- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌కు రుణపడి ఉంటామంటున్నారు.. ఎందుకంటే..?
కరోనా కష్టకాలంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. వానాకాలం సాగుకు ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. నియంత్రిత సాగు విధానంలో పంటలు వేసినవారికి మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తామని సీఎం కేసీఆర్ తొలుత ప్రకటించారు. చివరకు అందరికీ అందించారు. తాము వద్దన్నా మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపినవారికీ కూడా డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులందరిలో సంతోషం వెల్లివిరుస్తోంది.
దిశ, న్యూస్ బ్యూరో: ఆరెకరాలలోపు సాగు భూమి ఉన్న రైతులందరికీ ముందుగా రైతుబంధు విడుదల చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే 54 లక్షల మంది ఖాతాల్లో రూ.6,886 కోట్ల మేర జమ అయినట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన రైతులకు కూడా తొందర్లోనే పడతాయని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఆరెకరాలలోపు ఉన్న రైతులు రాష్ట్రంలో 51,76,874 మంది ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పదెకరాలలోపు ఉన్న 4,45,822 మంది రైతులకు నగదును జమ చేశారు. మిగిలిన రైతులకు తర్వలోనే పెట్టుబడి సాయం అందనుంది. కొంతమంది రైతుల వివరాలు సరిగా తేలకపోవడం, బ్యాంకు ఖాతాలు, ఫోన్లు నెంబర్లు, ఆధార్ నెంబర్లు అనుసంధానం కాకపోవడంతో బ్యాంకుల దగ్గర ఆగిపోయాయి. వీరిలో చిన్న, సన్నకారు రైతులతో పాటుగా పెద్ద రైతులు కూడా ఉన్నట్లు సమాచారం. మరికొన్నిచోట్ల బ్యాంకుల్లో సాంకేతిక కారణాలతో సొమ్ము ఆలస్యంగా జమవుతోంది.
ఈసారి బ్యాంకు నుంచే సమాచారం
రైతుబంధు నగదు జమ చేయడంలో ప్రభుత్వం ఈసారి నూతన విధానాన్ని అమలు చేసింది. ముందుగా రైతుల ఖాతాలు, విస్తీర్ణంవారీగా జమ చేయాల్సిన మొత్తాన్ని లెక్కేసి వివరాలను రిజర్వు బ్యాంకుకు సమర్పించింది. దీంతో ‘ఈ-కుబేర్’ సాఫ్ట్‌వేర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమైంది. రైతుబంధు జమపై బ్యాంకు నుంచే సమాచారం రావడం ఇదే తొలిసారి. తొలి ఏడాది సకాలంలోనే చెక్కులిచ్చారు. తర్వాత మూడు విడతల నిధుల మంజూరు, పంపిణీలో జాప్యం జరిగింది. ఈసారి మాత్రం అలాంటివాటికి తావివ్వకుండా, ఒక్క రోజులోనే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి గంటకు మూడు లక్షల మంది ఖాతాల్లో నగదు జమైంది.
పక్కా ప్రణాళికతో..
వానాకాలం రైతుబంధుపై రైతుల్లో అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈ వానాకాలం నుంచి రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో చెప్పిన పంటలు వేసిన వారికే ఇస్తారని, ఈసారి రైతుబంధు జూలై తర్వాత వస్తుందనే అనుమానాలు నెలకొన్నాయి. ప్రభుత్వం మాత్రం రైతుల నుంచి వ్యతిరేకత రావద్దన్న ఉద్దేశంతో సకాలంలోనే సొమ్ము జమ చేసింది. ఇందుకోసం తొలుత రూ. 3501 కోట్లు, తర్వాత రూ. 2200 కోట్లు వ్యవసాయ శాఖకు జమ చేసింది. ఈసారి మొత్తం 59 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు కింద పెట్టుబడిసాయం చేసేందుకు ప్రభుత్వం రూ. ఏడు వేల కోట్లు కేటాయించింది. పోడు భూములను సాగు చేసుకునే 74,084 మంది గిరిజన రైతులు రూ. 124.23 కోట్లు జమయ్యాయి. దాదాపు 44 వేల ఎకరాలలో మొక్కజొన్న వేసిన రైతులకూ నగదు సాయాన్ని పంపిణీ చేశారు.
నాలుగైదు రోజుల్లో అందరికీ
రాష్ట్రంలో 57 లక్షల మంది పట్టాదారులున్నట్లు ప్రభుత్వం తొలుత లెక్క కట్టింది. జనవరి వరకు పాస్ పుస్తకాలు అందిన రైతులకు మాత్రమే రైతుబంధు అవకాశం కల్పించింది. చివరకు జూన్ 16 వరకు పాస్ పుస్తకాలు వచ్చిన వారు కూడా ఏఈఓల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. దీంతో రైతుల జాబితా 59.01 లక్షలకు చేరింది. మొత్తం సాగు భూమి 1.47 కోట్ల ఎకరాలుగా నమోదైంది. వీరందరికీ రైతుబంధు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది బ్యాంకు ఖాతా వివరాలు ఇంకా అనుసంధానం కాలేదు. ఇంటి పేర్లు, ఆధార్, పాసు పుస్తకాల్లో చిన్న చిన్న తేడాలు ఉండటమే ఇందుకు కారణం. ఈ ఐదు లక్షల మంది రైతుల వివరాలు మండలాల వారీగా ఏఈఓలకు చేరిన తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఈ నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఎలాంటి ఆంక్షలు లేవు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
రైతుబంధు పథకం అమలులో ఎలాంటి ఆంక్షలు లేవు. ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతా వివరాలు నమోదుచేసుకున్న రైతులందరి ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. గడిచిన 48గంటల్లో 54.21 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 6,886.19 కోట్లు జమ చేశాం. వీరిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టదారులు 74,084 మంది ఉన్నారు, వారికి రూ. 124.23 కోట్లు జమచేశాం. జనవరి నుంచి జూన్ 16వ వరకు పాస్ పుస్తకాలు అందిన రైతులు ఏఈఓల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలి. వారందరి ఖాతాలోకి నగదు జమ చేస్తాం. రైతుబంధు నిధులు జమకాని రైతుల సందేహాలు తీర్చాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశించాం. రైతన్నకు సాయంగా నిలవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం మూలంగానే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది. కేసీఆర్ వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ముందుగానే ఆదుకున్నారు : ముక్కెర చంద్రయ్య, మహాముత్తారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
రైతులకు పెట్టుబడి సాయం ముందుగానే విడుదల చేశారు. సోమవారమే మాకు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. కరోనా సమయంలో ఆలస్యం చేస్తారని భయపడ్డం. కానీ, ముందుగానే ఇచ్చి ఆదుకున్నారు.
సంతోషంగా ఉంది: నాంపల్లి. ఐలయ్య, ఇటుకాలపల్లి, నర్సంపేట మండలం
రైతు బంధు డబ్బులు రావడం సంతోషంగా ఉంది. నాకు రెండెకరాల భూమి ఉంది. నా ఖాతాలో పదివేలు జమయ్యాయి. ఎప్పటి లాగే ఈ ఏడూ పత్తి వేస్తున్నాను. పెట్టుబడి కోసం తిరగని చోటు లేదు. అడగని మనిషి లేడు గ్రామంలో. కరోనా దెబ్బకు డబ్బులు ఇవ్వడానికి సైతం జంకుతున్నారు. కేసీఆర్ చలవతో పెట్టుబడి బాధ తప్పింది.
సరైన సమయానికే: ఉల్లిరావుల చంద్రమౌళి, ఇటుకాలపల్లి, నర్సంపేట మండలం
రైతు బంధు సాయం సరైన సమయానికి అందింది. ఇప్పుడే దుక్కి దున్నడం పూర్తయ్యింది. ట్రాక్టర్ కిరాయికి డబ్బులు ఎలా ఇవ్వాలా అని సతమతమవుతున్న. సరైన సమయానికి దేవుడిలా కేసీఆర్ రైతు బంధు డబ్బుల రూపంలో ఆదుకున్నాడు.
రైతు కష్టాలు తెలిసిన సీఎం: కామిశెట్టి రమణి, శిర్ధేపల్లి, చండూర్
రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడంతోనే నేడు రైతులము అందరం సంతోషంగా ఉన్నాం. ఇలాంటి కష్ట సమయంలో రైతుబంధు డబ్బులు మా ఖాతాలలో జమ చేసినందుకు కేసిఆర్ కు ఋణపడి ఉంటాం.
కరోనా కష్టంలోనూ: జక్కిడి యాదిరెడ్డి, నారాయణపురం
కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మాకు వానాకాలం పెట్టుబడికి సహాయపడుతాయని రైతుబంధు ఇచ్చారు. కష్టంలో దేవుడిలా సీఎం కేసిఆర్ మమ్మల్ని ఆదుకున్నారు. ముఖ్యమంత్రికి పాదాభివందనం చేస్తున్నాం.
వ్యవసాయ భూమి ఉన్న రైతుల వివరాలు
విస్తీర్ణం | రైతుల సంఖ్య | ఆధీనంలో ఉన్న భూమి (లక్షల ఎకరాలు) | శాతం |
ఎకరం లోపు | 17,98,068 | 10.38 | 7.39 |
2 | 14,34,187 | 21.94 | 15.62 |
3 | 9,32,429 | 23.42 | 16.67 |
4 | 5,91,275 | 20.76 | 14.78 |
5 | 4,20,915 | 19.09 | 13.59 |
5 నుంచి 10 ఎకరాలు | 4,45,822 | 29.64 | 21.1 |
10 నుంచి 15 ఎకరాలు | 68,003 | 8.12 | 5.78 |
15 ఎకరాల కంటే ఎక్కువ | 33,416 | 7.11 | 5.06 |