ కొత్తగా సీరియస్ పేషెంట్లకు ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ అవసరం ఏర్పడితే ప్రభుత్వం చేతులెత్తాయాల్సిందే. లేదా నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాల్సిందే. ఇప్పటికే నగరంలోని ఆదిత్య ఆసుపత్రిలో ఇరవై ఆక్సిజన్ బెడ్‌లు, 19 ఐసీయూ బెడ్‌లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి.

సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్న 40 ఆక్సిజన్ బెడ్‌లు, 20 ఐసీయూ బెడ్‌లు నిండిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్‌లు లేవు. కేవలం నాలుగు ఐసీయూ బెడ్‌లు మాత్రమే ఉంటే అవి కూడా నిండిపోయాయి. ఈ మూడు జిల్లాల్లో కరోనా కారణంగా అత్యవసర పేషెంట్లు ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సౌకర్యం అవసరమైతే హైదరాబాద్‌కు పరుగు తీయాల్సిందే. మరోవైపు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కేవలం 70 రెగ్యులర్ బెడ్‌లు మాత్రమే ఉంటే అవన్నీ నిండిపోయాయి. గద్వాల జిల్లా ఆసుపత్రిలో 30 రెగ్యులర్ బెడ్‌లు, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలోని 60 రెగ్యులర్ బెడ్‌లు పేషెంట్లతో నిండిపోయాయి.

రాష్ట్రం మొత్తం మీద కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 6,580 మంది పేషెంట్లలో సుమారు 65% మంది (4,260 మంది) ఆక్సిజన్, ఐసీయూ వార్డుల్లోనే చికిత్స పొందుతున్నారు. మూడింట రెండు వంతుల మందికి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ అవసరం ఉన్నందున జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత ఏర్పడితే అనివార్యంగా హైదరాబాద్ రావాల్సిందే. వరంగల్‌లో మూడు, కరీంనగర్‌లో రెండు తప్ప రాష్ట్రంలో ఎక్కడా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ వార్డులు కరోనా పేషెంట్ల కోసం లేవని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయం పేర్కొంది.


Next Story

Most Viewed