కరోనా పరీక్షల కోసం.. ప్రత్యేక బూత్ లు

by  |
కరోనా పరీక్షల కోసం.. ప్రత్యేక బూత్ లు
X

దిశ వెబ్ డెస్క్: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ కొనసాగిస్తారా? లేదా అన్నది ఇంకా అధికారికంగా వెలువడలేదు. అందువల్ల అందరికీ మరో వారం రోజుల గడువే ఉంది. ఈ లోగా కరోనా అనుమానితులు ఎవరున్నా.. ఎంతమంది ఉన్నా.. అన్ని రాష్ట్రాలు వీలైనంతమందికి టెస్ట్ లు నిర్వహించాలని చూస్తున్నాయి. అందుకోసం వీలైనన్నీ మార్గాలను పరిశీలిస్తున్నాయి. తాజాగా ఘజియాబాద్ లో కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బూత్ ను ప్రారంభించారు. దక్షిణా కొరియా మోడల్ ను అనుసరించి ఈ తరహ మోడల్ ను మన దగ్గర ప్రవేశపెట్టారు.

ఒకప్పటి టెలిఫోన్ బూత్ లు ఎలా ఉండేవో మనందరికీ తెలుసు. కరోనా పరీక్షల కోసం ప్రస్తుతం ఏర్పాటు చేసిన బూత్ లు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే ప్రత్యక బూత్ ప్రారంభించారు. ఈ బూత్ ను గ్లాస్, అల్యూమినియంతో తయారు చేశారు. దీనిని ఘజియాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలకు వచ్చినవారు బూత్ లోని గ్లాస్ ముందు నిలబడాలి. వైద్య పరీక్షల ప్రక్రియ ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘టెలిఫోన్ బూత్’ పరీక్షా కేంద్రాల ఆధారంగా ఈ బూత్ రూపొందించారు. 21 రోజుల లాక్‌డౌన్ చివరి వారం కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ వైద్య పరీక్షలు వేగవంతమయ్యాయి. రాబోయే కొద్ది వారాల్లో మరిన్ని టెస్టింగ్ బూత్‌ లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఏంటీ ఉపయోగం:

కరోనా టెస్ట్ కోసం శాంపిల్ ఇవ్వాలనుకునే వ్యక్తి కియోస్క్ (బాక్స్) ముందు నిలబడాలి. గ్లాస్ అద్దం ముందు నిలబడితే… లోపలి వ్యక్తి… రబ్బరు గ్లోవ్స్ ధరించి… స్వాబ్ (swab) ద్వారా నోటి నుంచి ఓరల్ శాంపిల్ సేకరిస్తారు. ఐదు నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల శాంపిల్ ఇచ్చే వ్యక్తికీ, శాంపిల్ తీసుకునే వ్యక్తికీ మధ్య కాంటాక్ట్ ఉండదు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి కరోనా ఉన్నా… అది రెండో వ్యక్తికి సోకదన్నమాట. మన దేశంలో ట్రాఫిక్ పోలీస్ బూత్‌ల లాగే ఇవీ ఉంటాయి. ఇప్పటికే కేరళ, జార్ఖండ్ ప్రభుత్వాలు ఇలాంటి బూత్ లను ఏర్పాటు చేసి టెస్టులు చేస్తున్నాయి. ముంబై ప్రభుత్వం కూడా దీన్ని ప్రారంభించాలనుకుంటోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేయబోతోంది. మామూలుగా కరోనా టెస్టులు జరిపేవారు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE)కలిగి ఉండాలి. కానీ మన దేశంలో చాలా తక్కువ పీపీఈ లు ఉండటంతో .. వాటిని డాక్టర్లు, కరోనా బాధితునికి అతి చేరువలో ఉండే నర్సులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వీలైనంతగా పీపీఈ లు ధరించకుండా .. పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ కియోస్కుల ద్వారా PPE లేకుండానే టెస్టులు చెయ్యవచ్చు. ఫలితంగా ఇది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పిపిఇ) కిట్ వాడకాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుతానికి ఘజియాబాద్ బూత్‌లో PPE ధరించే శాంపిల్స్ తీసుకుంటున్నారు. కానీ ఆ అవసరమైతే లేదు. ఈ ప్రత్యేక బూత్ లను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది.

Tags: corona virus, booth test, kiosk, delhi ncr, covid 19 test, samples, swab


Next Story