డిగ్రీ, పీజీ పరీక్షలు ఇప్పట్లో నిర్వహించరా..?

by Shyam |   ( Updated:2020-04-17 07:09:05.0  )
డిగ్రీ, పీజీ పరీక్షలు ఇప్పట్లో నిర్వహించరా..?
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కారణంగా దేశమంతా ‘లాక్‌డౌన్’లో మునిగిపోయింది. విద్యాసంస్థలు, హాస్టళ్ళు మూతపడ్డాయి. సిలబస్ పూర్తికాలేదు. డిగ్రీ, పీజీ పరీక్షలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాతనైనా పరీక్షలు జరుగుతాయా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ పరీక్షల సంగతి తేలితే ఉన్నత చదువుల కోసం ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కావడంపై విద్యార్థులు దృష్టి పెట్టనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు రాష్ట్రాల పరిధిలో ఉన్నందున ప్రభుత్వాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ డిగ్రీ, పీజీ పరీక్షలు మాత్రం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో ఉన్నందున దేశం మొత్తానికి వర్తించే విధంగా నిర్ణయం జరగాల్సి ఉంది. ఈ నిర్ణయం జరగడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూజీసీ ప్రతిపాదనలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలపడం, ఆ తర్వాత ప్రధాని అధ్యక్షతన జరిగే మంత్రివర్గం విధానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

విద్యాసంస్థలు సెలవుల అనంతరం తిరిగి తెరుచుకున్న తర్వాతనే పరీక్షలను నిర్వహించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం క్యాలెండర్‌లో కూడా చాలా మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. లాక్‌డౌన్ ముగిసినా ‘సామాజిక దూరం’ మరికొంత కాలం కొనసాగుతుంది కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థ పునరుద్ధరించబడడం, కాలేజీల్లో పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి రావడం, వైరస్ వ్యాప్తి నివారణకు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉండడం… వీటన్నింటి నేపథ్యంలో ఈసారి పరీక్షల నిర్వహణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే ‘ఆన్‌లైన్’లో పరీక్షలు నిర్వహించవచ్చనే ప్రతిపాదనలు వచ్చినా యూజీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విధానంలో పరీక్షలు నిర్వహించడంలో అనేక సవాళ్ళు ఉన్నందున ఆ విధానం వద్దనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్ ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేక అటు యూజీసీ, ఇటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ గందరగోళంలో పడ్డాయి.

ఈ గందరగోళానికి పరిష్కారం కనుగొనడానికి యూజీసీ రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసింది. హర్యానా యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ ఆర్‌సి కుహద్ నేతృత్వంలోని ఏడుగు సభ్యులతో కూడిన కమిటీ పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలండర్ కూర్పుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. మరో కమిటీ ‘ఆన్‌లైన్’ లెర్నింగ్ (బోధన)పై అధ్యయనం చేస్తుంది. ”విద్యార్థులు పరీక్షలు ఎలా జరుగుతాయోననే గందరగోళంలో ఉన్నారు. ఉన్నత చదువులు ఏమవుతాయోననే ఆందోళనలో పడ్డారు. ప్రవేశ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలనే సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడు జరుగుతున్న జాప్యం భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం వేస్తుందో అనే భయంతో ఉన్నారు. వీటన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. కమిటీలు నివేదిక సమర్పించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం” అని యూజీసీ ఛైర్మన్ డీపీ సింగ్ ఇటీవల మీడియాకు తెలిపారు.

‘ఆన్‌లైన్’ పరీక్షలు అనుమానమే!

పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలండర్ రూపకల్పన కోసం అధ్యయనం చేస్తున్న కమిటీ దాదాపుగా ఒక అంచనాకు వచ్చింది. నాలుగు రోజుల క్రితమే నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ మరికొన్ని అభిప్రాయాలు రావాల్సి ఉన్నందున త్వరలోనే నివేదిక సమర్పించే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు చేసిన అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకున్న ఈ కమిటీ ‘ఆన్‌లైన్’ ద్వారా పరీక్షలను నిర్వహించడం సాధ్యంకాదనే అభిప్రాయానికి వచ్చింది. కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారుగానీ ‘ఆన్‌లైన్’ పరీక్షల నిర్వహణలో అనేక సవాళ్ళు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అందుకు కారణాలనూ ఆ కమిటీలోని ఒక సభ్యుడు సూచనప్రాయంగా వెల్లడించారు. ఒక విశ్వవిద్యాలయంలో లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి వారికి ‘ఆన్‌లైన్’ ద్వారా పరీక్షలను నిర్వహించడంలో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ బ్యాండ్‌విడ్త్, కంప్యూటర్ల లభ్యత, పరీక్షలు రాయడంలో పారదర్శకత, విద్యార్థులను పర్యవేక్షించే అవకాశం లేకపోవడం, కాపీయింగ్ లాంటివి చోటుచేసుకోకుండా పటిష్టమైన విధానాన్ని రూపొందించడంలో ఉన్న సవాళ్ళు… ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పైగా చాలా మంది విద్యార్థులు గ్రామాల్లోనే ఉన్నందున అక్కడ ‘ఆన్‌లైన్’ ద్వారా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, ఇంకా అక్కడ ఇంటర్నెట్ లాంటి అనేక మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవని ఉదహరించారు.

ఇక పరీక్షలు రాసే విద్యార్థులు కాపీ కొడుతున్నారా లేక ఇతర అవకతవకలకు పాల్పడుతున్నారా అనేదాన్ని పరిశీలించలేమన్నారు. యూనివర్శిటీల ప్రొఫెసర్లు కూడా ‘ఆన్‌లైన్’ పరీక్షా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు విద్యా బోధనలో కూడా ‘ఆన్‌లైన్’ విధానం సత్ఫలితాలు ఇవ్వదని అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రకారమే గత వారం ఢిల్లీ విశ్వవిద్యాలయం టీచర్స్ అసోసియేషన్ యూజీసీకి, హెచ్ఆర్‌డికి లేఖ రాసింది. గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేనందువల్ల పరీక్షలనుగానీ, విద్యాబోధననుగానీ ‘ఆన్‌లైన్’ ద్వారా నిర్వహించలేమని, తరగతి గదుల్లో ఉపాధ్యాయుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే రెగ్యులర్ తరగతుల తరహాలో ‘ఆన్‌లైన్’ విధానం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్ ఉండే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని ప్రస్తావించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ‘ఆన్‌లైన్’ విధానం ఏ రకంగానూ ప్రత్యామ్నాయంగా ఉండజాలదనేది స్పష్టమైంది. కమిటీ నివేదిక అనంతరం యూజీసీ దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనుంది.

తెలంగాణ విద్యార్థుల్లోనూ గందరగోళం

డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో రాష్ట్రంలోని విద్యార్థులు కూడా గందరగోళంలోనే ఉన్నారు. చాలా విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సెలర్లే లేరు. లాక్‌డౌన్ కారణంగా హాస్టళ్లు మూసేయడంతో గ్రామాలకు వెళ్ళిపోయారు. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని అయోమయంలో ఉన్నారు. రాష్ట్రంలోని మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, సాధారణ డిగ్రీ, ఫార్మసీ, లా… ఇలా అనేక కోర్సుల్లో చదివే విద్యార్థులు సుమారు 16 లక్షల మంది ఉంటారని అంచనా. రాష్ట్రంలోని సుమారు 200 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రతీ ఏటా ఇంజనీరింగ్ (బిఇ/బిటెక్) కోర్సులో లక్ష మంది విద్యార్థులు చేరుతున్నారు. నాలుగేళ్ళ కోర్సు కావడంతో నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎల్ఎల్‌బి, బిఫామ్, డిఫామ్, ఎంటెక్ లాంటి కోర్సుల్లో ప్రతీ ఏటా మరో 70 వేల మంది చేరుతున్నారు. ఈ కోర్సుల్లో చదివే విద్యార్థులంతా కలిపి సుమారు ఒకటిన్నర లక్షల మంది ఉంటారు. ఇవి కాక ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నవారు దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉంటారు. వీటిల్లో చదివే సుమారు 13 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడేనాటికి సుమారు 1500 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 600 మూతపడడంతో చివరకు 987 కళాశాలలు ఉన్నట్లు ‘దోస్త్’ కౌన్సిలింగ్ సందర్భంగా లెక్కతేలింది. ఇక మెడికల్, డెంటల్ కళాశాలలు వీటికి అదనం. వీటన్నింటిలో ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల సంఖ్య, పరీక్షలు రాసేవారి సంఖ్య పైన చెప్పుకున్న లెక్కలకు అదనం.

పై సంఖ్యకు అదనంగా మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రానికి చెందిన 16 విశ్వవిద్యాలయాలు, రెండు డీమ్డ్ వర్శిటీలు.. ఇలా మొత్తం 22 వర్శిటీల్లో చదువుతున్న పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థుల పరీక్షలు కూడా జరగాల్సి ఉంది. ఒక్క రాష్ట్రం పరిస్థితే ఇలా ఉంటే దేశవ్యాప్తంగా సుమారు 36 రాష్ట్రాల్లోని (కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుని) విశ్వవిద్యాలయాల్లో చదవుకుంటున్న కోట్లాది మందికి పరీక్షలు నిర్వహించడం ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో యూజీసీకి కత్తిమీద సామే. అటు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. ఇటు రెగ్యులర్‌గా నిర్వహిద్దామంటే లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఒకవేళ ముగిసినా ఆంక్షల నడుమనే నిర్వహించాల్సి ఉంటుంది. ఎంత జాప్యం జరిగితే అది రానున్న విద్యా సంవత్సరంపై అంత ప్రభావం పడుతుంది. మధ్యలో ఉన్నత చదువులకు అవసరమైన ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

Tags: examinations, degree colleges, post graduation, ugc, telangana, online, corona, lockdown, students

Advertisement

Next Story

Most Viewed