కరోనాకు మందు.. డెక్సామెథాసోన్?

by sudharani |
కరోనాకు మందు.. డెక్సామెథాసోన్?
X

నోవెల్ కరోనా వైరస్‌ను తగ్గించే ప్రయత్నంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఓ వైపు కొత్త మందు కనిపెట్టడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపు అందుబాటులో ఉన్న మందులను పేషెంట్ల మీద పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాక్సీక్లోరోక్విన్, రెమెడెసివర్ వంటి మందులు తెర పైకొచ్చాయి. ఇప్పుడు కొత్తగా ‘డెక్సామెథాసోన్’ అనే మందు కొవిడ్ కారణంగా తీవ్రంగా బాధపడుతున్న పేషెంట్లలో మరణాల రేటును తగ్గిస్తోందని ఇంగ్లండ్ వైద్యుల పరిశోధనలో తేలింది. రాండమైజ్డ్ ఎవల్యూషన్ ఆఫ్ కొవిడ్ 19 థెరపీ (రికవరీ)లో భాగంగా తక్కువ డోస్ డెక్సామెథాసోన్ వాడి స్టెరాయిడ్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. నోటి ద్వారా లేదా ఐవీ ద్వారా ఈ మందును ఇవ్వొచ్చు. ఇది ఇచ్చిన 28 రోజుల తర్వాత బ్రీథింగ్ మెషిన్లు అవసరమైన పేషెంట్లలో 35 శాతం, సప్లిమెంటల్ ఆక్సిజన్ అవసరమైన వారిలో 25 శాతం మరణాలు తగ్గినట్లు తెలిసింది. అయితే ఈ మందు వ్యాధి తీవ్రత తక్కువ స్థాయిలో గల వారిలో పనిచేయలేదని, కేవలం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవారిలో సమర్థంగా పనిచేసిందని వైద్యులు చెబుతున్నారు.

డెక్సామెథాసోన్ అంటే?

చాలా తక్కువ ధరకు, విరివిగా దొరికే ఈ మందుతో ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం దొరికిందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ పీటర్ హోర్బీ అంటున్నారు. సాధారణంగా మంటను తగ్గించడానికి ఉపయోగించే స్టెరాయిడ్ డ్రగ్ ఇది. ఎన్‌హెచ్ఎస్ ప్రకారం ఈ మందును ఎలర్జీలు, ఆస్తమా, ఎగ్జిమా, ఆర్థరైటిస్ వంటి రోగాల్లో మంటను, దురదను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కొవిడ్ 19 విషయంలో సర్వైవల్ రేటును పెంచిన మొదటి డ్రగ్‌గా ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది.

రికవరీ ట్రయల్‌లో భాగంగా 2104 మంది పేషెంట్ల మీద రోజుకు ఒకసారి 6 ఎంజీ చొప్పున పది రోజుల పాటు ప్రయోగించారు. ప్రతి 8 మంది వెంటిలేటర్లు అవసరమైన పేషెంట్లలో ఒకరిని ఈ డ్రగ్ ప్రాణాల మీదకు రాకుండా కాపాడిందని, అలాగే ఆక్సిజన్ అవసరమైన ప్రతి 25 మంది పేషెంట్లలో ఒకరిని ఈ డ్రగ్ కాపాడినట్లు ఫలితాల్లో తేలింది. మొత్తంగా మరణాల రేటును 28 రోజులకు తగ్గించి, 17 శాతానికి పడిపోయేలా చేసిందని వెల్లడైంది. ఈ రికవరీ ట్రయల్‌లో డెక్సామెథాసోన్‌తో పాటు హెచ్‌ఐవీ డ్రగ్ లోపినవిర్ రిటోనవీర్, యాంటీ బయాటిక్ అజిత్రోమైసిన్, టోసిలిజుమబ్ మందులను కూడా పరీక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed