బ్యాట్లెత్తేసిన చెన్నై.. కనీస పోటీ ఇవ్వని ధోనిసేన

by  |
బ్యాట్లెత్తేసిన చెన్నై.. కనీస పోటీ ఇవ్వని ధోనిసేన
X

దిశ, స్పోర్ట్స్ : బౌలింగ్‌లో కసి లేదు. బ్యాటింగ్‌లో మెరుపులు లేవు. గెలవాలనే ఆరాటం లేదు. కనీస పోరాటం లేదు. ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్ తీరు. మరోసారి అన్ని విభాగాల్లో విఫలమైన ధోని సేన ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. కనీస పోరాటం లేకుండానే చాప చుట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుర్రాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

ఐపీఎల్-13 సీజన్‌ను విజయంతో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. శుక్రవారం దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని సేన అన్ని విభాగాల్లో విఫలమై 44 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో టెస్టు మ్యాచ్ ఆడినట్లు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. వికెట్లు పడుతున్నా సరైన సమయంలో ధోని క్రీజులోకి రాకపోవడంతో సీఎస్కే తగిన మూల్యం చెల్లించుకుంది.

ఢిల్లీ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సీఎస్కే ఓపెనర్లు మురళీ విజయ్ (10), షేన్ వాట్సన్ (14) అంచనాలను అందుకోలేక పోయారు. చాలా నెమ్మదిగా ఆడుతు బంతులను వృథా చేశారు. అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్ రెండో బంతికి వాట్సన్ అవుటయ్యాడు. పవర్ ప్లేలో చివరి బంతికి మురళీ విజయ్ కూడా పెవిలియన్ చేరాడు. అప్పటికి చెన్నై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్ (5) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఫాఫ్ డు ప్లెసిస్ (43), కేదార్ జాదవ్ (26) కలసి లక్ష్యం దిశగా సాగినట్లు కనిపించినా.. వారిద్దరూ వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. 16వ ఓవర్ నాలుగో బంతికి ఎన్రిక్ నోర్జే బౌలింగ్‌లో కేదార్ జాదవ్ ఎల్బీగా అవుటయ్యాడు. మరో రెండు ఓవర్ల తర్వాత రబాడా బౌలింగ్‌లో డు ప్లెసిస్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అప్పటికే చేయాల్సిన పరుగులు భారీగా ఉన్నాయి. రబాడా వేసిన చివరి ఓవర్లో ధోని (15), జడేజా (12) కూడా అవుటయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 7 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సీఎస్కే జట్టు బౌలింగ్‌లో వికెట్ల తీయలేకపోవడం, ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది. రబాడా 3, నోర్జే 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

ఫృథీ ‘షో’..

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ పృథ్వీషా తన బ్యాట్‌తో అలరించాడు. ఓపెనర్లు పృథ్వీషా (43 బంతుల్లో 64), శిఖర్ ధావన్ (27 బంతుల్లో 35) కలసి తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించారు. వీరిద్దరూ శుభారంభం చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు చేయగలిగింది. సెంచరీ భాగస్వామ్యం అందిస్తారనుకున్న సమయంలో చావ్లా బౌలింగ్‌లో ధావన్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

మరి కొద్ది సేపటికే చావ్లా బౌలింగ్‌లో పృథ్వీషా స్టంప్ అవుట్ అయ్యాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ (37), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. అయితే కరన్ వేసిన 19వ ఓవర్ చివరి బంతికి అయ్యర్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మార్కస్ స్టొయినిస్ (5) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పియుష్ చావ్లా 2 వికెట్లు తీయగా, కరన్‌కు ఒక వికెట్ లభించింది.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (స్టంప్డ్) ధోని (బి) చావ్లా 64; ధావన్ ఎల్‌బీడబ్ల్యూ (బి) చావ్లా 35; రిషబ్ పంత్ నాటౌట్ 37; శ్రేయస్ అయ్యర్ (స్టంప్డ్) ధోని (బి) సామ్ కర్రన్ 26; స్టొయినిస్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 175

వికెట్ల పతనం: 1-94, 2-103, 3-161

బౌలింగ్: చాహర్ 4-0-38-0; సామ్ కర్రన్ 4-0-27-1; హాజెల్‌వుడ్ 4-0-28-0; పియుష్ చావ్లా 4-0-33-2; రవీంద్ర జడేజా 4-0-44-0

ముంబయి ఇండియన్స్: మురళీ విజయ్ (సి) రబాడ (బి) ఎన్రిక్ నోర్జ్ 10; వాట్సన్ (సి) హెట్‌మెయర్ (బి) అక్షర్ పటేల్ 14; ఫాఫ్ డు ప్లెసిస్ (సి) పంత్ (బి) రబాడ 43; రుతురాజ్ గైక్వాడ్ రనౌట్ (పంత్/ పటేల్) 5; కేదార్ జాదవ్ ఎల్‌బీడబ్ల్యూ 26; ఎంఎస్ ధోని (సి) పంత్ (బి) రబాడ 15; రవీంద్ర జడేజా (సి) మిశ్రా (బి) రాబాడ 12; సామ్ కర్రన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 131

వికెట్ల పతనం:1-23, 2-34, 3-44, 4-98, 5-113, 6-130, 7-131

బౌలింగ్: రబాడ 4-0-26-3; అక్షర్ పటేల్ 4-0-18-1; ఎన్రిక్ నోర్జ్ 4-0-21-2; అవేష్ ఖాన్ 4-0-42-0; అమిత్ మిశ్రా 4-0-23-0

పాయింట్స్ టేబుల్


Next Story