మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి: దాసోజు శ్రవణ్

by Shyam |
మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి: దాసోజు శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు నాయకుడినని చెప్పుకునే సీఎం కేసీఆర్ కు వారి మీద ప్రేమ ఉంటే రైతుల నడ్డి విరిచే వ్యవసాయ చట్టాలను రద్దు చేయటానికి ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ కుమార్​ డిమాండ్​ చేశారు. పంజాబ్ తరహాలో కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల్ని తిరస్కరించి కొత్త వ్యవసాయ బిల్లును ఆమోదించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న, అట్టడుగు వర్గాల భూముల రక్షణ కోసం మరో బిల్లును కూడా పంజాబ్ ప్రభుత్వం ఆమోదించిందన్నారు.

కనీస మద్దతు ధరతో వివిధ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుచేయడానికి ధరల భరోసా, వ్యవసాయ సేవలపై రైతుల సాధికారత, రక్షణ ఒప్పందంపై ప్రత్యేక నిబంధనలతో పంజాబ్ సవరణ బిల్లు 2020 ఆమోదించినట్లు చెప్పారు. గడిచిన ఏడేండ్లుగా టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో మోడీ అవలంభిస్తోన్న విధానాలకు మద్దతు ఇస్తోందన్నారు. కరెన్సీ రద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ వంటి అనేక విషయాల్లో కేంద్రానికి మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. నిర్బంధ వ్యవసాయం చేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.

మోడీకి భయపడి కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేయలేకపోతున్నారని, కొత్త వ్యవసాయ బిల్లులను రూపొందించడానికి భయపడుతున్నారన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతు వ్యతిరేక చట్టాలను నిరోధించడానికి కొత్త చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు చాలా తెలివైన వారని, టీఆర్ఎస్ రాజకీయ నాటకాలను అర్థం చేసుకోగలన్నారు.

Advertisement

Next Story

Most Viewed