ఏపీలో కొత్త జిల్లాలపై 19న నిర్ణయం

by srinivas |
jagan cabinet
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా విజృంభన.. కొత్త జిల్లా ఏర్పాటు.. ఇళ్ల పట్టాల పంపిణీ..ఇలా కీలక అంశాలు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రధాన అంశాలు. వీటిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అత్యవసర సమయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు సీఎం జగన్ సన్నద్ధం అవుతున్నారు.

సీఎం జ‌గన్ అధ్య‌క్ష‌త‌న జరగనున్న ఈ భేటీలో ప‌లు కీల‌కాంశాల‌పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. స‌మావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చర్చించ‌నున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై క‌మిటీ వేయ‌డంతో ఈ అంశంపై ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌రోవైపు రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా ప్ర‌ధానంగా కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించ‌బోతున్నార‌ని స‌మాచారం.

కాగా ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా పెర‌గ‌డంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి స‌మయంలో ప్ర‌భుత్వం ఈ కేబినెట్ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోబోతుందో కీల‌కంగా మార‌నుంది. మ‌రోవైపు పాఠ‌శాల‌లు, కాలేజీలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ఎప్పుడు పంపిణీ చేయాలి? అనే వాటిపై కూడా ఒక‌ స్ప‌ష్ట‌త‌కు రానున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

Next Story