- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘దేవాదుల’ వరంగల్‌కే అంకితం
దిశ, తెలంగాణ బ్యూరో : దేవాదుల ప్రాజెక్టును నూటికి నూరుశాతం వరంగల్ జిల్లాకే అంకిత చేస్తామని సీఎం కేసీఆర్ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని వివిధ జిల్లాలకు ఇతర ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవనం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టు దాకా నీటికొరత లేకుండా చేశామని, హుస్నాబాద్, పాత మెదక్, ఆలేరు, భువనగిరి, జనగామలకు మల్లన్నసాగర్ వరంలా మారుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, ఆయా జిల్లాల్లోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటినందించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు.
కృష్ణాబేసిన్‌లో ప్రభుత్వం ఇటీవల నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతి, వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మతులు, వాటి పరిస్థితి, తదితర సాగునీటి అంశాలపై మంగళవారం సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలిచ్చారు. ఇరిగేషన్ శాఖలో ఒక్కరోజు కూడా ఏ పోస్టు కూడా ఖాళీగా వుండరాదని, అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ఇరిగేషన్ శాఖకున్న ప్రత్యేకావసరాల దృష్ట్యా నియామక ప్రక్రియను బోర్డు ద్వారా స్వంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. అన్ని స్థాయిల్లో ఖాళీల నివేదికను తక్షణమే అందించాలని ఈఎన్సీని ఆదేశించారు. ఇక కాల్వల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.
ఓఅండ్ఎం పనులకు రూ. 700 కోట్లు
కాల్వల మరమ్మత్తులు, ఇతర అవసరాల కోసం ఇరిగేషన్ అధికారుల వద్ద రూ. 700 కోట్లు కేటాయించామని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాల్వల ప్రాజెక్టుల మెంటనెన్స్ కోసం కనీసం కోటి రూపాయలను కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. రానున్న సీజన్ కూడా గేట్ల మరమ్మతులు, కాల్వల మరమ్మతులు పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలని, ప్రాజెక్టుల నిర్మాణం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నిధులను ఆర్థిక శాఖ నుంచి విడుదల చేసి, నీటిపారుదలశాఖ కార్యదర్శి అధీనంలో బడ్జెట్ అందుబాటులో ఉంచుతామన్నారు. కాళేశ్వరంలో కింద చివరి ఆయకట్టు దాకా ఆటంకం లేకుండా నీరు ప్రవహించి పొలాలకు వెళ్లాలని, దీనికి సర్వం సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇటీవల నాగార్జున సాగర్ సెగ్మెంట్లో శంఖుస్థాపన చేసిన నెలికల్లు లిప్టుకు 24 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్ద్యం ఉందని, దీని ఆయకట్టుకు పెంచి కొత్త టెండర్లు పిలువాలని, వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా సదర్ మాట్ బ్యారేజీ నిర్మాణం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని, సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో సాంకేతిక బృందాన్ని పంపి బ్యారేజీ నిర్వహణకు సంబంధించి ఇంజనీర్లకు ట్రెయినింగ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మేజర్ లిఫ్టులు, పంపులు వున్న దగ్గర స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టి, తక్షణమే పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ల క్యాంపుల కోసం భూసేకరణ నిలిపివేయాలని, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం మూడో పంప్ హౌజ్ పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు.
వచ్చేనెల 15 వరకు ఎస్టిమేట్స్
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీనికోసం ఇరిగేషన్ అధికారులతో మంత్రి జగదీష్‌రెడ్డి సమన్వయం చేసుకోవాలని, నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలన్నారు.
చెరువులన్నీ నింపాలి
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఈ వానాకాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా వున్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండివుండడంతో భుగర్భ జలాలు పెరిగాయని తద్వారా బోర్లల్లో నీరు పుష్కలంగా లభిస్తున్ననేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారన్నారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందనీ, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు వుంటారనీ, కాబట్టీ వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలన్నారు.
వేల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నామని, వాటిని వ్యూహాత్మకంగా రైతు సంక్షేమానికి వినియోగించే విధానాలను అవలంబించాలన్నారు. ప్రాణహితలో నీటి లభ్యతను అది ప్రవహించే తీరును అర్థం చేసుకోవాలని, ప్రాణహిత ప్రవాహం జూన్ 20 తర్వాత ఉధృతంగా మారుతుందని, అప్పడు వచ్చిన నీరును వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం రాడార్లో వున్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపాలన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో కాల్వల మరమ్మతులు కొద్దిపాటి కొరవలు మిగిలి ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేసుకొని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టాలన్నారు. నాలుగు వేల కోట్లు పెట్టి నిర్మిస్తున్న చెక్ డ్యాంలు నీటి నిల్వను చేస్తూ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని, 50 వేల చెరువులను నిరంతరం నిండుకుండల్లా నీటిని నిల్వవుంచుకోవాలని, జూన్ 30 వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి చేయాలన్నారు. మొదటి దశ కరోనా కష్టకాలంలో రైతు పండించిన పంట ద్వారా 17శాతం ఆదాయం అందించి రాష్ట్ర జీఎస్డీపీలో రాష్ట్ర వ్యవసాయం భాగస్వామ్యం పంచుకుందని, రాష్ట్ర రెవెన్యూకు తెలంగాణ వ్యవసాయం వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితికి వచ్చిందని సీఎం వివరించారు.
రాష్ట్రంలో వ్యవసాయ ముఖచిత్రం మారిందని, ధాన్యం దిగుబడిలో పంజాబ్ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరిస్తున్నామని, ఉమ్మడి పాలనలో రైతులు రూ. 50 వేల కోట్ల సొంత ఖర్చుతో 30 లక్షల బోర్లు వేసుకున్నారని, భార్యల మెడలమీది పుస్తెలమ్మి వ్యవసాయం చేసిన దీన స్థితి ఉండేదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఒక్క టీఎంసీ కూడా దిక్కు లేదని, కానీ ఇప్పుడు గోదావరీ నదీ గర్భంలోనే 100టీఎంసీలను నిల్వచేసుకునే స్థాయికి చేరుకున్నామన్నారు.
రాష్ట్రంలో తాగునీటికి లోటురాకుండా చూసుకుంటూ రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజర్వాయర్లలో ఎండీడీఎల్ ఉండేలా చూడాలన్నారు.
ప్రాజెక్టుల పరిస్థితులపై ఆరా
మహబూబ్‌నగర్ జిల్లా సంగమేశ్వర లిఫ్టు, బసవేశ్వర లిఫ్టు పనుల పురోగతిని సీఎం సమీక్షలో అడిగి తెలుసుకున్నారు. వీటికి వెంటనే డీపీఆర్‌లు తయారు చేయాలన్నారు. అయితే ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వివరించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు పంటలతో సస్యశ్యామలమవుతుందని, వచ్చే ఏడాది జూన్ నాటికి సీతమ్మ సాగర్ నిర్మాణం పూర్తిచేయాలని, ఏమైనా సమస్యలు వస్తే ఎప్పటికప్పుడు స్మితా సభర్వాల్, శ్రీధర్ దేశ్‌పాండే దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దృఢసంకల్పంతో ఉన్నామని, కరోనా నేపథ్యంలో కలిగే అసౌకర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అధిగమిస్తామని, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులను సమకూరుస్తామని సీఎం వెల్లడించారు. ఇంజినీరింగ్ అధికారులు పనివిధానాన్ని మార్చుకోవాలని, ఓఅండ్ఎం పై జూన్ మొదటి వారంలో ఇంజనీర్ల వర్క్ షాప్ నిర్వహించాలని, ఇంజనీరింగ్ పనుల ప్రతిపాదనలను రూపొందించే ముందే జాగ్రత్తగా ఎస్టిమేషన్లు రూపొందించాలని సీఎం సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు యాదగిరి రెడ్డి, హన్మంత్ షిండే, సైదిరెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఈఎన్సీలు హరిరామ్, వెంకటేశ్వర్లు, సలహాదారు పెంటారెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.