బిగ్ బ్రేకింగ్: రేవంత్ రెడ్డి ఇంట్లో ధర్మపురి, గండ్ర, ఎర్ర శేఖర్ భేటీ

by Anukaran |   ( Updated:2023-10-10 16:24:08.0  )
బిగ్ బ్రేకింగ్: రేవంత్ రెడ్డి ఇంట్లో ధర్మపురి, గండ్ర, ఎర్ర శేఖర్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, త్వరలోనే కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని నిజామాబాద్​ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మహబూబ్‌నగర్ ​బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా సీనియర్​నేత గండ్ర సత్యనారాయణ వెల్లడించారు. రేవంత్​రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్​బలోపేతమవుతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రేవంత్​రెడ్డి నివాసంలో పలువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

అనంతరం ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ..​కాంగ్రెస్‌లో పుట్టి పెరిగానని, కొన్ని కారణాలతో బయటకు వెళ్లాల్సి వచ్చిందని, నాన్న కోసమే టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. టీఆర్‌ఎస్​కండువా ఒక గొడ్డలి వంటిదని, టీఆర్‌ఎస్​అసలు రాజకీయ పార్టీ కాదని, అందులో నేతలకు విలువ లేదని, జిల్లా అధ్యక్షుడికి కూడా గుర్తింపు ఉండదన్నారు. రేవంత్​రెడ్డి నాయకత్వాన్ని బలపర్చేందుకు తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తున్నానని, త్వరలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతానని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్​ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందన్నారు. బీజేపీ సభ్యత్వానికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎర్ర శేఖర్ ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరేందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా టీడీపీ నేత గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే భూపాలపల్లిలో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story