సీఎం ఆదేశించినా.. ‘మహా’ జాప్యం

by  |
సీఎం ఆదేశించినా.. ‘మహా’ జాప్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరానికి సమీకృత మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రకటనలకే పరిమితమైంది. హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతంలో 5 మాస్టర్ ప్లాన్లు ఉండటాన్ని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ‘ఒకే నగరం – ఒకే మాస్టర్ ప్లాన్’ ఉండాలని హెచ్ఎండీఏ అధికారులను మూడేండ్ల క్రితమే ఆదేశించారు. ప్రస్తుతం అథారిటీ విస్తరిత ప్రాంతంలో అమలవుతోన్న 5 మాస్టర్ ప్లాన్లను వెంటనే కలిపేయాలని సీఎం ఆదేశించినా అది కార్యరూపంలోకి రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన భూ కేటగిరీలను, ప్రతిపాదిత రోడ్లను పరిగణనలోకి తీసుకునే లేఅవుట్లకు, భవన నిర్మాణాలకు, పరిశ్రమలకు, వ్యాపార కేంద్రాలకు, ఏదేని అభివృద్ధికి సంబంధించిన అనుమతులను ఇటు అథారిటీగానీ, అటు ప్రభుత్వంగానీ ఇవ్వాల్సి ఉంది. ఇంత ప్రాధాన్యమున్న మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రకటనల్లోనే నానుతూ ఉండటంపై ఇటు రియల్టర్లు, అటు అధికారులు పెదవి విరుస్తున్నారు.

హెచ్ఎండీఏ పరిధిలో విడివిడిగా అమలులో ఉన్న 5 మాస్టర్ ప్లాన్లను కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు అథారిటీ మూడేండ్ల క్రితమే టెండర్లను పిలిచింది. ప్రైవేట్ కన్సల్టెన్సీని నియామకం చేసి, కొంత వరకు పనులు చేపట్టింది. అనంతరం ఆలస్యం కావడాన్ని గమనించిన ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి)కు బాధ్యతలను అప్పగించాలని అథారిటీకి సూచించింది. దీంతో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతలు ఆస్కికి వెళ్లాయి. అనంతరం సమీకృత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్-ఇఓఐ) నివేదికను రూపొందించేందుకు ప్రైవేట్ కన్సల్టెన్సీని నియామకం చేయాలని అథారిటీ టెండర్లను పిలిచింది. మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్(జడ్‌డిపి), ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్(ఎడిపి), రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఆర్‌డిపి)లను రూపొందించేందుకు కన్సల్టెన్సీని నియమించడంలో నిమగ్నమైంది. కొత్త మాస్టర్ ప్లాన్‌తో రోడ్ల ప్రతిపాదన, నీటి వనరుల గుర్తింపు, భూవినియోగ కేటగిరీ, వ్యవసాయం, అటవీ భూముల నిర్ధారణలో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి.

ఐదు మాస్టర్ ప్లాన్లు

హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతం ప్రస్తుతం 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాలు విస్తీర్ణం 7,257 చ.కి.మీ.లుగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా 5 మాస్టర్ ప్లాన్లు అమలులో ఉన్నాయి. పొడిగించిన హెచ్ఎండీఏ ప్రాంతం 5,985 చ.కి.మీ.లు. ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(ఓఆర్ఆర్ జిసిఎల్) 330 చ.కి.మీ.లు. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హుడా)432 చ.కి.మీ.లు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు అథారిటీ(హడా) 185 చ.కి.మీ.లు. సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ(సిడిఎ) 51చ.కి.మీ.లుగా ఉన్నాయి. వీటితో పాటు భువనగిరి, సంగారెడ్డిలకు ప్రత్యేకంగా ప్లాన్లు ఉన్నాయి. అయితే, ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో అమలులో ఉన్న 5 మాస్టర్ ప్లాన్లు హెచ్ఎండీఏ, హుడా, హడా, సిడిఎ, ఓఆర్ఆర్ జిసిఎల్ లను పూర్తిగా విలీనం చేసి కొత్త ప్లాన్‌ను సిద్ధం చేయాలని అథారిటీ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

దీంతో ముందుగా లీ అసోసియేట్స్ సంస్థకు బాధ్యతలను అప్పగించగా నిర్ణీత గడువు లోపల పనులు పూర్తి కాలేదు. దీంతో ఆస్కికి బాధ్యతలను అప్పగించగా ప్రస్తుతం ప్రైవేట్ కన్సల్టెన్సీని నియమించుకుని రూపకల్పన చేస్తున్నారు. వాస్తవానికి మాస్టర్ ప్లాన్ 2031 నాటికి రూపొందించబడింది. అయితే, అందులో విడివిడిగా ఉన్న మాస్టర్ ప్లాన్లను కలిపి జోనింగ్, ఏరియా, రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ లను రెడీ చేయాల్సి ఉంది. భూవినియోగ కేటగిరీలు పరిశ్రమలు, ఉత్పత్తి, అటవీ, వ్యవసాయం, వ్యాపార, ఓపెన్ స్పేస్, రెసిడెన్షియల్, సెజ్, టెర్మినల్స్, డంపింగ్ యార్డ్స్, రోడ్స్ వంటివి మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేకంగా గుర్తించాలి. వాటికి నియమ నిబంధనలను కూడా రూపొందించాల్సి ఉంది. ఆరేండ్లుగా భూవినియోగ కేటగిరీలు మార్చుతూ భారీ లేఅవుట్లకు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన వాటికి అనుమతులను హెచ్ఎండీఏ మంజూరు చేస్తోంది. ఎల్ఆర్ఎస్‌లోనూ ఎంతో భూమిని రెసిడెన్షియల్ కేటగిరీలోకి అనువదిస్తోంది. వీటిని కూడా మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచాలి.

గత మాస్టర్ ప్లాన్‌లో పొరపాట్లు

హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ -2031లో పలు పొరపాట్లు దొర్లాయి. ఇండ్లపై నుంచి, నీటి వనరుల మీదుగానే రోడ్లను ప్రతిపాదించారు. నీటి వనరులను పూర్తిస్థాయిలో గుర్తించలేదు. విలేజ్ మ్యాప్‌లు అందుబాటులో లేవు. 2857 నీటి వనరులుగా గుర్తించారు. తిరిగి సర్వే చేయడంతో అదనంగా 275 నీటి వనరులున్నట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. మాస్టర్ ప్లాన్‌లో 275 నీటి వనరులు అద‌ృశ్యమయ్యాయి. చాలా ప్రాంతాల్లో సర్వేనెంబర్లు, కొన్ని గ్రామాలు కూడా మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచలేదనేది అధికారులే వెల్లడిస్తున్నారు. అయితే, ఇప్పుడు అవన్నీ ప్లాన్‌లో పొందుపరచడంతో పాటు ప్రత్యేక నియమావళిని, మార్గనిర్దేశకాలను, ప్రతిపాదనలను సిద్ధం చేయాలి. కానీ, అది ఏళ్లు గడుస్తున్నా.. అది ఎప్పుడు పూర్తవుతుందోనని ఇటు రియల్లర్లు, అటు అధికారులు ఎదురు చూస్తున్నారు.


Next Story

Most Viewed