శ్రీ కృష్ణుడు పాండవులతో కలిసి పూజలు చేసిన ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు..

by Sumithra |
శ్రీ కృష్ణుడు పాండవులతో కలిసి పూజలు చేసిన ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు..
X

దిశ, ఫీచర్స్ : కాలికా దేవి దేవాలయం దేశంలోనే ఎంతో ప్రసిద్ది చెందిన దేవాలయాలలో ఒకటి. దక్షిణ ఢిల్లీలో ఉన్న ఈ ఆలయం ఆరావళి పర్వత శ్రేణిలోని సూర్యకుట్ పర్వతం పై ఉంది. ఇక్కడ కాలికా దేవి కొలువై ఉంటుంది. కాలికా దేవి ఆలయాన్ని సిద్ధపీఠాలలో ఒకటిగా చెబుతారు. నవరాత్రుల సమయంలో ఒకటి నుండి ఒకటిన్నర లక్షల మంది భక్తులు దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ పీఠం రూపురేఖలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయని, ఇక్కడే దుర్గామాత మహంకాళి రూపంలో దర్శనమిచ్చి రాక్షసులను సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఈ ఆలయం 3000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెబుతారు. ఇంతటి పురాణమైన కాలికాదేవి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలయ చరిత్ర..

లోటస్ టెంపుల్ సమీపంలో నిర్మించిన ఈ ఆలయం శక్తి లేదా దుర్గాదేవి అవతారమైన కాలికా దేవికి అంకితం చేశారు. ఈ ప్రదేశంలోనే ఆదిశక్తి, మహాకాళి రూపంలో కనిపించి రాక్షసులను సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని బాబా బాలకనాథ్ నిర్మించారు. ఈ ఆలయంలోని పాత భాగాన్ని 1764లో మరాఠాలు నిర్మించారని నమ్ముతారు. తరువాత 1816లో అక్బర్ II పున:నిర్మించారని చరిత్ర చెబుతుంది.

శ్రీ కృష్ణుడు పాండవులతో కలిసి పూజలు చేసిన స్థలం..

20వ శతాబ్దంలో ఢిల్లీలో నివసిస్తున్న హిందూ మతం అనుచరులు, వ్యాపారవేత్తలు ఈ ప్రదేశంలో అనేక దేవాలయాలు, ధర్మశాలలను నిర్మించారు. ఆ సమయంలోనే ఈ ఆలయ ప్రస్తుత రూపం నిర్మించారు. మహాభారత కాలంలో యుద్ధానికి ముందు, శ్రీ కృష్ణుడు పాండవులతో కలిసి ఇక్కడ భగవతీ దేవిని పూజించాడని నమ్ముతారు. తర్వాత బాబా బాలక్‌నాథ్ ఈ పర్వతం పై తపస్సు చేశారని చెబుతారు. అప్పుడు ఆయనకు భగవతి మాత దర్శనమిచ్చారని నమ్ముతారు.

300 సంవత్సరాల నాటి చారిత్రక హవన్ కుండ్

ఈ ఆలయాన్ని పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. ఆలయంలోని మధ్య గది పూర్తిగా పాలరాతితో నిర్మించారు. ఆలయంలో కాళీదేవి రాతి విగ్రహం కూడా ఉంది. ప్రధాన ఆలయానికి 12 ద్వారాలు ఉన్నాయి. ఇది 12 నెలలను సూచిస్తుంది. ప్రతి ద్వారం దగ్గర అమ్మవారి వివిధ రూపాలు చిత్రించారు. గ్రహణం సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు మూసివేసినా కాలికా దేవి ఆలయం మాత్రం తెరిచి ఉంటుంది. అక్బర్ II ఈ ఆలయంలో 84 గంటలను స్థాపించారు. ప్రస్తుతం ఈ గంటలలో కొన్ని ఇప్పుడు లేవు. ఈ గంటల ప్రత్యేకత ఏంటంటే ఒక్కో గంట శబ్దం ఒక్కోలా ఉంటుంది. ఇది కాకుండా ఈ ఆలయంలో 300 సంవత్సరాల నాటి చారిత్రక హవన్ కుండ్ కూడా ఉంది.

రోజుకు రెండుసార్లు అమ్మవారి అలంకరణ..

అమ్మవారి అలంకరణను రోజుకు రెండుసార్లు మారుస్తారు. ఉదయం అమ్మవారిని పుష్పాలు, వస్త్రాలు తదితరాలతో పాటు 16 అలంకారాలతో అలంకరిస్తారు. ఇక సాయంత్రం ఆభరణాలు, వస్త్రాలతో అలంకరిస్తారు. అమ్మవారి వేషధారణతో పాటు ఆభరణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని ప్రతిరోజూ 150 కిలోల పూలతో అలంకరిస్తారు. ఆలయ అలంకరణలో ఉపయోగించే పుష్పాలను మరుసటి రోజు భక్తులకు ప్రసాదంతో పాటు పంపిణీ చేస్తారు.

Advertisement

Next Story