కేటీఆర్​కు ఈ ముచ్చట తెలుసు.. కానీ, నో సీరియస్

by  |
కేటీఆర్​కు ఈ ముచ్చట తెలుసు.. కానీ, నో సీరియస్
X

దిశ, న్యూస్ బ్యూరో: కొత్త పరిశ్రమలను ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించింది. ఈ క్రమంలోనే టీఎస్ ఐపాస్ అమలు చేస్తోంది. టీ.ప్రైడ్, టి.ఐడియా వంటి అనేక పథకాల కింద రాయితీలను ప్రకటించింది. ఇందుకోసం నిధులను కూడా విడుదల చేస్తోంది. కానీ, అవి దారి తప్పుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీని తుంగలో తొక్కి పైరవీకారులకు పెద్దపీట వేశారని అంటున్నారు.

పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పెట్టుబడిదార్లను, పారిశ్రామికవేత్తలను, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకట్టుకుంటునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాయితీ లు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నారు. కానీ, అవి పారిశ్రామికవేత్తలకు అందడంలో మాత్రం ఎడతెగని జాప్యం జరుగుతోంది. అత్యవసరం అయినవారికీ అందడం లేదు. నిధులు విడుదల కాగానే కంపెనీలకు ఇష్టారీతిన కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీని పక్కకు పెడుతున్నారని అంటున్నారు. 15 రోజుల క్రితం విడుదలైన రూ.380 కోట్ల సర్దుబాటులో ఇలాగే జరిగిందని సమాచారం. కొన్ని కంపెనీలకే రాయితీలను పరిమితం చేశారనే విమర్శలు వస్తున్నాయి. వేలాది కంపెనీలు రాయితీలు, సబ్సిడీల కోసం ఎదురుచూస్తున్నా యి. ఐదేండ్ల నుంచి వేచి ఉన్న ఎంటర్ప్రెన్యూయర్లకు నిరాశే ఎదురైంది. పైరవీలు చేసిన కంపెనీలకే నిధులు అందాయని పలు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు, మం త్రుల ద్వారా అధికారులను కలిసినవారికి మాత్రమే నిధులొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఒక ప్రాంతానికి సంబంధించిన కంపెనీలే అధికంగా ఉన్నాయి. జూలై 27న పరిశ్రమల శాఖ రూ.380. 48 కోట్లు విడుదల చేసింది. ప్రాధాన్యక్రమంలో కంపెనీలకు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నిధులు రెండు, మూడేండ్ల క్రితం కంపెనీలు పెట్టిన వాళ్లకే దక్కాయి. ఐదేండ్ల నుంచి రాయితీ సొమ్ము కోసం ఎదురుచూస్తోన్న పారిశ్రామికవేత్తలకు మొండిచేయి చూపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు రూ.2,500 కోట్లకు పైగానే రాయితీలు బకాయిలు ఉన్నాయి. వీటిని సరిగా పరి శీలిస్తే సీనియారిటీ తప్పారా? తప్పించారా? అన్న అనుమానాలకు జవాబు దొరుకుతుందని పలువురు పారిశ్రామికవేత్తలు, ఎంటర్ప్రెన్యూయర్లు స్పష్టం చేస్తున్నారు.

‘పత్తి’కి మేలు చేయాలనేనా?

గతంలో సీనియారిటీ ప్రకారమే సబ్సిడీ సొమ్మును మంజూరు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం జీఓలోనే ప్రయారీటీ బేసెస్ అంటూ కొత్త భాష్యాన్ని చెప్పింది. స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ దఫా పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి అధికంగానే రానుంది. ఈ క్రమంలో జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల నిర్వహణ భారం కాకూడదని ప్రభుత్వం భావించిం దన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే రాష్ట్రంలో 300కు పైగా జిన్నింగ్, 30కి పైగా స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వాటన్నింటికీ రాయితీ సొమ్ము విడుదల చేయాలి. కానీ, ఒక ప్రాంతంలోని మిల్లులనే ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటన్నది ప్రశ్నగా మిగిలింది. తాము ఎమ్మెల్యే, మంత్రి ద్వారా సంప్రదింపులు జరుపలేదని, అందుకే తమకు నిధులు మంజూరు చేయలేదని ఓ పారిశ్రామికవేత్త ‘దిశ’కు వివరించారు. అన్యాయం జరిగిందని నలుగురికి చెప్పుకునే స్థితి కూడా లేదని, ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురి చేస్తారన్న భయం నెలకొందని అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఈ మిల్లులు నడుపుతున్నామని, ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. పైరవీకార్లకు మాత్రమే నిధులు విడుదల చేశారని ఆరోపించారు.

నిధులు అందుకున్నది వీరే

నిధుల విడుదలకు సంబంధించిన సర్క్యులర్లో 28 కంపెనీల పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. వాటికే రూ.80 కోట్ల వరకు విడుదలయ్యాయి. కొన్ని కంపెనీలకు ఏకంగా రూ.5 కోట్ల దాకా దక్కా యి. అధికంగా స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వాసవి కాటన్ ఇండస్ట్రిస్ కు రూ.2.38 కోట్లు, ములుగు జిల్లాలోని శ్రీ సాయిలక్ష్మీనర్సింహ స్వామి కాటన్ జిన్నింగ్ మిల్లుకు రూ.1.64 కోట్లు, వరంగల్ జిల్లా సప్తగిరి జిన్నింగ్, ప్రెస్సింగ్ కాటన్ ఇండస్ట్రిస్ కు రూ.2.95 కోట్లు, జనగామ జిల్లా నెల్లుట్లలోని ఓంశాంతి కాటన్ ఇండస్ట్రిస్ కురూ.2.07 కోట్లు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మంజునాధ ఇండస్ట్రిస్ కు రూ.1.66 కోట్లు, కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శివశివానీ కాటన్ ఇండస్ట్రిస్ కు రూ.1.95 కోట్లు, ఖమ్మం జిల్లా లక్ష్మీపురం వీరభద్ర తేజ పేపర్ కన్వర్టర్స్ కు రూ.1.15 కోట్లు, మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దపల్లిలోని నంది టైర్స్ ప్రైవేటు లిమిటెడ్ కు రూ.3.03 కోట్లు, జోగులాంబ గద్వాల జిల్లా శ్రీవరసిద్ధి వినాయక కాటన్స్ కు రూ.1.36 కోట్లు, శ్రీరాఘవేంద్ర ఫెర్రో అలోయిస్ ప్రైవేటు లిమిటెడ్ కు రూ.30.7 కోట్లు, సిద్ధిపేట జిల్లా మర్కుక్ లోని జోడాస్ ఎక్సోపొయిన్ ప్రైవేటు లిమిటెడ్ కు రూ.2.05 కోట్లు, సంగారెడ్డి జిల్లా రాయికొండెలోని తిరుపతి కాటన్ కార్పొరేషన్ కు రూ.4.16 కోట్లు, వరంగల్ జిల్లాలోని శ్రీరాజ్ కాటన్ ఇండస్ట్రిస్ కు రూ.2.05 కోట్లు, శ్రీశ్రీనివాస్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కు రూ.5.47 కోట్లు, యాదాద్రి భువనగిరిలోని నారాయణరెడ్డి ఆయిల్ ఎక్సట్రాక్షన్స్ కు రూ.1.91 కోట్లు, సుమో బిస్కట్స్ ప్రైవేటు లిమిటెడ్ కు రూ.1.99 కోట్లు, కేఎంపీ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కు రూ.3.53 కోట్లు, పంకజ్ పాలిటెక్నిక్ ప్రైవేటు లిమిటెడ్ కు రూ.1.70 కోట్లు.. ఇలా కంపెనీలకు రూ.కోట్లల్లో విడుదల చేశారు. ఐతే 28 కంపెనీలకు రూ.78.39 కోట్లు ప్రత్యేకంగా జాబితాను విడుదల చేశారు.

ఎంఎస్ఎంఈలకు చేయూత ఏదీ?

44 మందికి ప్రత్యేకంగా ఉత్తర్వుల ద్వారా నిధులను కేటాయించారు. ఈ విధానం ఏం సంకేతాలిస్తదో ప్రభుత్వమే ఆలోచించాలి. సీనియారిటీ తప్పడం 100 శాతం నిజమని మరో యూనియన్ నాయకుడు స్పష్టం చేశారు. 70 శాతం ఎంఎస్ఎంఈ రంగానికి కేటాయిస్తేనే న్యాయం జరుగుతుంది. పలుకుబడితోనే నిధులు విడుదల చేస్తున్నారన్నారు. మేం ‘‘మొదటి నుంచి పెద్ద కంపెనీ లను, చిన్న వాటిని ఒకే విధంగా చూడొద్దని కోరుతున్నాం. ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రత్యేకంగా చూడాలి. పెద్ద కంపెనీకి నష్టం వాటిల్లినా, ఇబ్బంది కలిగినా బ్యాంకులు ఓడీ ఇస్తాయి. చిన్న యూని ట్లకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఆత్మనిర్బర భారత్ కింద ఇవ్వమంటేనే సవాలక్ష షరతులు పెడుతున్నారు. కనీసం బ్యాంకర్లతో మాట్లాడి సబ్సిడీ సొమ్ము మేరకు గ్యారంటీ ఇచ్చి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని కోరుతున్నాం. అందుకే మేం ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఎంటిటీని సెపరేట్ గా ఉంచాలని పరిశ్రమల శాఖ అధికారులను కోరాం. పెద్ద మొత్తంలో నిధుల విడుదల మంత్రి కేటీఆర్ కు తెలియకుండా జరుగుతుందని ఎవరూ అనుకోవడం లేదు’’ అని ప్రధాన పారిశ్రామికవేత్తల సంఘం నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.



Next Story