Ramayanam: సీతమ్మ తల్లి లంకలో ఉన్న సంగతి హనుమంతుడికి ఎలా తెలిసిందంటే?

by D.Reddy |
Ramayanam: సీతమ్మ తల్లి లంకలో ఉన్న సంగతి హనుమంతుడికి ఎలా తెలిసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రామాయణం అనగానే మనకు ముందుగా.. సీతారాముల వనవాసం, బంగారు లేడీ, సీతమ్మ తల్లిని రావణసుడు ఎత్తుకెళ్లటం, లంకలోని అశోక వనంలో దాచటం, రాముడు వానర సైన్యం సాయంతో రావణసుడిని చంపి, సీతా దేవిని తిరిగి తీసుకురావటం వంటివి గుర్తొస్తాయి. అయితే, సీతాన్వేషణలో ఉన్న రాముడికి ఆంజనేయుడు వచ్చి చెప్పే వరకు సీతా దేవి ఎక్కడుందో తెలియదు. మరీ ఆంజనేయుడికి సీతమ్మ జాడ ఎలా తెలిసింది? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాముడు-సుగ్రీవుడి స్నేహం

బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడిని అంతం చేసిన తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలలోని కుటీరం వద్దకు వచ్చారు. అక్కడ సీతా దేవి కనిపించలేదు. అసలేం జరిగి ఉంటుంది? సీతా దేవి ఎక్కడి వెళ్లింది? ఎవరు తీసుకెళ్లారు? అనే ప్రశ్నలతోనే సీతాన్వేషణ ప్రారంభించారు. అలా సీతాదేవి జాడ వెతుక్కుంటూ.. రామలక్ష్మణులు రుష్యమూక పర్వతం వైపు వెళ్లారు. అక్కడ సుగ్రీవుడు, అతని వానర సైన్యం రాముడికి పరిచయం అయ్యారు. తాను దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడినని.. సీతా దేవి జాడ కోసం వెతుక్కుంటూ వచ్చామని జరిగింది సుగ్రీవుడికి వివరిస్తాడు రాముడు. సుగ్రీవుడు కూడా తన అన్న వాలితో ఉన్న వైరం గురించి రాముడికి చెబుతాడు. అలా వారి మధ్య మైత్రి కుదిరి సీతాన్వేషణలో సాయం చేస్తాడు.

ఈ నేపథ్యంలోనే వేలాదిగా ఉన్న తన వానర సైన్యానికి సీతాన్వేషణ ఎలా సాగించాలో సూచించాడు. నాలుగు దిక్కులలో ఏ వైపు వెళ్తే ఏ ప్రాంతం వస్తుందో? ఎక్కడెక్కడ ఎలాంటి కొండలు, గుట్టలు, మైదానాలు ఉన్నాయి, ఎక్కడ సముద్రం, నదులు, చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి అడ్డంకులు ఉంటాయి, ఎలాంటి విశేషాలున్నాయనేవి పొల్లు పోకుండా అన్నీ వివరించాడు. అది విన్న శ్రీరాముడు ఆశ్చర్యానికి గురై.. ఈ భూమండలం గురించి ఇంత జ్ఞానం ఎలా సంపాదించావని అడుగుతాడు. తాను చెప్పిన వివరాలన్నీ ఊహించి చెప్పినవి కావని, ఆ ప్రాంతాలన్నీ తాను గతంలో తిరిగినట్టు సుగ్రీవుడు రాముడికి చెబుతాడు.

తన అన్న వాలి సుగ్రీవుడిని కిష్కింద నుంచి బహిష్కరించడమే కాకుండా, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నిలువనీడ లేకుండా చేస్తుండేవాడు. అలా ఒక చోటి నుంచి మరొక చోటికి మారుతూ తాను ఈ ప్రదేశాలన్నిటినీ చూశానని సుగ్రీవుడు చెబుతాడు. చివరకు రుష్యమూక పర్వతం వద్ద జీవిస్తున్నట్టు చెప్పాడు. వాలికి మాతంగ మహాముని శాపం కారణంగా రుష్యమూక పర్వతంపైకి రాలేడని, దాంతో తాను ఇక్కడే స్థిరపడినట్టు రామయ్యకు తెలిపాడు. అలా తనకు అన్ని ప్రదేశాలపైనా పట్టు ఉందని, అది ఇలా సీతాన్వేషణలో ఉపయోగపడుతోందని అన్నాడు.

లంకకు చేరుకున్న ఆంజనేయుడు

ఇక ఆయా దిక్కుల వివరాలను వానర ప్రముఖులకు స్పష్టంగా చెప్పి, తలో దిక్కుకు సైన్యాన్ని ఇచ్చి పంపించాడు సుగ్రీవుడు. అలా దక్షిణ దిశగా వెళ్లిన హనుమంతుడు సముద్ర తీరం వరకూ వెతికినా సీత జాడ తెలియలేదు. 'చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు' కనుక ఆంజనేయస్వామి ఎగిరి వెళ్లి సముద్రాన్ని కూడా దాటి లంకను చేరుకున్నాడు. అక్కడ అశోక వనంలో ఉన్న సీతమ్మను చూసి, తిరిగి వచ్చి ఆ సమాచారాన్ని శ్రీరాముడికి తెలిపాడు. అలా రాముడికి సీతా జాడ ఆంజనేయస్వామి తెలియజేశాడు.

Next Story

Most Viewed