వారేవా ఢిల్లీ

by Shyam |   ( Updated:2021-04-10 20:24:52.0  )
వారేవా ఢిల్లీ
X

దిశ, స్పోర్ట్స్ : ముంబైలోని వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారింది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించినా.. ముంబై వాంఖడేలో మాత్రం బ్యాట్లు గర్జించాయి. బౌలర్ ఎవరైనా బౌండరీలు వచ్చాయి. రెండేళ్ల తర్వాత ఆడిన రైనా దూకుడు ప్రదర్శించగా.. ఇండియాతో జరిగిన వన్డే సిరీస్ ఫామ్‌ను సామ్ కర్రన్ కొనసాగించాడు. మరోవైపు ఛేదనలో ఢిల్లీని ఆపే బౌలరే లేకపోయాడు. గ్రౌండ్‌లో అసలు ఫీల్డర్లు ఉన్నారా లేదా అనే అనుమానం కలిగేలా ధావన్, పృథ్విషా రెచ్చిపోయారు. సెంచరీ భాగస్వామ్యంతో ఢిల్లీని విజయం వైపు నడిపించి అవుటైనా.. చివర్లో పంత్, స్టొయినిస్ లక్ష్యాన్ని ఛేదించారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే పంత్ విజయం సాధించి.. గురువు ధోనీపై పై చేయి సాధించాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 189 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు చెలరేగిపోయారు. పృథ్విషా, శిఖర్ ధావన్ కలసి తొలి బంతి నుంచే చెన్నై బౌలర్లను చితకబాదారు. బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అసలు వారిద్దరినీ నిలువరించడానికి సీఎస్కే కెప్టెన్ ధోనీ వద్ద వ్యూహాలే లేకుండా పోయాయి. బౌలర్ ఎవరైనా బౌండరీలు, సిక్సులు కొట్టడమే ధ్యేయంగా చెలరేగిపోయారు. ఈ క్రమంలో ధావన్, పృథ్విషా అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు.

తొలి వికెట్‌కు వీరిద్దరూ కలసి 138 పరుగుల భాగస్వామ్యం అందించారు. డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో పృథ్విషా (72) మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన పంత్ (15) ఓపెనర్ ధావన్‌కు తోడుగా నిలిచాడు. అయితే 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 85 పరుగులు చేసిన శిఖర్ ధావన్.. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. కానీ అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యానికి చేరువగా వచ్చింది. చివర్లో మార్కస్ స్టొయినిస్ (14) అవుటైనా కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ కేవలం 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్‌ను 7 వికెట్ల విజయంతో ఢిల్లీ ప్రారంభించింది. శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా, డ్వేన్ బ్రావోకు ఒక వికెట్ లభించింది. శిఖర్ ధావన్ మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ో అవార్డు అందుకున్నాడు.

రైనా అర్దసెంచరీ.. సామ్ కర్రన్ మెరుపులు

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం లభించలేదు. ఆ జట్టు ఓపెనర్ ఫామ్ డు ప్లెసిస్ (0) పరుగులేవీ చేయకుండానే అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) నిరాశ పరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ పెవీలియన్ చేరాడు. దీంతో 7 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయి సీఎస్కే కష్టాల్లో పడింది. జట్టులోకి కొత్తగా వచ్చిన మొయిన్ అలీ, ఒక సీజన్ గ్యాప్ తర్వాత ఐపీఎల్ ఆడుతున్న సురేష్ రైనా కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దూ కలసి ఢిల్లీ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వీరిద్దరూ కలసి బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డు వేగం పెంచారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ కలసి 53 పరుగులు జోడించాడు. మంచి దూకుడు మీద ఉన్న మొయిన్ అలీ (36) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత రైనాతో కలసిన అంబటి రాయుడు కూడా వేగంగా ఆడాడు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. టామ్ కర్రన్ బౌలింగ్‌లో అంబటి రాయుడు.. ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మరోవైపు రైనా తన దూకుడును కొనసాగించాడు.

ఈ క్రమంలో రైనా అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలసి పరుగుల వేగం పెంచుతున్న క్రమంలో అనుకోకుండా రైనా (54) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ధోనీ (0) తొలి బంతికే అవేష్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. సామ్ కర్రన్ గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ముఖ్యంగా అన్నయ్య టామ్ కర్రన్ వేసిన ఒక ఓవర్లు సిక్సు, ఫోర్లు బాది పరుగులు రాబట్టాడు. మరోవైపు రవీంద్ర జడేజా 26 పరుగులు చేశాడు. క్రిస్ వోక్స్ వేసిన ఆఖరి బంతికి సామ్ కర్రన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. 7 నుంచి 15 ఓవర్ మధ్యలో చెన్నై బ్యాట్స్‌మెన్ 100కు పైగా పరుగులు జోడించడం గమనార్హం. క్రిస్ వోక్స్, అవేశ్ ఖాన్ చెరి రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, టామ్ కర్రన్ తలా ఒక వికెట్ తీశారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్

రుతురాజ్ గైక్వాడ్ (సి) శిఖర్ ధావన్ (బి) క్రిస్ వోక్స్ 5, ఫాఫ్ డు ప్లెసిస్ (ఎల్బీడబ్ల్యూ)(బి) అవేశ్ ఖాన్ 0, మొయిన్ అలీ (సి) శిఖర్ ధావన్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 36, సురేష్ రైనా (రనౌట్) 54, అంబటి రాయుడు (సి) శిఖర్ ధావన్ (సి) టామ్ కర్రన్ 23, రవీంద్ర జడేజా 26 నాటౌట్, ఎంఎస్ ధోనీ (బి) అవేశ్ ఖాన్ 0, సామ్ కర్రన్ (బి) క్రిస్ వోక్స్ 34; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లు) 188/7

వికెట్ల పతనం : 1-7, 2-7, 3-60, 4-123, 5-137, 6-137, 7-188

బౌలింగ్ : క్రిస్ వోక్స్ (3-0-18-2), అవేశ్ ఖాన్ (4-0-23-2), రవిచంద్రన్ అశ్విన్ (4-0-47-1), టామ్ కర్రన్ (4-0-40-1), అమిత్ మిశ్రా (3-0-27-0), మార్కస్ స్టొయినిస్ (2-0-26-0)

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్

పృథ్వి షా (సి) మొయిన్ అలీ (బి) డ్వేన్ బ్రావో 72, శిఖర్ ధావన్ (ఎల్బీడబ్ల్యూ)(బి) శార్దుల్ ఠాకూర్ 85, రిషబ్ పంత్ 15 నాటౌట్, మార్కస్ స్టొయినిస్ (సి) సామ్ కర్రన్ (బి) శార్దుల్ ఠాకూర్ 14, హెట్‌మెయర్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.4 ఓవర్లు) 190/3

వికెట్ల పతనం : 1-138, 2-167, 3-18

బౌలింగ్ : దీపక్ చాహర్ (4-0-36-0), సామ్ కర్రన్ (2-0-24-0), శార్దుల్ ఠాకుర్ (3.4-0-53-2), రవీంద్ర జడేజా (2-0-16-0), మొయిన్ అలీ (3-0-33-0), డ్వేన్ బ్రావో (4-0-28-1)

Advertisement

Next Story