గోదాంలో వ్యవసాయశాఖ అధికారి.. సొంత భవనాలకు మోక్షం ఎప్పుడు ?

by Sridhar Babu |
గోదాంలో వ్యవసాయశాఖ అధికారి.. సొంత భవనాలకు మోక్షం ఎప్పుడు ?
X

దిశ, శంకర్ పల్లి : ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు అభివృద్ధి పనుల కోసం నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా.. కానీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. శంకర్పల్లి మండలంలో విద్యాశాఖ కార్యాలయానికి సొంత భవనం లేక ఉన్న భవనం శిథిలావస్థకు చేరి కూలిపోవడానికి సిద్ధంగా ఉండటంతో ఆదర్శ పాఠశాలలో ఒక గదిలో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ కనీసం మండల కేంద్రంలో విద్యాశాఖకు సొంత భవనం నిర్మించుకో‌లేని స్థితిలో ఉంది. ఎన్నికలకు ముందు రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు కనీసం వ్యవసాయశాఖకు కార్యాలయ నిర్మాణం చేపట్టలేదన్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయానికి సొంత భవనం లేక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం పరిధిలోని ఓ గోదాంలో టేబుల్ కుర్చీ వేసుకొని వ్యవసాయాధికారి కాలం వెళ్లబుచ్చుతున్నాడు.

శంకర్పల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి సొంత భవనం నిర్మించక పోగా, క్లస్టర్ గ్రామాలలో రైతు వేదికలు నిర్మించి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు సైతం నిర్వహించారు. శంకర్పల్లి వ్యవసాయ శాఖ కార్యాలయానికి కాదు చేవెళ్ల అసెంబ్లీ పార్లమెంటు కేంద్రంలో వ్యవసాయ డివిజన్ సహాయక సంయుక్త సంచాలకుల కార్యాలయం కూడా సొంత భవనం లేక శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో కొనసాగుతుంది.

ఇవే కాదు చేవెళ్ల, శంకర్పల్లి మండలాలలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సొంత భవనాలు లేక, కనీస సౌకర్యాలు కూడా లేని అద్దె భవనాల్లో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంకర్ పల్లి‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ అందులో సొంత భవనం నిర్మించుకోక పోగా అద్దె భవనంలోనే కొనసాగుతుంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో సంబంధిత శాఖలకు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యుడు ఎమ్మెల్సీలు ఘోరంగా విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి..

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయం మార్కెట్ కమిటీ గోదాములో, విద్యాశాఖ కార్యాలయం ఆదర్శ పాఠశాల లోని ఒక గదిలో కొనసాగుతుంది. దీంతో అటు రైతులు ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో ఆదర్శ పాఠశాలలోని ఒక గదిలో కొనసాగుతుంది. మండలంలోని 26 గ్రామాలకు కేంద్రంగా ఈ కార్యాలయం కొనసాగాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తదితర పథకాల అమలు ఈ కార్యాలయం ద్వారా కొనసాగుతోంది.

జన్వాడ ప్రధానోపాధ్యాయుడు శంకర్పల్లి చేవెల్ల మండలాలకు ఇన్చార్జి ఎం.ఈ. ఓ.గా మూడు బాధ్యతలు నిర్వహిస్తూ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియకుండా పోతుంది. ఇకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి స్థలం కేటాయించినప్పటికీ భవనం నిర్వహించకుండా అద్దె భవనంలో కొనసాగించడం ఆపై హైదరాబాద్ రోడ్డుపై కొనసాగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. శంకర్ పల్లి చౌరస్తా నుంచి చౌరస్తా వరకు పేరుకు ఆరు లైన్ల రోడ్డు ఉన్నప్పటికీ వాహనాలన్నీ రోడ్డుపైనే నిలబెట్టడం ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed