వారం రోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్..!

by Anukaran |
వారం రోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్..!
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో కీలక ముందడుగు పడింది. పుణెలోని సీరం ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌‌ఫర్డ్, ఆస్ట్రాజెనికాకు చెందిన కొవిషీల్డ్, హైదరాబాద్‌‌కు చెందిన భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌‌ టీకాలను అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు మంజూరు చేసింది. తగిన పరిశీలనల అనంతరం ఎక్స్‌‌పర్ట్ కమిటీ సిఫారసులను ఆమోదించాలని సీడీఎస్‌‌సీఓ నిర్ణయించిందని డీసీజీఐ తెలిపింది. అత్యవసర వినియోగానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్‌‌‌‌లకు అనుమతులు మంజూరు చేస్తూనే కాడిల్లా హెల్త్‌‌కేర్ ‌‌ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌‌కు అనుమతించింది.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమాని ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సీరం, భారత్‌‌ బయోటెక్‌‌ రెండు సంస్థలు కూడా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ డేటాను సమర్పించాయని, అత్యవసర వినియోగం కోసం రెండు టీకాలకు అనుమతులను మంజూరు చేశామని తెలిపారు. టీకా దుష్ప్రభావాలపై ఆయన స్పందిస్తూ భద్రతాపరంగా ఏ చిన్న లోపం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌‌కు అనుమతులు ఇవ్వమని, రెండు టీకాలు కూడా 110 శాతం సురక్షితమని తెలిపారు. వ్యాక్సిన్ ఏదైనా సరే స్వల్ప జ్వరం, నొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎ‌‌ఫెక్ట్స్ సర్వసాధారణమని తెలిపారు. కొంత మంది చేస్తున్న ఆరోపణలు పూర్తి అసంబద్ధమని పేర్కొన్నారు. సీరం ఇన్‌‌స్టిట్యూట్‌‌కు చెందిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ 70.42 శాతం సమర్థవంతమైందని, భారత్‌‌ బయోటెక్‌‌కు చెందిన కొవాగ్జిన్ కూడా పూర్తి సురక్షితమైందని, బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన కలిగి ఉందని చెప్పారు.

త్వరలో ప్రధాని లాంచింగ్

రెండు రకాల వ్యాక్సిన్లకు అనుమతి లభించడంతో ప్రధాని నరేంద్రమోడీ త్వరలోనే లాంఛనంగా ప్రకటన చేసి డోస్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీరం సంస్థ సుమారు ఎనిమిది కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేసి సిద్ధంగా ఉంచినట్లు ఆ సంస్థ వర్గాల సమాచారం. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా కొవాగ్జిన్ పేరుతో భారత్ బయోటెక్ సంస్థ కూడా సుమారు కోటికి పైగా డోస్‌లను తయారుచేసి సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. తొలి దశలో కోటి మంది హెల్త్ కేర్ వర్కర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించినందున ఆ అవసరాలకు సరిపోయేంత స్టాకు తక్షణం రెడీగా ఉంది. ఇక ప్రధాని లాంఛనంగా ప్రకటించి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడమే తరువాయి.

వారం రోజుల్లో తెలంగాణకు పది లక్షల డోస్‌లు

కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడంతోనే తెలంగాణకు కూడా తొలి విడతగా పది లక్షల మేర డోస్‌లు అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో 2.90 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్ల వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నమోదుచేసింది. వీరికి తోడు పోలీసు శాఖ తరపున సుమారు 40 వేల మంది, జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు మరో పాతిక వేల మంది వరకు వివరాలను ‘కొవిన్’లో నమోదు చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతోనే తెలంగాణకు కూడా అవసరమైన డోస్‌లు అందుతాయని, వెంటనే ఇవ్వడానికి సకల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ప్రజారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.

తెలంగాణకు ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ వస్తుందనే దానిపై అంచనాలు ఎలా ఉన్నా హైదరాబాద్‌లోనే తయారవుతున్న కొవాగ్జిన్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రవాణా సమయం తగ్గడంతో పాటు వెంటనే పంపిణీ చేయడానికి వీలు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద సుమారు మూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ తొలి దశలోనే జరిగే అవకాశం ఉన్నందున కనీసంగా ఆరు లక్షల డోస్‌లు, రిజర్వులో మరో పదిహేను శాతం మేర వచ్చే అవకాశం ఉందని వారి అభిప్రాయం. రవాణా ప్రయాసలను వీలైనంతగా తగ్గించాలనే ఆలోచన కేంద్ర వైద్యారోగ్య శాఖకు ఉన్నందున దక్షిణాది రాష్ట్రాలకు కొవాగ్జిన్ అందే అవకాశం ఉంది.

కొవిషీల్డ్ 70.42 శాతం సమర్థత

ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్‌‌లో పాల్గొన్న 73 వేల మందికి సంబంధించిన డేటాను సీరం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీసీజీఐకి సమర్పించింది. 70.42 శాతం సమర్థతను కలిగి ఉన్నట్లు పేర్కొంది. భారత్‌‌లో నిర్వహించిన రెండో, మూడో దశ ట్రయల్స్‌‌లో 1600 మంది పాల్గొన్నారు. అత్యవసర వినియోగం కోసం అనుమతులు లభించినా క్లినికల్ ట్రయల్స్‌‌ను కొనసాగించాలని సూచించింది. ఇప్పటికే పలు దేశాల్లో అత్యవసర వినియోగం కోసం కొవిషీల్డ్ టీకాను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

కొనసాగనున్న కొవాగ్జిన్ ట్రయల్స్

భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ టీకా ట్రయల్స్‌‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌‌తో కలిసి నిర్వహించింది. మొత్తం 800 మందిపై మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ డేటా ఆధారంగా కొవాగ్జిన్ సురక్షితం, బలమైన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని తేలిందని డీసీజీఐ తెలిపింది. మూడో దశ ట్రయల్స్‌‌కు భారత్ బయోటెక్ సిద్ధమవుతున్నది. మొత్తం 25,800 మందిపై ట్రయల్స్‌‌ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 22,500 మంది పేర్లను నమోదు చేసుకున్నారు.

ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాలి : మోడీ

స్వదేశంలో తయారు చేసిన రెండు టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కలను నెరవేర్చడానికి మన శాస్త్రీయ సమాజం ఆతృతను ఇది వ్యక్తం చేస్తోందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసుల సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఇతర కరోనా వారియర్స్‌‌కు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారికి ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

శ్రమకు తగిన ఫలితం : అధర్ పూనావాలా

కొవిషీల్డ్ టీకాకు డీసీజీఐ అనుమతివ్వడాన్ని సీరం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అధర్ పూనావాలా స్వాగతించారు. వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సీరం చేసిన శ్రమకు ఈరోజు తగిన ఫలితం లభించిందన్నారు. భారత్ మొట్టమొదటి కొవిడ్-19 వైరస్‌‌ వ్యాక్సిన్‌‌ కొవిషీల్డ్‌‌కు అనుమతులు వచ్చాయని, వచ్చే కొన్ని వారాల్లో సురక్షితమైన, సమర్థవంతమైన టీకా పంపిణీకి సిద్ధంగా ఉన్నామని అధర్ పూనావాలా పేర్కొన్నారు.

కొవాగ్జిన్‌‌కు అనుమతిపై అసంతృప్తి : శశిథరూర్

భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌‌కు అనుమతులివ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవాగ్జిన్ టీకా ఇంకా మూడో దశ ట్రయల్స్‌‌ను పూర్తి చేసుకోలేదని, కానీ ఆ టీకా పంపిణీకి అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టత ఇవ్వాలన్నారు. మూడో దశ ట్రయల్స్ పూర్తయ్యే వరకు కొవాగ్జిన్ టీకా వినియోగించకుండా ఉండాలని సూచించారు. ప్రస్తుత సమయంలో సీరం ఇన్‌‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ టీకా పంపిణీని ప్రారంభించాలని శశిథరూర్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed