అక్కడ జంతువులకు శ్మశానవాటిక!

by Shyam |
అక్కడ జంతువులకు శ్మశానవాటిక!
X

దిశ, వెబ్‌డెస్క్: చనిపోయిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. అంతేకాదు వారి ఆత్మకు శాంతికూరాలని దశదిన కర్మ, సంవత్సరీకం వంటి క్రతువులను బ్రాహ్మణుల చేత జరిపిస్తుంటాం. ఇదంతా మనుషుల విషయంలోనే జరుగుతుందని మనకు తెలుసు. కానీ పెట్ యానిమల్స్‌(జంతువులు)కు కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించి, వాటిని అక్కడే ఖననం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదెక్కడంటే..

ఏదైనా రోడ్డు ప్రమాదంలో లేదా సహజంగా కుక్కలు, ఇతర జంతువులు మరణిస్తే.. మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళ్లడం ఆలస్యమైతే, ఆలోగా అవి రోడ్డు పక్కన లేదా ఇతర ప్రదేశాల్లో కుళ్లిపోయి కనిపిస్తుంటాయి. కొందరు తమ పెట్ యానిమల్స్ మరణిస్తే కూడా వాటిని ఎక్కడ ఖననం చేయాలో తెలియక రోడ్ల పక్కనో, ఇంకెక్కడో పడేస్తుండటం సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. పెంపుడు, సాధారణ జంతువుల ఖననానికి పలు చర్యలు తీసుకుంటోంది. పెట్ క్యాట్స్, డాగ్స్ చనిపోయిన తర్వాత వాటిని ఖననం చేసేందుకు శ్మశాన వాటికను నిర్మిస్తోంది. ఇందుకు ద్వారకలో 700 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. ఇక్కడ పెట్ యానిమల్స్ ఖననం అనంతరం వాటి చితాభస్మాలను(అస్తికలు) 15 రోజులు భద్రపరచడంతో పాటు వాటికి క్రతువులు చేసేందుకు పూజారులను కూడా నియమించినున్నట్లు కార్పొరేషన్ తెలిపింది. ఇదంతా జరిపించేందుకు కార్పొరేషన్ పెట్ ఓనర్స్ దగ్గరి నుంచి చార్జీలు(డబ్బులు) వసూలు చేస్తోంది.

మున్సిపాలిటీ పరిధిలో లేని వారు కూడా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చని, ఒక పెట్‌కు అంత్యక్రియలు(చివరి ఖర్మలు) నిర్వహించేందుకు రూ.500గా ధర నిర్ణయిచినట్లు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. కుక్క, పిల్లి కాకుండా వేరే జంతువులు అయితే వాటి బరువును బట్టి ధర ఉంటుంది. ‘మనుషుల మాదిరిగా జంతువులకు కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే పూజారులను నియమించి, శ్మశాన వాటికకు స్థలం కేటాయించినట్లు కార్పొరేషన్ ఆఫీసర్లు తెలిపారు.

Advertisement

Next Story