మా సహకారం కష్టం -కేరళ సీఎం 

by Shamantha N |
మా సహకారం కష్టం -కేరళ సీఎం 
X

దిశ, వెబ్‌డెస్క్: తిరవనంతపురం విమానాశ్రయం నిర్వహణ, కార్యకలాపాలను అదానీ గ్రూపునకు అప్పగించడంపై పునరాలోచించాలని కేరళ ప్రభుత్వం ప్రధాని మోదీని కోరింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో రాష్ట్రం సహకరించడం కష్టమని అన్నారు. విమానాశ్రయ నిర్వహణ, కార్యకలాపాలను స్పెషల్ పర్పస్ వెహికల్(special purpose vehicle)కి బదిలీ చేయలంటూ కేరళ ప్రభుత్వం పదేపదే అభ్యర్థించిందని, అయినా పట్టించుకోలేదంటూ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన వాటాదారుగా ఉన్నటువంటి ఎస్‌పీవీకి తిరవనంతపురం విమానాశ్రయ నిర్వహణను తమకు ఇస్తామని 2003లో హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపణలు చేశారు. విమానాశ్రయ అభివృద్ధి కోసం తాము చేసిన కృషిని విస్మరించారని చెప్పారు. తాజా నిర్ణయం ఏకపక్ష రీతిలో ఉందని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు పినరయ్ విజయన్ అన్నారు. జైపూర్, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

2019 ఫిబ్రవరిలో బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత పీపీపీ మోడల్ ద్వారా లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి – ఆరు విమానాశ్రయాలను నడిపే హక్కులను అదానీ ఎంటర్‌ప్రైజెస్ గెలుచుకుంది. వీటిలో మంగళూరు, లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాలను లీజుకు అదానీ గ్రూపునకు అనుకూలంగా గతేడాది జులైలో కేంద్రం ఆమోదం ఇచ్చింది. మిగిలిన మూడింటినీ పీపీపీ విధానంలో ఇచ్చేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వీటి నిర్వహణను 50 ఏళ్ల పాటు అదానీ గ్రూపు (adani group) చూసుకోనుంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed