సమ్మక్క-సారక్కలకు సమర్పించే బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

by Hamsa |   ( Updated:2024-02-13 09:13:59.0  )
సమ్మక్క-సారక్కలకు సమర్పించే బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: ఆసియాలోనే అతిపెద్ద రెండో జాతరగా చెప్పుకునే మేడారంలో అసలైన సంబురాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మహా జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. అప్పుడే సమ్మక్క సారక్క అమ్మవార్లు ఎంతో ఘనంగా గద్దెలపైకి వస్తారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా పండ్లు, రకరకాల ప్రసాదాలు, పానియాలను తయారు చేసుకుని తీసుకెళ్లి దేవుడికి సమర్పిస్తారు. కానీ సమ్మక్క-సారక్కలకు మాత్రం బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రసాదాన్ని బెల్లం అనకుండా బంగారం అని పిలుస్తుంటారు. మేడారం వెళ్లి వచ్చాక ఈ బంగారాన్ని ఊరంతా పంచుతారు. అంతేకాకుండా కొంత మంది భక్తులు బెల్లం అని పిలిస్తే మంచి జరగదని కూడా అంటుంటారు. అయితే ఈ బెల్లం బంగారంగా ఎందుకు భావిస్తారు? ఇంతకీ మేడారం జాతరలో బెల్లం ఎందుకంత ప్రత్యేకం? ఇది బంగారమెందుకైంది? అనడానికి ఓ కారణం ఉందని పూర్వికులు చెబుతున్నారు.

బెల్లం బంగారంగా మారడానికి వెనుక కొన్ని తరాల నుంచి ఓ కథ వినిపిస్తుంది. పూర్వ కాలంలో మేడారం జాతరను కేవలం అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీలు మాత్రమే జరుపుకునే వారట. పైగా అప్పటిలో వారి ఆచారాలు కూడా కాస్త భిన్నంగా ఉండేవట. బెల్లం, ఉప్పును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారట. కాగా, వారు బెల్లానికి ఎక్కువ విలువను ఇవ్వడంతో పాటు.. ఖరీదైనదిగా భావించేవారట. అప్పట్లో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి రాకపోవడంతో సమ్మక్క, సారలమ్మకు బెల్లాన్ని సమర్పించే వారట.

ఈ క్రమంలోనే బెల్లాన్ని బంగారంగా పిలుచేవారని చాలామంది చెబుతుంటారు. అందుకే ఇక అప్పటి నుంచి భక్తులంతా తాము కోరుకున్న కోరికలు నెరవేరితే (బెల్లం) బంగారాన్ని సమర్పిస్తూ వస్తున్నారు. ఈ మేడారం జాతరకు ఉత్తర భారతదేశం నుంచి ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వెళ్లి అక్కడే అడవిలో ఉండి మరీ వంటలు చేసుకుని అమ్మవార్లకు బంగారంను సమర్పించి వస్తుంటారు. అయితే సాధారణంగా చికెన్, మటన్ తిని పూజలు చేయడం పాపం అని కొందరు అంటుంటారు. కానీ మేడారంలో మాత్రం నాన్ వెజ్ తినే సమక్క-సారక్కలను పూజించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed