ధరణి ఎఫెక్ట్.. పరిష్కారం అంత ఈజీ కాదు

by Shyam |
ధరణి ఎఫెక్ట్.. పరిష్కారం అంత ఈజీ కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎవరైనా భూముల కోసం పంచాయతీలు పెట్టుకునేరు.. పంపకాల్లో తేడాలొచ్చినా.. సరిహద్దుల్లో తేడాలొచ్చినా ఎవరికి వారు పరిష్కరించుకోవాల్సిందే. అన్యాయం జరిగిందని భావిస్తే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే ఆప్షన్ లేదు. ఆర్డీఓ కార్యాలయాల గేట్లు మూసి చాలా రోజులైంది. కలెక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిందే.. ఏ చిన్న తప్పు జరిగినా జిల్లా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందే. మీ అర్జీలు కలెక్టర్లు పరిశీలించి న్యాయం చేసేందుకు నెల పట్టొచ్చు.. ఏడాది కూడా పట్టొచ్చు. పైగా కలెక్టర్ దర్శన భాగ్యం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడిదే గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తోన్న చర్చ.

ధరణి పోర్టల్ వచ్చేసింది.. అన్నింటికీ చెక్ పెట్టేసింది. ఉన్నతాధికారుల లెక్కల ప్రకారం సమస్యలన్నీ పరిష్కారమైనట్లే.. పార్టు బి సమస్యలు మినహా మరేఇతర అంశాలు పెండింగులో లేనట్లే.. ప్రతి సోమవారం తహసీల్దార్లు, ఆర్డీఓలు గ్రీవెన్స్ డే నిర్వహించే వారు. ఇప్పుడా అవకాశం లేదు. భూ సంబంధ సమస్యలు పరిష్కరించాలని వచ్చే దరఖాస్తులను స్వీకరించే అధికారం వారికి లేదు.

ప్రతి సమస్య సీఎస్ వరకు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎవరికైనా, ఎలాంటి సందేహం కలిగినా జిల్లా కలెక్టర్ల దగ్గరికి వెళ్లాలని స్పష్టమైంది. వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 18న సూచించారు. అయితే వాటిని కూడా కలెక్టర్లు స్వయంగా పరిష్కరించే అవకాశం లేదు. సీఎస్ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగానే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ సమస్యను పరిష్కరించండంటూ వెళ్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు వెళ్లాల్సిందే. కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకున్నా ఆయన వాటిని సీఎస్ దృష్టికి తీసుకెళ్లాల్సిందన్న మాట..

ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో ఓ ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్న భూముల్లో సరిహద్దు వివాదం నెలకొన్నా అక్కడి కలెక్టర్ ఆ సమస్యకు సీఎస్ నుంచి మార్గదర్శకాలు జారీ చేసే వరకు వేచి చూడాల్సిందే. ఇదంతా పూర్తయ్యేందుకు ఎంత కాలం పడుతుందో ఉన్నతాధికారులే చెప్పాలి. ఒక వేళ సదరు సమస్యను కోర్టులోనే తేల్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తే ఆ రెండు పక్షాలకు పరిష్కారం ఎంత కాలానికి లభిస్తుందో అంచనా వేయొచ్చునని ఓ రిటైర్డ్ ఆర్డీఓ అన్నారు. పరిపాలన పరంగా చిన్న జిల్లాలను ఏర్పాటు చేసినా సామాన్యులు చిన్నపాటి సమస్యను పరిష్కరించుకునేందుకు కలెక్టరేట్లకు వెళ్లే స్థాయి ఉండదని ఉన్నతాధికారులు, పాలకులు గుర్తించడం లేదని విమర్శించారు. పైగా ఒక్కసారి దరఖాస్తు పెట్టుకుంటే పరిష్కరించే కలెక్టర్లు కూడా లేరు. తనకు న్యాయం చేయండంటూ ఎన్నిసార్లు తిరగాలన్నది ఆ జిల్లా కలెక్టర్ల వ్యవహారశైలి మీద ఆధారపడి ఉంటుందన్నారు.

వీఆర్వోతో అయ్యేది..

2017 కంటే ముందు ఏ భూ సమస్య తలెత్తినా ఆ గ్రామ రెవెన్యూ అధికారికే మొర పెట్టుకునే వారు. కాదంటే తహసీల్దార్ వరకు వెళ్లే వారు.. ఊరికో వీఆర్వో ఉన్నప్పుడే భూ సమస్యల పరిష్కారానికి ఏండ్లకేండ్లు పట్టేదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కొన్ని ప్రాంతాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. కానీ ఇప్పటి దాకా ఒక్క భూమి లావాదేవీపైన 33 మంది జిల్లా కలెక్టర్లు, 33 మంది జాయింట్ కలెక్టర్లు(అదనపు కలెక్టర్లు), 73 మంది అర్డీఓలు, 1065 మంది తహసీల్దార్లు, 7039 మంది వీఆర్వోలు, 24 వేల మంది వీఆర్‌ఏలు పని చేసేవారు. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల బిల్లు-2020(ఆర్వోఆర్ చట్టం)’ చట్టంతో రూపురేఖలు మారిపోయాయి. 32 వేల మంది రెవెన్యూ యంత్రాంగం చేసే కార్యకలాపాలన్నీ 33 మంది కలెక్టర్లు మాత్రమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గదర్శకాల ప్రకారం చేయాలి. వేలాది మంది ఈ ప్రక్రియలో నిమగ్నమైనప్పుడే పనిలో వేగం లేదన్న విమర్శలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరాయని ఓ వ్యవస్థనే లేకుండా చేసింది. మరిప్పుడీ సరికొత్త సాంకేతిక విప్లవం, సీఎం దిశానిర్దేశం ద్వారా ఏ స్థాయి పారదర్శకత ఉంటుందో వేచి చూడాలి.

అన్నింటికీ కోర్టుకే

మండల స్థాయిలో తహసీల్దార్ తీసుకున్న నిర్ణయం ద్వారా అన్యాయానికి గురైన వారు డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కూడా అన్యాయమే జరిగిందని భావిస్తే జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. పై రెండు స్థాయిల్లో విచారణ చేసి న్యాయం జరిగేటట్లు అవకాశం ఉండేవి. ఇప్పుడేమో తహసీల్దార్ తీసుకునే నిర్ణయం ఫైనల్. అన్యాయం జరిగిందని అనిపిస్తే కోర్టుకు వెళ్లాల్సిందే. మరో మార్గం.. ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. వారేమో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలి. పేద రైతులకు ధరణి పోర్టల్ అమలు తర్వాత ఈ రెండు మార్గాలే కనిపిస్తున్నాయని రెవెన్యూ చట్టాల నిపుణులు వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed