రాముడు లేకుండా సీతాదేవి మాత్రమే దర్శనం ఇచ్చే ఆలయం అదొక్కటే..

by Sumithra |
రాముడు లేకుండా సీతాదేవి మాత్రమే దర్శనం ఇచ్చే ఆలయం అదొక్కటే..
X

దిశ, వెబ్‌డెస్క్: రామాయణం గురించి తెలియని వారు ఉండదు. సీతారాములు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం... శ్రీరాముని పట్టాభిషేకం తరువాత చాకలి మాటలకు రాముడు సీతను అడవులకు పంపడం, అక్కడ సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశులకు జన్మనివ్వడం, అశ్వమేధయాగ సమయంలో గుర్రాన్ని బంధించిన లవకుశులతో రామలక్ష్మణులు యుద్ధం చేయడం ఇవన్నీ అందరికీ తెలిసిందే.. కానీ ఇవన్నీ జరిగిన ప్రదేశం ఎక్కడ ఉంది. రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎక్కడ రచించారు, ఆ స్థలపురాణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మరి అంతటి చరిత్ర ఉన్న స్థలపురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆది కవిగాను సుప్రసిద్ధం. మన భారత దేశంలో సీతారాములు వెలసిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఒక క్షేత్రమే అవని క్షేత్రం. భారతదేశంలోని సీతాదేవికి అంకితం చేసిన కొన్ని దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ క్షేత్రంలో శ్రీరాముడు లేకుండా సీతాదేవి మాత్రమే దర్శనం ఇస్తుంది. ఎన్నో పుణ్యదేవాలయాలకు నెలవు అవని క్షేత్రం. ఈ ప్రాంతంలో రామలింగేశ్వర, లక్ష్మణేశ్వర, భరతేశ్వర, శత్రుఘ్నేశ్వర పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలని నోళంబ రాజవంశం కాలంలో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఇంత ప్రఖ్యాతి గాంచిన క్షేత్రం బెంగళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, ముల్‌బాగల్‌ తాలూకాలోని ఉంది.

రామాయణ ఇతిహాసాన్ని రచించిన వాల్మీకి మహర్షి రామాయణ కాలంలో ఇక్కడ నివసించాడని పురాణాలు చెబుతున్నాయి. సీతాదేవి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అవని ప్రాంతంలోని ముని ఆశ్రమంలో నివసించిందని చరిత్ర చెబుతుంది. సీతాదేవి ఇక్కడే లవకుశులకు జన్మనిచ్చిందట. నేటికీ సీత తన పిల్లలకు జన్మనిచ్చిన గది అలాగే ఉందని చెబుతారు. శ్రీరాముడు, అతని కుమారులు లవకుశల మధ్య యుద్ధం జరిగింది కూడా ఈ ప్రాంతంలోనే అంటారు.

లవకుశలతో యుద్ధం జరిగిన తరువాత తాము చేసింది తప్పుగా భావించిన రామసహోదరులు తమ తప్పుకు ప్రాయశ్చిత్త మార్గం చెప్పాలని వాల్మీకి మహర్షిని ప్రార్ధించారట. అప్పుడు అక్కడ నలుగురూ శివలింగ ప్రతిష్ట చెయ్యాలని ఆయన సూచించారని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, సుగ్రీవ, విభీషణులు అందరూ అక్కడ శివలింగాలు ప్రతిష్టించారని స్థలపురాణం చెబుతోంది.

ఇదే గుడి ఆవరణలో 100 శివ లింగాలు ప్రతిష్టితమయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రదేశానికి విచ్చేసిన ఆది శంకరులు కూడా మరొకటి ప్రతిష్టించి 101 లింగాలు పూర్తిచేశారని అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశంలో చోళులు గుడి కట్టారని చరిత్ర చెబుతోంది. ఈ ప్రదేశానికి పంచ పాండవులు ఒకసారి వచ్చి వారు కూడా శివలింగాలు ప్రతిష్టించారట. దీనికి దగ్గరలోనే కైవార (ఏకవీరపురం)లోనే బకాసుర సంహారం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ప్రాంతంలోనే సీతమ్మ పార్వతీదేవిని పూజించేదని, ఇక్కడ అమ్మవారిని సీతాపార్వతీ మాత అని కూడా పిలుస్తారట. అవని కొండపైన పార్వతీదేవి సాలగ్రామ విగ్రహం కూడా ఉంటుందట. అలాగే సీతమ్మ దప్పిక తీర్చేందుకు లక్ష్మణుడు ఈ ప్రదేశంలో భూమిలోకి బాణం వేశాడని, అక్కడ బాణాకారంలో ఒక మడుగు ఏర్పడింది అని, ఆ మడుగులోని నీరు మండుటెండల్లో కూడా ఇంకిపోదని ప్రతీతి.

ఈ ఆలయాన్ని చాలా మంది పిల్లలు లేని దంపతులు కూడా సందర్శిస్తారు. సంతానం లేని స్త్రీలు లక్ష్మణ తీర్థంలో స్నానం చేసి, తడి బట్టలతో కొబ్బరికాయ, పూజా సామగ్రితో ఆలయానికి వెళితే వారి కోరికలు తీరుతాయని ప్రతీతి. సంతానం కోసం ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు రాత్రి పూట అక్కడే నిద్రిస్తే దేవతలు వారి కలలో వచ్చి కోరికలు నెరవేరడానికి అనుగ్రహస్తారని అక్కడి భక్తుల నమ్మకం.

Advertisement

Next Story

Most Viewed