నిర్లక్ష్యంతో మృతదేహాలు తారుమారు..!

by  |
నిర్లక్ష్యంతో మృతదేహాలు తారుమారు..!
X

దిశ, నిజామాబాద్ రూరల్: కరోనా కారణంగా చనిపోయిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంలో ప్రైవేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు భయాందోళనకు గురిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమాన్లు.. గత 11 రోజుల క్రితం కొవిడ్-19 కారణంగా జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‎లోని సన్‎షైన్ ఆస్పత్రికి తరలించారు. కాగా, తీవ్ర అస్వస్థతతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

శనివారం ఉదయం మృతదేహాన్ని సన్‎షైన్ ఆస్పత్రి అంబులెన్స్ గన్నారం గ్రామంలోని స్మశాన వాటికకు తరలించారు. మృతదేహాన్ని కట్టెలపై ( కాష్టం) పడుకోబెట్టి ముఖాన్ని చూడగా.. ఆ మృతదేహం అంకం హనుమాన్లది కాదని కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు, గ్రామస్తులు సన్‎షైన్ ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్లు మృతదేహం కాకుండా వేరేవారిది పంపించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే హనుమాన్లు చికిత్స నిమిత్తం రూ.15 లక్షల వరకు ఖర్చు అయిందని.., అయినా ప్రాణాలు మాత్రం దక్కలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలు తారుమారు చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్య ధోరణి ఏంటో అర్ధమవుతోందని గ్రామస్తులు విమర్శించారు.



Next Story